logo

బాలుర పరిశీలన గృహంలో అధికారుల మద్యం విందు!

వరంగల్‌ బాలుర పరిశీలన గృహం (అబ్జర్వేషన్‌ హోం)లో సిబ్బంది బాధ్యతలు మరచి మద్యంతో విందు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది

Updated : 14 Jun 2024 05:35 IST

ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ బాలుర పరిశీలన గృహం (అబ్జర్వేషన్‌ హోం)లో సిబ్బంది బాధ్యతలు మరచి మద్యంతో విందు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న పరిశీలన గృహాన్ని ఉప సంచాలకుడు తనిఖీ చేయగా పర్యవేక్షకుడితో పాటు కిందిస్థాయి సిబ్బంది లోపాలు బయటపడ్డాయి. ఉప సంచాలకుడు మధ్యాహ్నం మూడున్నర గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఎంత పిలిచినా 20 నిమిషాల వరకు సిబ్బంది ఎవరూ బయటకు రాకుండా పై అంతస్తులో మద్యం మత్తులో మునిగి ఉన్నారు. ఆ సమయంలో బాలలు టీవీ చూస్తున్నారు. వారిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా విందులో మునిగి తేలారు. సిబ్బంది నలుగురు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ  భద్రతను గాలికి వదిలేసినట్టు తనిఖీలో తేలింది. ఉప సంచాలకుడు వారితో మాట్లాడుతుండగా మద్యం మత్తులో తూగుతుండడం గమనార్హం. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని పర్యవేక్షకుడిని ఆదేశిస్తూ సంచాలకుల కార్యాలయం జూన్‌ 3న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పరిశీలన గృహం నుంచి పలువురు బాలలు తప్పించుకుపోయిన నేపథ్యంలో సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని