logo

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథులు కరవయ్యారు.

Published : 14 Jun 2024 03:20 IST

నర్సంపేటలో పెద్ద కాలువ పక్కన బఫర్‌ జోన్‌ భూమిని కలుపుకొని చేపట్టిన ఇంటి నిర్మాణం 

నర్సంపేట, న్యూస్‌టుడే : నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథులు కరవయ్యారు. పట్టణంలోని మాదన్నపేట చెరువు పెద్ద కాలువ కింద, అసైన్డ్‌ భూముల్లో పలువురు అనుమతులు లేకుండానే భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. కాలువ మధ్య నుంచి ఆయకట్టు పొలాలకు నీరు పారే వైపు, కాలువ మధ్య నుంచి 42 అడుగులు కాలువ కట్ట దాని అవతల 6 అడుగులు (రెండు మీటర్లు) బఫర్‌ జోన్‌గా నీటి పారుదలశాఖ అధికారులు పరిగణిస్తారు. ఎవరైనా కాలువ కింద ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకుంటే నిబంధనల మేరకు బఫర్‌ జోన్‌ వదిలి పురపాలక చట్టం ప్రకారం వెనక్కి జరిగి నిర్మాణం చేపట్టాలి. ఇందుకు ఐబీ శాఖ అధికారుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్‌వోసీ) నిర్మాణ ఇళ్లు, భవనం నక్షాతో జత చేసి ఆన్‌లైన్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు లోబడి ఉంటేనే అనుమతి ఇస్తారు. లేకపోతో రిమార్కులు రాసి తిరస్కరించాల్సి ఉంటుంది. కానీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిబంధనల అమలులో పారదర్శకత పాటించడం లేదు. 12వ వార్డులో కొద్ది నెలల క్రితం ఒకరు నిబంధనలకు విరుద్ధంగా మురుగుకాలువ అంచుపై ఒక పెద్ద ఇల్లు నిర్మించారు. అంతేకాక అంతర్గత రోడ్డును ఆక్రమించి గోడ నిర్మించినా దానిని తొలగించలేదు.

బఫర్‌జోన్‌లో కట్టడాలు 

కొందరు ఐబీశాఖకు చెందిన బఫర్‌జోన్‌ స్థలాన్ని కలుపుకొని దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. పెద్ద కాలువ పొడవునా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కాలువ కింద పటేల్‌నగర్‌లో ఒకరు ఐబీశాఖకు చెందిన బఫర్‌ జోన్‌ స్థలాన్ని కలుపుకొని ఇంటిని నిర్మిస్తున్నారు. పునాది పనులు పూర్తయ్యాయి. కొందరు అంతర్గత రహదారుల పక్కన నిర్మాణాలు చేపడితే.. ఇంకొందరు మురుగుకాల్వలను ఆనుకొని ఇళ్లు కడుతున్నారు. బఫర్‌ జోన్‌ స్థలంలో భవిష్యత్తు అవసరాల కోసం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి దాన్ని కబ్జాలకు గురి కాకుండా కాపాడాల్సి ఉంది. పటేల్‌నగర్‌లో ఇంటి నిర్మాణంలో కలుపుకున్న బఫర్‌జోన్‌ స్థలాన్ని వదిలిపెట్టాలని సంజాయిషీ తాఖీదు ఇచ్చినట్లు ఐబీ డీఈఈ రాంప్రసాద్‌ తెలిపారు.  మున్సిపల్‌ టీపీవో వీరస్వామిని వివరణ కోరగా.. ఇంటి యజమాని అనుమతి కోసం దరఖాస్తు చేశారని, బఫర్‌ జోన్‌ స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని తొలగిస్తేనే అనుమతి ఇస్తామని సూచించామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని