logo

అంగన్‌వాడీ.. పిల్లల భవిష్యత్తుకు వారధి

బుడిబుడి అడుగుల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారధులుగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది

Published : 14 Jun 2024 02:37 IST

బడిబాట నిర్వహిస్తున్న సిబ్బంది, ఆశా కార్యకర్తలు 

భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: బుడిబుడి అడుగుల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారధులుగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇక్కడ పిల్లలకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. పౌష్టికాహార లోపంతో చిన్నారులు బాధపడకుండా ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిళ్లు అందిస్తున్నారు. పాఠశాల విద్యవైపు అడుగులు పడేలా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలు పునాదులు వేస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 19వ తేదీ వరకు బడిబాట  నిర్వహించనున్నారు. 

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆట పాటలతోపాటు పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారం అందించడమే కాకుండా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందుకుగాను అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రతి చిన్నారికి ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్‌ తయారు చేస్తున్నారు. ఇందులో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన పిల్లవాని బరువు, ఎత్తు, చుట్టు కొలతలు తదితర అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య విషయాలను తెలుసుకునే అవకాశం సులువుగా ఉంటుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు బాలామృతం ప్లస్‌ అందించడంతో పాటు పాలు, గుడ్లు, పలు విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని,  అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు సరైన సమయంలో చికిత్స అందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.  

బడిబాట ద్వారాగుర్తింపు

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా రెండున్నర సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను గుర్తించి వారు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ర్యాలీ నిర్వహించడం, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై విసృత ప్రచారం నిర్వహిస్తారు.


  పిల్లల్ని చేర్పించాలి.. 
- నాగేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి

అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అర్హులైన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. పిల్లలకు ఆటపాటలతోపాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతోపాటు అవసరమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని