logo

మోరంచపల్లికి పాత వంతెనతో ముప్పు..!

గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. వరద బీభత్సం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.

Published : 16 Jun 2024 05:19 IST

వర్షాకాలంలో వరద గ్రామం వైపు మళ్లే ప్రమాదం..

వరద ప్రవాహానికి అడ్డుగా పాత వంతెన 

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి: గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. వరద బీభత్సం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఊరంతా ముంపునకు గురైంది. వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు. పశువులు కొట్టుకుపోయి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అధిక వర్షంతో ఎగువ ప్రాంతాల్లోని చెరువులు తెగిపోయి వరదంతా గ్రామాన్ని ముంచెత్తింది. గ్రామానికి సమీపంలోనే జాతీయ రహదారి మోరంచవాగుపై కొత్త వంతెన నిర్మించి.. పక్కనున్న పాత వంతెనను అలాగే వదిలేశారు. ఈ పాత వంతెనను తొలగించకపోవడం, నూతన వంతెన ఎత్తు తక్కువగా ఉండటంతో వచ్చే వరద గ్రామం వైపు మళ్లిందని అధికారులు అంచనా వేశారు. పాత వంతెన తొలగించాలని నిర్ణయించినా ఇప్పటి వరకు తొలగించలేదు. మళ్లీ వర్షాకాలం ఆరంభమయ్యింది.. దీంతో వాగుతో ముంపు ముప్పు లేకపోలేదు.

ఏడాది కావస్తున్నా.. తొలగించని వైనం..

మోరంచపల్లి సమీపంలో మోరంచ వాగు ప్రవాహం వెళ్లేందుకు 353సీ జాతీయ రహదారిపై రెండు వంతెనలున్నాయి. వీటిగుండా అత్యధికంగా 60 వేల క్యూసెక్కుల లోపు ప్రవాహం వెళుతుంది. కానీ గతేడాది జులై 27వ తేదీన దాదాపు 1.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినట్లు అంచనా.. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో బయటకు వెళ్లలేక ప్రవాహం దిశ మార్చుకొని గ్రామంలోకి వచ్చింది. గతంలో ఇక్కడ రోడ్‌డ్యామ్‌లు ఉండేవి. వాటిని తొలగించి మూడు మీటర్ల ఎత్తు పెంచి, రహదారి, వంతెనలు నిర్మించారు. కొత్త వంతెన నిర్మించిన అనంతరం పాత వంతెన తొలగించకపోవడంతో వరద సాఫీˆగా వెళ్లకుండా ఇది అడ్డుపడుతుంది. వరదతో గ్రామం ముంపునకు గురై ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ పాత వంతెనను అలాగే ఉంచారు. 

రెండు వంతెనలు కలిపి ఒకటే నిర్మిస్తే..

మోరంచ వాగుపై మోరంచపల్లి సమీపంలో నిర్మించిన వంతెన చిన్నగా ఉండటం.. ఇది వరకు ఉన్న రోడ్డు కంటే నేషనల్‌ హైవే 353సీˆ 6 అడుగులపైగా ఎత్తు పెంచడంతో పై నుంచి వచ్చిన వరద వంతెన, రోడ్డును తాకి మోరంచపల్లి వైపు మరలుతుంది. వంతెన ఎత్తుగా, రోడ్డు కిందకు ఉన్నా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. గతంలో వంతెన కాకుండా రోడ్‌డ్యాం ఉండేది. ఎంత వరద వచ్చినా నీరు సాఫీగా వెళ్లేదని, వంతెన చిన్నగా నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన సమీపంలో మరో చిన్న వంతెన ఉంది. ఈ రెండు వంతెనల మధ్య రోడ్డు ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు వంతెనలు కలిపి ఒకటే పెద్దగా నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న వంతెనల కంటే ఎత్తుగా పిల్లర్లు వేసి నిర్మిస్తే వరద సాఫీగా వెళుతుంది. వరద గ్రామంలోకి రాకుండా కరకట్టలు నిర్మించాలి. 

నివారణ చర్యలపై ఎమ్మెల్యే దృష్టి..

వాగుతో ముంపు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశిస్తున్నారు. ఇటీవల మోరంచ ప్రాంతాల్లో పర్యటించి వాగు నీరు సాఫీగా వెళ్లేలే చర్యలు తీసుకోవాలన్నారు. 


రహదారి విస్తరణ పనులు చేపడతాం

- మనోహర్, ఈఈ జాతీయ రహదారులు

చెల్పూరు నుంచి గుడెప్పాడ్‌ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నాం. మోరంచ వద్ద కూడా పాత వంతెనలు తొలగించి నూతన నిర్మాణాలు చేపడతాం. టెండర్లను పిలిచి పనులు త్వరలోనే చేపడతాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని