logo

డబ్బులిస్తేనే దస్త్రం కదిలేది..!

నగరంలో భవన నిర్మాణ అనుమతులు రోజురోజుకు భారం అవుతున్నాయి.  అధికారులు బహిరంగంగానే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కో అనుమతికి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చాకే దస్త్రాలు కదిలిస్తున్నారు.

Published : 13 Jun 2024 05:51 IST

భవన నిర్మాణాల అనుమతులకు కొర్రీలు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

నగరంలో భవన నిర్మాణ అనుమతులు రోజురోజుకు భారం అవుతున్నాయి.  అధికారులు బహిరంగంగానే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కో అనుమతికి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చాకే దస్త్రాలు కదిలిస్తున్నారు. లేదంటే రోజుల తరబడి తిరగాల్సిందే. కాదు, కూడదంటే.. అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తు ఎక్కడుందో తెలియదు, ఏ అధికారి, ఏ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను అడగాలో తెలియని పరిస్థితి నెలకొంది. 250 గజాల్లోపు భవన నిర్మాణ అనుమతుల జాప్యంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

టౌన్‌ ప్లానింగ్‌కు అప్పగించడంతో..

సులభతరం, పారదర్శకమంటూ మూడేళ్ల క్రితం కొత్తగా టీఎస్‌-బీపాస్‌ అమలులోకి తెచ్చారు. భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతిని కట్టడి చేసేందుకు మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని పక్కన పెట్టారు. కీలకమైన స్థల పరిశీలన పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖ ఏఈలతో చేయించారు. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు సాంకేతిక(టెక్నికల్‌), దస్తావేజుల పరిశీలన(డాక్యుమెంటేషన్‌ వెరిఫికేషన్‌) చేశారు. ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. గతేడాది 2023 ఆగస్టు నుంచి మళ్లీ టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి అప్పగించేశారు. స్థల పరిశీలన, సాంకేతిక, దస్తావేజుల పరిశీలనంతా అసిస్టెంట్‌ సిటీప్లానర్, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు చూస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

  • ప్రైవేటు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల(ఎల్‌టీపీలు) ద్వారా డబ్బులడుగుతున్నారని తెలిసింది. కింది స్థాయి ఉద్యోగులే కాదు, అధికారులు మామూళ్లు కావాలని ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలున్నాయి. కాజీపేట, కాశీబుగ్గ సర్కిల్‌ కార్యాలయాల అధికారులకు సైతం నగదు ముట్టజెప్తున్నట్లు సమాచారం.

ఇవిగో సాక్ష్యాలు..

పాతబస్తీ ప్రాంతం ఉర్సుగుట్ట రోడ్డులో లేఅవుట్‌ కాలనీలో భవన నిర్మాణ అనుమతి కోసం ఓ సాధారణ పౌరుడు దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్‌ కాలనీ కాబట్టి వెంటనే ఇచ్చేయాలి. నాలా ఉందని, మార్కింగ్‌ చేయలేదని క్షేత్రస్థాయి ఉద్యోగి తిరస్కరించారు. సదరు పౌరుడు నేరుగా ఓ అధికారి వద్దకెళ్లి.. డబ్బు ముట్టజెప్పి రెండు, మూడు రోజుల్లో భవన నిర్మాణ అనుమతి పొందారు.

  • ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట, పెరుకవాడ, రామన్నపేట, కాశీబుగ్గ ప్రాంతాల్లో పాతకాలం నాటి నివాస గృహాలున్నాయి. ఆబాది కింద 1984, 1991 అసెస్‌మెంట్‌ కాపీలు సమర్పిస్తే తక్కువ ఖర్చుతో బిల్డింగ్‌ పర్మిషన్లు ఇవ్వాలి. అన్ని సమర్పించినప్పటికీ క్షేత్రస్థాయి ఉద్యోగులు రూ.10-15 వేలు డిమాండ్‌ చేస్తున్నారు.
  • వరంగల్‌ ప్రాంతంలో నిబంధనల ప్రకారం అన్నీ ఉండటంతో టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారి, ఉద్యోగి అనుమతి ఇచ్చారు. ఫార్మల్‌ సంతకం చేసే అధికారి రూ.2 వేలు డిమాండ్‌ చేశారని తెలిసింది.
  • తిమ్మాపూర్‌ శివారులో భవన నిర్మాణ అనుమతికి క్షేత్రస్థాయి ఉద్యోగి సరే అన్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారి డబ్బులివ్వక పోవడంతో పక్కన పెట్టేశారు.
  • భీమారం చింతగట్టు శివారులో మూడు భవన నిర్మాణ అనుమతుల అర్జీలు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంది. వెంటనే ఇచ్చేయాలి. డబ్బులు కోసం ఆలస్యం చేస్తున్నారు.
  • హనుమకొండ వడ్డేపల్లి, కేయూసీ వంద అడుగుల రోడ్డులో రెండు అనుమతుల్లో రూ.15 వేల చొప్పున వసూలు చేశారని తెలిసింది.

ఇంటి నిర్మాణానికి రూ.80 వేలు ఇచ్చాను

నర్సంపేట, న్యూస్‌టుడే: నర్సంపేట పురపాలక అధికారులకు ముడుపులు ఇస్తేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారని, లేదంటూ కొర్రీలు పెడుతూ తిప్పలు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక పదో వార్డుకు చెందిన ఒకరు (పేరు రాసేందుకు ఇష్టపడలేదు) గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు పై అంతస్తుతో ఇంటి నిర్మాణం చేపట్టాడు. మున్సిపాల్టీ అనుమతి కోసం అన్ని రకాల దస్తావేజులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నిర్ణీత రుసుంను చెల్లించారు. పురపాలక సిబ్బంది చిన్న సమస్యలను సాకుగా చూపించి అనుమతి ఇచ్చేందుకు కాలయాపన చేశారు. దీంతో బాధితుడు సిబ్బందికి రూ.80 వేలను ముట్టచెప్పడంతో అనుమతి ఇచ్చారు. ఇది ఒక్కరి సమస్యే కాదు. పట్టణంలో సొంతిల్లు కట్టుకునే ప్రతి ఒక్కరి సమస్య. పట్టణానికి చెందిన మరొకరు 111 సర్వే నెంబరులో ఇల్లు నిర్మించుకునేందుకు పురపాలక సిబ్బందికి కొంత మొత్తం లంచంగా ఇచ్చినట్లు తెలిపారు. పురపాలికలో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం మూడు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు టీపీవో వీరాస్వామి తెలిపారు.  వారం రోజుల్లో అనుమతి ఇస్తామన్నారు. 


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
 వెంకన్న, సిటీప్లానర్, గ్రేటర్‌ వరంగల్‌

లోక్‌సభ ఎన్నికల కోడ్, విధుల నిర్వహణతో టీఎస్‌-బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఆలస్యమయ్యాయి. వారం రోజుల్లో అన్ని క్లియర్‌ చేశాం. భవన నిర్మాణ అనుమతి కోసం ఎవరైనా డబ్బులడిగినట్లుగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని