logo

కొత్త రేషన్‌కార్డులపై చిగురిస్తున్న ఆశలు..!

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు(రేషన్‌కార్డులు) జారీ చేస్తోంది. రేషన్‌కార్డులపై రాయితీ బియ్యంతో పాటు గతంలో అన్ని రకాల నిత్యావసరాలనూ పంపిణీ చేసేవారు.

Updated : 14 Jun 2024 05:39 IST

 జనగామలో ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేస్తూ..(పాత చిత్రం) 

జనగామ టౌన్, న్యూస్‌టుడే: పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు(రేషన్‌కార్డులు) జారీ చేస్తోంది. రేషన్‌కార్డులపై రాయితీ బియ్యంతో పాటు గతంలో అన్ని రకాల నిత్యావసరాలనూ పంపిణీ చేసేవారు. కొవిడ్‌ నుంచి కేవలం బియ్యానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డులకు ఎన్నో ఏళ్లుగా అర్హులు నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దీనిపై అంత ప్రాధాన్యతనివ్వలేదు. 2020 సంవత్సరంలో కొందరికి ఇచ్చి, ఆనక నిలిపివేశారు. నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం వీటి పంపిణీపై ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో ప్రజలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్నారు.   

కొత్త కార్డులు, సవరణలకు నిరీక్షిస్తూ..

జిల్లాలో కొత్త కార్డులు, సవరణలకు అనేక మంది అర్హులైన వారు నిరీక్షిస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు, వారికి పుట్టిన పిల్లలు తీసుకోవడానికి అర్హులు. అయితే నాలుగేళ్లకు పైగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు, వారికి పిల్లలు పుట్టినా కూడా ఇంత వరకు కార్డులు జారీ కాలేదు. ఇదే సమయంలో ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారు ఇప్పటికే ఉన్న పిల్లల పేర్లు చేర్చడానికి మార్పులు చేర్పులకు చూస్తున్న వారెంతో మంది ఉన్నారు. ప్రభుత్వ పథకాల మంజూరుకు, ఇతర ఏ గుర్తింపుకైనా ఆధార్‌తో పాటు రేషన్‌కార్డు తప్పనిసరి. దీంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం అమలుకు కూడా ఇది ఉంటేనే అర్హులుగా ఉంటారు. జారీ కాకపోవంతో అనేక పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు

మండలాల్లో మీసేవ కేంద్రాల ద్వారా కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇంకా చేసుకోని వారు అధికంగానే ఉన్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో కూడా పలు పథకాలతో పాటు కొత్త రేషన్‌కార్డులు కావాలని అప్లై చేసుకున్నారు. కొత్త కార్డులు, సవరణలకు అర్హులంతా జిల్లా పౌరసరఫరాల శాఖ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రులు కార్డులను అందించనున్నట్లు ప్రకటించడంతో వేచి చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. రానున్న వారంలోపే ఉత్వర్తులు జారీ చేయనుందని ప్రచారం జరుగుతోంది. మరోమారు మీసేవ కేంద్రాలకు వెళ్లువెత్తే అవకాశం ఉంది.


ఆరేళ్లుగా తిరుగుతున్నాం.. 
- బిట్ల వసంత, బాణాపురం, జనగామ

మా కుటుంబంలో పిల్లల పేర్లు కార్డులో నమోదు చేసుకోవడానికి ఆరేళ్లుగా తిరుగుతున్నాం. కేవలం భార్యాభర్తలం మాత్రమే ఉన్నాం. పిల్లలు పుట్టాక నమోదు చేసుకుందామంటే ఇంత వరకు అవకాశం రాలేదు. మాలాంటి వారి అవసరాల రీత్యా వెంటనే సవరణలకు అవకాశం ఇవ్వాలి.


వెంటనే మంజూరు చేయాలి 
- బబ్బూరు శ్రావణి, గానుగుపహాడ్‌

మాకు వివాహం అయి అయిదేళ్లు అవుతున్నా, ఇప్పటి వరకు కొత్త కార్డు రాలేదు. రేషన్‌ సరకులతో పాటు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే కొత్త కార్డుల మంజూరీకి చర్యలు తీసుకోవాలి.


ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వీకరణ.. 
- ఎం.రోజారాణి, జిల్లా పౌర  సరఫరాల శాఖ అధికారిణి

ప్రభుత్వ ఆదేశాలు రాగానే కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని