logo

సమస్యను చూశారు.. పరిష్కారం చూపారు!

గురువారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాల్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పంట క్షేత్రాలకు వెళ్లిన అన్నదాతలు తమ చరవాణుల నుంచి వీడియోకాల్‌ చేసి తమ సమస్యను చూపుతూ శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

Updated : 14 Jun 2024 05:32 IST

 రైతులతో వీడియో కాల్‌ మాట్లాడిన వ్యవసాయ శాస్త్రవేత్తలు 
  ఈనాడు పిలుపునకు స్పందన

         

వీడియో కాల్‌ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్‌ రావుల ఉమా రెడ్డి. చిత్రంలో శాస్త్రవేత్తలు (ఎడమ నుంచి కుడికి) డాక్టర్‌ ఎస్‌.ఓంప్రకాష్‌ (కీటక శాస్త్రం), డాక్టర్‌ ఎన్‌.సంధ్య కిషోర్‌ (అపరాల విభాగం), డాక్టర్‌ డి.వీరన్న (కీటక శాస్త్రం), డాక్టర్‌ వి.వెంకన్న (వరి విభాగం).

గురువారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాల్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పంట క్షేత్రాలకు వెళ్లిన అన్నదాతలు తమ చరవాణుల నుంచి వీడియోకాల్‌ చేసి తమ సమస్యను చూపుతూ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌లో కలిగే అనేక సందేహాలను వారు నివృత్తి చేసుకున్నారు. 
ఆర్‌ఏఆర్‌ఎస్‌ సహ సంచాలకుడు డాక్టర్‌ రావుల ఉమారెడ్డి నేతృత్వంలో శాస్త్రవేత్తలు రైతులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఉదయం 8 నుంచి 9.30 వరకు గంటన్నర పాటు సాగిన ఈ కార్యక్రమంలో యువ రైతుల నుంచి మొదలుకొని అనుభవం ఉన్నవారు ఎంతో మంది వీడియోకాల్‌లో మాట్లాడారు.  శాస్త్రవేత్తలు చెప్పిన సమాధానాలు ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది కర్షకులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రశ్నలకు, శాస్త్రవేత్తలు చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.

ఈనాడు, వరంగల్‌ 

ఈసారి పత్తి సాగు చేస్తున్నాం.. ఏ హైబ్రీడ్‌ రకం వాడాలి..
ప్రభుత్వం బోనస్‌ ఇస్తున్నందున సన్నాలు సాగు చేయాలనుకుంటున్నాం.. ఏ వంగడం బాగుంటుంది ..
 చౌడు నేలల్లో ఆయిల్‌పామ్‌ పంటలు సాగు చేయొచ్చా.. 
 పండ్లను ఆశిస్తున్న వైరస్‌ను ఎలా తరిమేయాలి’? 
ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు తమ సందేహాలను వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. 

 •  రైతు పేరు: రాజు
 • ఊరు: మొండ్రాయి, సంగెం మండలం, వరంగల్‌ జిల్లా
 • సమస్య: బెడ్‌ సిస్టం ద్వారా పత్తి సాగు చేస్తున్నాం. ఏ విధానంలో పెట్టాలి?
 • సమాధానం: పత్తికి బెడ్లు గుంజడం మంచి విధానం. వర్షాలు ఎక్కువైనా తక్కువైనా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. విత్తనం బెడ్‌ పైభాగం, కింది భాగం కాకుండా మధ్యలో పెడితే బాగుంటుంది. బెడ్స్‌ గుంజే ముందు సింగిల్‌ సూపర్‌ పాస్పేట్ (ఎస్‌ఎస్‌పీ) ఎకరాకు 2 బ్యాగులు చల్లితే సరిపోతుంది. 

శాస్త్రవేత్తలు ఇచ్చిన  మరికొన్ని  సలహాలు..

 • సన్న రకాల్లో రెండు మూడు ఉన్నాయి. జులై 10 తర్వాత నారు పోయాలనుకుంటే ‘తెలంగాణ సోనా’ ఉత్తమం. (ఆర్‌ఎన్‌ఆర్‌15048) ఇప్పుడే నారు పోద్దామనుకుంటే ‘కూనారం 1638’, లేదా ‘వరంగల్‌ 962’ ఈ మూడు సన్నరకాలు. 
 •  ప్రతి మంగళవారం ఆన్‌లైన్‌లో రైతువేదికల వద్దకు అన్నదాతలు వెళితే అనేక విషయాలపై అవగాహన వస్తుంది. 
 • పత్తిలో హైబ్రీడ్‌ ఒకే రకం కోసం వేలం వెర్రిగా రైతులు పోటీపడడం వల్లే విత్తనాల కొరత, నకిలీవి వస్తున్నాయి. రకం కన్నా యాజమాన్యం ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి. 

 కోరె రాకేశ్‌  ః  చెన్నారావుపేట, వరంగల్‌ జిల్లా 

 రెండెకరాల్లో బొప్పాయి తోట వేశా. పచ్చి కాయ ఉన్నప్పుడు మధ్యలో మచ్చ వస్తోంది?

ఒకసారి పంట ఫొటోలతో మా కేంద్రానికి వస్తే లోతుగా పరిశీలించి పరిష్కారం చెబుతాం.

పున్నంచందర్‌రెడ్డి, ఎం.రాంచంద్రారెడ్డి  ః హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా

 జీలుగులు అలికాం.. బాగా పెరగడం లేదు. ఎన్ని రోజుల్లో పెరుగుతుంది? అయిదెకరాల్లో మాది రాగడి భూమి ఉంది.  అందులో చౌడు ఎక్కువగా ఉంది. అందులో పామాయిల్‌ పెట్టొచ్చా?

 •  క్షేత్రంలో అక్కడక్కడా పూతకొచ్చే వరకు పెంచాలి. ఇక చౌడు నేలలో పామాయిల్‌ తట్టుకోవడం కష్టమే. వరికి వెళ్లడమే ఉత్తమం. 
 •  ఆలేటి సతీశ్‌  ః కొత్తగట్టు సింగారం, శాయంపేట మండలం, హనుమకొండ జిల్లా
 •  పసుపు 20 రోజుల కిందట వేశాను. అందులో గడ్డి బాగా వస్తోంది. దాన్నెలా నివారించాలి?
 •   పెరక్వాడ్‌ కొట్టండి. గడ్డి సమస్య పరిష్కారం అవుతుంది. 

 గంట వెంకటేశ్వరరెడ్డి  ః హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా  ః నాకు ఆరున్నర ఎకరాల పొలం ఉంది. అందులో చౌడు సమస్య అధికంగా ఉంది. వరిలో ఏది పెడితే బాగుంటుంది?

 •  ఇప్పుడు నారు పోసే అవకాశం ఉంటే సిద్ధం చేసుకోండి. ఇది 140 రోజుల పంట. చౌడు ఉంటే రెండు నుంచి మూడు సార్లు జింక్‌ సల్ఫేట్ను స్ప్రే చేయండి.

 గోపి సోమిరెడ్డి, జనార్దన్‌రెడ్డి  ః రఘునాథపల్లి, జనగామ జిల్లా  ః ప్రభుత్వం సన్నరకాలకు బోనస్‌ ఇస్తామంటోంది. మరి ఏయే  సన్నరకాలకు ఇది వర్తిస్తుంది?

 •  పలానా సన్న రకానికే బోనస్‌ అని లేదు. మన పరిశోధన కేంద్రాల్లో విడుదలయ్యే అన్ని సన్నాలకు బోనస్‌ వర్తిస్తుంది. కాకపోతే సన్నాలు వేస్తే దోమ రాకుండా సరైన జాగ్రత్తలు పాటించాలి. 

షేక్‌ గౌస్‌  ః కాట్రపల్లి, శాయంపేట మండలం, హనుమకొండ జిల్లా

 గులాబీ రంగు పురుగు రాని హైబ్రీడ్‌ రకం పత్తి విత్తనం సూచిస్తారా?  

 • గులాబీ రంగు పురుగు సోకని రకం అంటూ ఏదీ లేదు. సరైన యాజమాన్య పద్ధతుల ద్వారా నివారించాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని