logo

టౌన్‌ ప్లానింగ్‌లో వసూళ్లపై కమిషనర్‌ ఆరా

గ్రేటర్‌ వరంగల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల తీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులకు కొర్రీలు పెడుతూ.. డబ్బులు వసూళ్లు చేపట్టడాన్ని కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే తీవ్రంగా పరిగణించారు.

Updated : 14 Jun 2024 05:36 IST

కార్పొరేషన్, న్యూస్‌టుడే: గ్రేటర్‌ వరంగల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల తీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులకు కొర్రీలు పెడుతూ.. డబ్బులు వసూళ్లు చేపట్టడాన్ని కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే తీవ్రంగా పరిగణించారు. ఈనాడులో గురువారం ‘డబ్బులిస్తేనే దస్త్రం కదిలేది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై కమిషనర్‌ చరవాణిలో ఆరా తీశారు. ‘బడా భవన నిర్మాణాల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే కట్టడి చేయడం లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) జారీ చేసే సమయంలో పరిశీలన చేస్తే ఏం లాభం?’ అని కమిషనర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తి చేసినట్లు తెలిసింది. కిందిస్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా వసూళ్లలో భాగస్వాములు కావడంపై కమిషనర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు బల్దియా పట్టణ ప్రణాళిక విభాగం వసూళ్లపై అవినీతి నిరోధక శాఖ(అనిశా) రంగంలోకి దిగింది. ఇద్దరు అధికారులు, నలుగురు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లపై ఇప్పటికే అనిశాకు ప్రజలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఫిర్యాదుల వెల్లువ..: భవనాల అనుమతులకు టౌన్‌ప్లానింగ్‌ విభాగం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని సామాజిక కార్యకర్తలు గురువారం కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం ఈనాడులో ప్రచురితమైన కథనంతో చాలామంది బయటకు వచ్చారు.

  • హనుమకొండ ప్రాంతంలో పలు భవన నిర్మాణ అనుమతుల్లో టీపీఎస్‌ అవినీతిపై కొందరు బాధితులు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించినప్పటికీ బదిలీతో సరిపెట్టినట్లు తెలిసింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని