logo

లక్నవరంలో పర్యాటకులకు భద్రత కరవు

 గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత కరవైంది.

Updated : 14 Jun 2024 05:38 IST

 జలాశయం వద్ద వేలాడే వారధి  

లక్నవరం జలాశయం,(గోవిందరావుపేట), న్యూస్‌టుడే: గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత కరవైంది. పర్యాటకుల కోసం అందుబాటులో మూడు వారధులు ఉండగా, కేవలం ఆరుగురు భద్రతా సిబ్బందే విధులు నిర్వర్తిస్తున్నారు. వారు కూడా విడతల వారీగా బోటింగ్‌ పాయింట్‌ వద్ద విధుల్లో ఉండాల్సి వస్తోంది. జలాశయం ప్రథమ వారధిని ప్రారంభించిన సమయంలో  సుమారు 26 మందికి పైగా భద్రతా సిబ్బందిని నియమించి వారికి వారికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. తర్వాత రెండో వారధి, ఆ తర్వాత మూడో వారధి నిర్మాణం జరిగినప్పటికీ.. భద్రతా సిబ్బందిని పెంచకపోగా, క్రమేణా తగ్గిస్తూ వచ్చారు.  

 సిబ్బంది అవసరం

సందర్శనకొచ్చే వారిలో కొందరు వారధి రేయిలింగ్‌ పైకెక్కి ఫిట్స్‌ చేస్తుంటారు. వంతెనకున్న రాడ్స్‌ను పట్టుకుని అటు ఇటు ఊపుతుంటారు. దాంతో వారధి రేయిలింగ్‌ దెబ్బతినడంతో పాటు నట్లు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కాలు జారితే పర్యాటకుల ప్రాణాలకు సైతం ముప్పు తప్పదు. కొంత మంది చేసే ఫిట్స్‌తో మిగిలిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఘర్షణలు, వాదోపవాదాలు జరిగిన సందర్భాలున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు వారధిపై సిబ్బంది అవసరం ఎంతో ఉంది. 

  • మూడు వారధులపై భద్రత కరవైంది. లక్నవరం జలాశయం మెట్ల ప్రదేశం, తూములు, మొదటి వారధి, కాకరకాయల బోడు వద్ద కొందరు ప్రమాదవశాత్తు మృతి చెందితే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకరకాయల బోడు(ఐలాండ్‌) వద్ద ఏకంగా ఒక ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. మరికొన్ని సందర్భాల్లో పర్యాటకులు తెలిసి తెలియక ఈత కోసం జలాశయంలోకి దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు సిబ్బంది అవసరం ఉన్నప్పటికీ.. ఆ దిశగా పర్యాటకశాఖ దృష్టి సారించడం లేదు.

 లక్నవరం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించినప్పటికీ..  అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ విధుల్లో ఉన్నవారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. వీరికి కూడా అంతంత మాత్రంగానే వేతనాలు చెల్లిస్తున్నారు.  

  లాభాపేక్ష తగదు

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జలాశయం నిర్వహణ కొనసాగుతుండగా, పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. భద్రతా సిబ్బందిని తగ్గించడానికి, అనుకున్నంత ఆదాయం లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. లాభాపేక్ష దృష్టితో కాకుండా పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది.


  ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. 
 - సండ్రకోట శివశంకర్, మేనేజర్, లక్నవరం జలాశయం 

జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రస్తుతం ఆరుగురు సిబ్బందే విధుల్లో ఉన్నారు. జలాశయంలో సమృద్ధిగా నీరు చేరిన తర్వాత అవసరం మేరకు భద్రత పెంచే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని