logo

ఇద్దరిని బలిగొన్న ఇసుక ట్రాక్టర్‌

విలాసాగర్‌- దామెరకుంట మధ్య దుబ్బపల్లి గ్రామ సమీపంలో గురువారం ఓ ఇసుక ట్రాక్టర్‌ ఇద్దరిని బలిగొంది.

Updated : 14 Jun 2024 05:34 IST

రాజయ్య, బాపు (పాత చిత్రాలు)  

కాటారం, న్యూస్‌టుడే: విలాసాగర్‌- దామెరకుంట మధ్య దుబ్బపల్లి గ్రామ సమీపంలో గురువారం ఓ ఇసుక ట్రాక్టర్‌ ఇద్దరిని బలిగొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విలాసాగర్‌ గ్రామానికి చెందిన కాపరబోయిన రాజయ్య(48) దామెరకుంట ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పార్ట్‌టైం స్వీపర్‌గా పని చేస్తున్నారు.వ్యవసాయ పనుల నిమిత్తం దామెరకుంటకు చెందిన వడ్రంగి అయిలాపురం బాపు(45)ను తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రారం గ్రామానికి చెందిన ఊరుగొండ శ్రీనివాస్‌ ద్విచక్ర వాహనంపై ఉట్లపల్లిలోని పోచమ్మ మొక్కుల కోసం భార్య, కూతురితో కలిసి వెళ్తున్నారు. దుబ్బపల్లి సమీపంలో వీరి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రాజయ్య, బాపు, శ్రీనివాస్, ఆయన భార్య, కూతురు చెరో వైపు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్‌ రోడ్డుపై పడి ఉన్న రాజయ్య, బాపుపై నుంచి వెళ్లడంతో రాజయ్య తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఛాతీ, కాలికి తీవ్రగాయాలైన బాపును భూపాలపల్లి సామాజిక ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు. బాపు భార్య గతంలో పాముకాటుతో చనిపోగా కుమారుడు ఉన్నాడు. రాజయ్యకు కుమారుడు, కుమార్తె ఉండగా ఇటీవలే కూతురికి వివాహం నిశ్చయమైంది. ప్రమాదం అనంతరం ట్రాక్టర్‌తో సహా డ్రైవర్‌ పరారయ్యాడు.

రహదారిపై బైఠాయింపు 

రాజయ్య మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు అజాగ్రత్తగా, నిబంధనలు పాటించకుండా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు. గంట పాటు రహదారిపై వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌ దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆంజనేయులు, ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

ఆర్టీసీ బస్సులో లభ్యమైన రెండు ఉడుములు మాయం?

హనుమకొండ చౌరస్తా, న్యూ శాయంపేట, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట నుంచి బుధవారం సాయంత్రం హనుమకొండ బస్టాండుకు చేరుకున్న బస్సు ప్రయాణికులను దించేసి డిపోకు చేరుకుంది. అందులోని ఓ సంచిలో రెండు ఉడుములు (వన్య ప్రాణులు) కనిపించాయి. అవి బస్సులోకి ఎవరు తెచ్చారో.. అక్రమ రవాణాచేసే క్రమంలో బస్సులోనే వదిలేశారా.. అన్నది తెలియదు. నిబంధనల ప్రకారం వాటిని అటవీ శాఖకు అప్పగించాల్సిన ఆర్టీసీ సిబ్బంది వాటిని ఏం చేశారో తెలియదు. ఈ విషయం గురువారం బయటకు పొక్కడంతో ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఉడుములు సంరక్షించవలసిన షెడ్యూల్‌-1 జాబితాలో ఉన్నాయని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. అంటే అవి అంతరించి పోతున్న దశలో ఉన్నట్లు అర్థం. ఇలాంటి వన్య ప్రాణులను హింసించడం గానీ, అక్రమంగా రవాణా చేయడం గానీ, విక్రయించడం, లేదా తినడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. కనీసం రూ.10 వేలకు తగ్గకుండా జరిమానాతో పాటు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని హనుమకొండ హంటర్‌ రోడ్డులోని కాకతీయ జూ పార్కు సెక్షన్‌ అధికారి రాందాస్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. తమకు ఎవరూ ఉడుములు దొరికాయని వచ్చి అప్పగించలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. హనుమకొండ డిపో మేనేజర్‌ ధరమ్‌సింగ్‌ను వివరణ కోరగా.. ఆర్టీసీ బస్సులో ఏది లభ్యమైనా తప్పనిసరిగా బుక్‌లో రాస్తారని, ఈ విషయం గురించి తనకు తెలియదని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని