logo

బస్సుల కొరత.. ప్రయాణికుల వెత

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం  కల్పించింది

Published : 14 Jun 2024 02:22 IST

హనుమకొండ బస్టాండులో బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల పాట్లు  

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం  కల్పించింది. దీంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 12 నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం అయ్యాక రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ రూట్లలో ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం. 
- న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్, భీమదేవరపల్లి, భీమారం

ఎదురవుతున్న తప్పని నిరీక్షణ..

హనుమకొండ బస్టాండుల్లో ఎప్పుడు చూసినా నాలుగైదు బస్సులకు సరిపడా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లు బస్సులు లేకపోవడంతో గంటకొద్ది ప్రయాణికులు వేచిఉండాల్సి వస్తోంది.  సమస్యలు.. 

  • ఇటీవల హనుమకొండ బస్టాండు నుంచి వేలేరు మండలం పీచరకు బయలుదేరిన బస్సు వేలేరు వరకు వెళ్లింది. తమకు రెండో ట్రిప్పు సమయం అయిందని, ఇక్కడి నుంచే వెనక్కి వెళ్తున్నట్లు చెప్పి పీచరకు వెళ్లాల్సిన పది మంది ప్రయాణికులను అక్కడే దించేశారు. హనుమకొండకు వెళ్లడం కోసం పీచరలో ఎదురు చూస్తున్న ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
  • పరకాల నుంచి హనుమకొండకు నిత్యం తిరిగే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో డ్రైవర్లు మధ్యలో వచ్చే స్టాపుల వద్ద ఆపడం లేదు. ఎవరైనా దిగేవారుంటే స్టేజీకి దూరంగా దింపుతున్నారు. 
  • కొన్ని రూట్లలో డ్రైవర్లు మండల కేంద్రాల్లో తప్ప పల్లెల్లో ఆపక పోవడంతో గంటలకొద్ది వేచిఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 
  • భీమదేవరపల్లి మండలంలో ప్రధాన గ్రామాలకు కూడా ఆర్‌టీసీ సేవలు దూరమయ్యాయి. గతంలో మట్టి రోడ్లున్నా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం బస్సులు నడిచేవి. ఇప్పుడు బీటీ రోడ్లున్నా మాణిక్యాపూర్, కొప్పూర్, ధర్మారం, ఎర్రబెల్లి, గట్లనర్సింగాపూర్‌ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. హనుమకొండ - సిద్దిపేట, ములుకనూర్‌ - కట్కూర్‌ రూట్లలో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. 
  • హసన్‌పర్తి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్లే ప్రయాణికుల పరిస్థితీ అంతే. బస్సులన్నీ నిండుగా వస్తుండడంతో ఇక్కడ ఆపడం లేదు. 

    గ్రామీణ రూట్లలో ఇబ్బందులు పడుతున్నాం..

- కె.సబిత, ధర్మసాగర్‌ 

గతంలో బస్సులు ఎక్కడ చేయి ఎత్తితే అక్కడ ఆపేవారు. ఉచిత ప్రయాణం మొదలైనప్పటి నుంచి స్టేజీల వద్ద తప్ప మరెక్కడా ఆపడంలేదు. కొన్ని సందర్భాల్లో స్టేజీల వద్ద కూడా ఆపడం లేదు. కొన్ని రూట్లలో చెప్పాపెట్టకుండా ట్రిప్పులు రద్దు చేస్తున్నారు. గ్రామీణ రూట్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 


ఇబ్బందులు లేకుండా చూస్తాం..
- కేశరాజు భానుకిరణ్, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్, వరంగల్‌ 

మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత గత విద్యా సంవత్సరం నాలుగు నెలల పాటు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు  తలెత్తకుండా సేవలందించాం. ఈ విద్యా సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. రద్దీ లేని రూట్లలో బస్సులను తగ్గించి, డిమాండు ఉన్న ప్రాంతాలకు పంపిస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కొత్త బస్సుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని