logo

బతికించు..స్ఫూర్తిని పంచు!

నైతిక విలువల ఆధారంగా ఒకరి శరీరంలో ఉన్న అవయవాలు (కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం) మరొకరి అవసరానికి వాడదల్చుకున్నప్పుడు, వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు

Updated : 14 Jun 2024 06:29 IST

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం 

దానం అని ఎందుకన్నారు?   

 అత్యవసరమైనవారికి రక్తం ఇవ్వడాన్ని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం ఎందుకన్నారంటే.. నైతిక విలువల ఆధారంగా ఒకరి శరీరంలో ఉన్న అవయవాలు (కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం) మరొకరి అవసరానికి వాడదల్చుకున్నప్పుడు, వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. అందుకే ప్రపంచంలో చాలా మంది రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలవుతున్నారు. 

ఎందుకు ఇవ్వాలి?

రక్తదానం చేయడం వల్ల ఎదుటి వారి ప్రాణాలను కాపాడడమే కాదు..  దాతకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎంజీఎం ఆసుపత్రి  రక్తనిధి కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఆశాదేవి అన్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. రక్తదానం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 88 శాతం గుండెపోటు రాకుండా చేస్తుంది. కార్డియో వాస్కులర్‌ స్ట్రోక్‌ తీవ్రతను 33 శాతం వరకు తగ్గిస్తుంది. రెండు నెలల్లోగా ఎర్రరక్త కణాలు పూర్తిగా భర్తీ చేయబడి, కొత్త రక్తకణాల ఉత్పత్తితో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. స్థిరమైన రక్తదానం కాలేయం, ఊపిరితిత్తులు, కడుపు, గొంతు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తదానంతో ఉచిత ఆరోగ్య నిర్ధారణ జరుగుతుంది. 

ఎవరు ఇవ్వాలి?

18 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో ఉండాలి. 45 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండి, 12.5 శాతం హిమోగ్లోబిన్‌ ఉన్న వారు. మూడు నెలలకు ముందు రక్తం ఇచ్చినవారు. మలేరియా, టైఫాయిడ్, ఇతర అంటువ్యాధులు లేనివారు. 

అనర్హులు ఎవరంటే?

వారానికిపైగా జ్వరంతో బాధపడుతున్నవారు. యాంటిబయాటిక్స్‌ ఇతర మందులతో చికిత్స పొందుతున్నవారు,  గుండె సమస్యలు, రక్తపోటు, మూర్ఛ వ్యాధి, మధుమేహం (ఇన్సులిన్‌ చికిత్స), క్యాన్సర్, దీర్ఘకాలిక మూత్రపిండం, కాలేయ వ్యాధిగ్రస్థులు, రక్తస్రావం, సుఖవ్యాధులున్న వారు. వీరితో పాటు 24 గంటల్లోపు టీకాలు తీసుకున్నవారు, ఆరు నెలల కాలంలో గర్భస్రావమైన వారు, గర్భిణులు, బాలింతలు, మత్తుపదార్థాల బానిసలు సైతం రక్తదానానికి దూరంగా ఉండాలి.. 

రక్తదానం.. ప్రాణదానంతో సమానం.. అత్యవసర సమయాల్లో దొరకడం ఇప్పటికీ కష్టంగానే ఉంది. అపోహల కారణంగా చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లోనూ పలువురు తామున్నామంటూ   ప్రాణాలను నిలబెడుతున్నారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.. 
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే

26 వాట్సప్‌ గ్రూపులు.. సభ్యులు 6 వేలు

వరంగల్‌ జీఆర్‌గుట్ట ప్రాంతానికి చెందిన కొత్తకొండ అరుణ్‌కుమార్, స్విమ్మర్‌ రాజు మిత్ర బృందం.. యువ నేతాజీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. వీరు 26 వాట్సప్‌ గ్రూపుల ద్వారా 6 వేల మంది సభ్యులతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 32 శిబిరాలు ఏర్పాటు చేసి 1,600 యూనిట్ల రక్తం సేకరించారు. 6,309 మందికి ప్రాణదాతలయ్యారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైన అరుణ్‌కుమార్‌ 28 సార్లు రక్తదానం చేశారు. దాతలను ప్రోత్సహించే సంస్థగా  గవర్నర్‌ నుంచి పురస్కారం అందుకున్నారు. 

ఈ మహిళలు ఆదర్శం

రక్తదానం చేయడానికి మహిళలు వెనుకాడుతారు.. వీరు మాత్రం ముందుకొచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర సమయాల్లో క్రమం తప్పకుండా  ముందుకొస్తున్నారు. 
వరంగల్‌ నగరంలోని శివనగర్‌కు చెందిన ఆర్యవైశ్య మహిళలు గుండా సుప్రజ, కవిత, శృతి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. గాంధీ జయంతి సందర్భంగా శివనగర్‌లోని ఆర్యవైశ్య సంఘ భవనంలో ఏర్పాటు చేసిన శిబిరంలో స్వచ్ఛందంగా  రక్తదానం చేశారు. వారిని చూసిన తర్వాత పలువురు మహిళలు ముందుకొచ్చారని ఆ సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణమూర్తి తెలిపారు. 

నాతో పాటు మరికొందరు : - యు.శ్రావణి, కాశీబుగ్గ

నా గ్రూప్‌ ‘బి’ పాజిటివ్‌. ఇప్పటివరకు నాలుగు సార్లు రక్తదానం చేశా. నేను రక్తం ఇచ్చినప్పుడల్లా మా చుట్టుపక్కల వారికి, మహిళా గ్రూప్‌లోని సభ్యులకు చెబుతున్నా.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వారమవుతామని అవగాహన కల్పిస్తూ.. వారికి అవగాహన కల్పిస్తున్నా.. 

వీరు నిరంతర దాతలు..

రక్తదానం చేయడంలో వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.  క్రమం తప్పకుండా ముందుకొస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతావారు ముందుకొస్తున్నారు. 

  • ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన కన్నె రాజు 34 సార్లు రక్తదానం చేశారు. వరంగల్‌లో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.వేలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు.

- ఖానాపురం  

  • వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన జి.జయరాజ్‌ 34 సార్లు రక్తదానం చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నిత్యం అవగాహన కల్పిస్తుంటారు.

.- జాన్‌పాక (గీసుకొండ)  

30 ఏళ్లలో 69 సార్లు..

30 ఏళ్ల నుంచి ఇప్పటివరకు 69 సార్లు రక్తదానం చేశారు హనుమకొండ గోపాలపూర్‌ అరుణోదయకాలనీకి చెందిన కామిడి సతీష్‌రెడ్డి. జయశంకర్‌ జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 20 వరకు శిబిరాలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా   ఉత్తమ రక్తదాత పురస్కారం అందుకున్నారు. ఆయన గ్రూపు  ఒ పాజిటివ్‌.  - గోపాలపూర్‌ 

వీరిది అరుదైన సేవ

బాంబే, ఎ, బి, ఒ నెగెటివ్‌ వంటి అరుదైన గ్రూపుల రక్తం దొరకడం కష్టం.. అలాంటివారు వారు ముందుకొస్తే చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు. ఇలా అరుదైన రక్త గ్రూపు కలిగిన వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 


ఎక్కువగా చిన్న పిల్లల కోసం 
కె. నవీన్‌కుమార్, కానిస్టేబుల్, గిర్మాజీపేట

‘ఒ’ నెగెటివ్‌ గ్రూప్‌ రక్తం దొరకడం కష్టమని మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు తెలిసింది. చాలా మంది అవగాహన లేక ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు 32 సార్లు రక్తదానం చేశాను. ఎక్కువగా చిన్నపిల్లలకు, ప్రసూతి మహిళల కోసం ఇచ్చాను. ఓ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ చిన్నారి కోసం రక్తం ఇవ్వడం మరిచిపోలేనిది. 


‘రేర్‌ గ్రూప్‌ దాత’గా ఐసీఎంఆర్‌ గుర్తింపు
- బల్లా సాయిప్రసాద్, కరీంనగర్‌

హైదరాబాద్‌లో చదువుతున్నా.. అత్యవసరమైతే నా రేర్‌ బాంబే గ్రూప్‌ రక్తాన్ని దానం చేస్తున్నా. ఇప్పటివరకు ఎనిమిది మందికి ఇచ్చాను. దూరప్రాంతాల వారికి హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తం సేకరించి దాన్ని ప్రత్యేక పార్సిల్‌ ద్వారా పంపిస్తున్నారు. దగ్గరగా ఉంటే నేనే వెళ్తున్నా. ఏడాది కిందట హైదరాబాద్‌లో ప్రసూతి మహిళకు రక్తమిచ్చినప్పుడు ఆమె బంధువులు ప్రాణాలు నిలబెట్టారని అనడం నేను మర్చిపోలేను. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (ఐసీఎంఆర్‌) సంస్థ బాంబే రేర్‌ గ్రూప్‌ రక్తదాతగా గుర్తింపుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని