logo

రెక్కల కష్టమూ మిగల్లేదు!

వాళ్లంతా నేతన్నలు.. చెమటనే నమ్ముకుని మగ్గాలపై తమ రెక్కల కష్టంతో దుస్తులు నేస్తే వచ్చేది రోజూ చాలీచాలని కూలీ. మరమగ్గాలపై రోజంతా శ్రమిస్తే తప్ప ఇల్లు గడవని దీన స్థితి. అనారోగ్య సమస్య వస్తే అంతే..

Published : 13 Jun 2024 05:58 IST

దయనీయ పరిస్థితిలో నేతన్నలు 
ఆరోగ్య బీమా లేక అప్పులపాలు
ఈనాడు, వరంగల్, కమలాపూర్, కొడకండ్ల, న్యూస్‌టుడే

వాళ్లంతా నేతన్నలు.. చెమటనే నమ్ముకుని మగ్గాలపై తమ రెక్కల కష్టంతో దుస్తులు నేస్తే వచ్చేది రోజూ చాలీచాలని కూలీ. మరమగ్గాలపై రోజంతా శ్రమిస్తే తప్ప ఇల్లు గడవని దీన స్థితి. అనారోగ్య సమస్య వస్తే అంతే.. ఆరోగ్య బీమా సౌకర్యం లేక ప్రయివేటు ఆసుపత్రుల్లో రూ.వేలు పోసి చికిత్స చేయించుకొంటూ అప్పుల పాలవుతున్నారు. హెల్త్‌కార్డులు అందడం లేదు. చేనేత మిత్ర కింద వచ్చే పొదుపు రాయితీ గత ఎనిమిది నెలలుగా అందక  ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో వేలాది మంది నేత కార్మికులది ఇదే దుస్థితి. 


పేరుకే చేనేత మిత్ర

గత భారాస ప్రభుత్వం చేనేత కార్మికులకు బీమాతోపాటు, రాయితీ ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన ‘చేనేత మిత్ర’ పథకం సక్రమంగా అమలు జరగడం లేదు. అయిదేళ్లుగా చేనేతలు, మరమగ్గాలపై పనిచేసేవారికి హెల్త్‌కార్డులు అందడం లేదు. గతంలో ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి ఆసుపత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల వరకు తిరిగి చెల్లించేది. ఇప్పడు ఇవ్వడం లేదు.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందే అవకాశం ఉన్నా, చాలా మందికి  తెల్లరేషన్‌కార్డు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి. గతేడాది ఆగస్టు 7 చేనేత దినోత్సవం సందర్భంగా అప్పటి చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోగ్య బీమాను రూ.25 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య బీమా పథకం వర్తించడం లేదని నేతన్నలు వాపోతున్నారు.


  • మడికొండలో 354 యూనిట్లతో ప్రభుత్వం మరమగ్గాల యూనిట్లను ఏర్పాటు చేసింది. అంతా కలిపి 20 వేల మంది వరకు ఉంటారు. వీరిలో 90 శాతానికిపైగా పేదవారే.

ఇదీ పరిస్థితి.. 

  • ఉమ్మడి వరంగల్‌లో చేనేత సంఘాలు: 40కిపైగా ఉమ్మడి వరంగల్‌లోని అనేక ప్రాంతాలు చేనేత, పవర్‌లూమ్స్‌కు ప్రసిద్ధి చెందాయి. భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల, మొగుళ్లపల్లి, చెన్నాపూర్, చికెన్‌పల్లి, ములుగులో ఒక చేనేత సహకార సంఘం ఉంది. వరంగల్‌లోని కొత్తవాడతోపాటు దుగ్గొండి మండలం నాచినపల్లిలో చేనేత సహకారం సంఘం ఉంది. జనగామ జిల్లా కొడకండ్లలో పవర్‌లూమ్స్‌పై ఎక్కువగా తువాళ్లు తయారుచేస్తారు.  
  • వరంగల్‌లోని కొత్తవాడ, కమలాపూర్, సూరారం, తదితర ప్రాంతాల్లో అన్ని సంఘాల్లోని మగ్గంపై పనిచేసేవారు, కండెలు చుట్టే అనుబంధ కార్మికులంతా కలిసి 15 వేల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. 
  • మరమగ్గాలపై ఆధారపడ్డ వారు మరో 4 వేల మంది వరకు ఉన్నారు. 

రోజు సంపాదన రూ.200 లోపే.. 

వీరు చీరాల బాలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ చేనేత సొసైటీలో బాలరాజు నేత కార్మికుడిగా పనిచేస్తున్నారు. రోజుకు సంపాదించేది రూ.200 లోపే. ఈ కూలీతో నెలనెలా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. భార్యకు థైరాయిడ్‌ సమస్య రావడంతో కొన్నేళ్ల కిందట శస్త్రచికిత్సకు రూ.2 లక్షల వరకు అప్పులు చేశారు. గతంలో హెల్త్‌కార్డు ఉండేదని.. ఇప్పుడది లేకపోవడంతో సర్కారు నుంచి రూపాయి సాయం అందడం లేదని వాపోయారు. హెల్త్‌కార్డు మంజూరయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. 


త్రిఫ్ట్‌ నిధి అయోమయం

గత ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద త్రిఫ్ట్‌ ఫండ్‌ మనీ సేవింగ్‌ స్కీం (టీఎఫ్‌ఎంఎస్‌ఎస్‌) పేరుతో ఒక పొదుపు పథకం ప్రవేశపెట్టింది. నెలనెలా నేతన్నలు రూ.వెయ్యి చొప్పున జమ చేస్తే ప్రభుత్వం రూ.2 వేలు కలుపుతుంది. అలాగే మరమగ్గాల నేతన్నల రూ.వెయ్యికి సర్కారు మరో రూ.వెయ్యి జమ చేస్తుంది. నేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే 36 నెలల పొదుపు పథకం ఇది. ఎనిమిది నెలలుగా నేతన్నలు సొమ్ము జమచేస్తున్నా సర్కారు మ్యాచింగ్‌ గ్రాంటు కలపడం లేదు. దీంతో ఈ పథకంపై అయోమయం నెలకొంది. 


డబ్బులు జమ చేయాలి
- ఎలగం సాంబయ్య, కొత్తవాడ, వరంగల్, శత్రంజి చేనేత సహకార సంఘం, పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌

చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం  దృష్టిసారించాలి. గతంలో త్రిఫ్ట్‌ నిధి కింద ప్రభుత్వం రాయితీ డబ్బులను మా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. గత ఏడెనిమిది నెలలుగా రావడం లేదు.


మరమగ్గాల వారికీ అందడం లేదు 
- మసురం వెంకటనారాయణ,  కొడకండ్ల, పవర్‌లూమ్‌ జిల్లా అధ్యక్షుడు

 ప్రభుత్వం బడ్జెట్‌ లేదని త్రిఫ్ట్‌ ఆపేసింది. మేం ఏడీ కార్యాలయానికి వెళ్లి అడుగుతున్నాం. ఒక్క కొడకండ్లలోనే 150 మంది కార్మికులం ఉన్నాం. ఇప్పటి వరకు 20 నెలలు చెల్లించాం.  సర్కారు జమ చేయాల్సిన మొత్తం రావడం లేదు.  ఆరోగ్య కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నాం. 


ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం
- రాఘవరావు, ఏడీ, హనుమకొండ 

చేనేత కార్మికులకు గతంలో వచ్చే త్రిఫ్ట్‌ నిధి ఇప్పుడు రావడం లేదని పలువురు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి వినతులను మా శాఖ ఉన్నతాధికారులకు పంపాం.  త్వరలో ఈ నిధి కింద డబ్బులు జమయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని