logo

బడి బస్సుకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి

పాఠశాలలు ఈనెల 12న బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల్లో వెళుతుంటారు.

Updated : 16 Jun 2024 06:19 IST

జిల్లా రవాణాశాఖ అధికారి ఎండీ సంధాని

చెల్పూర్‌(భూపాలపల్లి రూరల్‌), న్యూస్‌టుడే: పాఠశాలలు ఈనెల 12న బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల్లో వెళుతుంటారు. అందుకు యాజమాన్యాలు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత విద్యాసంస్థలోని బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై పరిశీలన.. బస్సులు నడిపించాలంటే ఎలాంటి నిబంధనలు ఉండాలి.. వాహన చోదకుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. తదితర విషయాలపై జిల్లా రవాణాశాఖ అధికారి ఎండీ. సంధానితో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది.

ప్రశ్న: పాఠశాల బస్సుల్లో ఎలాంటి నిబంధనలు పాటించాలి. నిబంధనలు పాటించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
జవాబు: పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు  ఏర్పాటు చేసిన బస్సులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాల్సిందే. పాఠశాలల ప్రారంభానికి ముందే జిల్లాలోని అన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలను చేపట్టాం. నిబంధనలు పాటించని పలు వాహనాలను వెనక్కి పంపించి అన్ని రకాలుగా ఫిట్‌నెస్‌ ఉండేలా తయారు చేసి వాటిని మళ్లీ పరిశీలించి అనుమతులు ఇచ్చాం. 
ప్రశ్న: ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.?
జవాబు:బస్సులు మంచి కండిషన్‌లో ఉండాలి. సదరు విద్యా సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్‌ ఉండాలి. ప్రతి బస్సును తనిఖీ చేశాకే అనుమతులు ఇస్తున్నాం. టైర్లు, బ్రేకులు, సీట్లు, ఫుట్‌బోర్డు, ప్రథమ చికిత్స కిట్‌ ఇలా ప్రతి అంశాన్ని పరిశీలిస్తాం. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా వాటిని సరిచేసుకున్నాక అనుమతిస్తాం.

ప్రశ్న: పలు చోట్ల పాఠశాల విద్యార్థులను ఆటో, ట్రాలీ వాహనాల్లో తీసుకెళుతున్నారు. వాటిలో తీసుకెళ్లవచ్చా.
జవాబు:విద్యార్థుల రవాణాకు తప్పనిసరిగా బస్సులు మాత్రమే వినియోగించాలి. తల్లిదండ్రులు పిల్లలను ఆటో, ఇతర వాహనాల్లో పాఠశాలలకు పంపించే ప్రయత్నం చేయవద్దు. తనిఖీలు చేసే క్రమంలో అలాంటి వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తాం.

ప్రశ్న: వాహన చోదకులు ఎలాంటి నిబంధనలు పాటించాలి 
జవాబు:పాఠశాల బస్సు నడిపే వ్యక్తి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వాహన ఫిట్‌నెస్‌ పరిశీలించే సమయంలోనే బస్సు నడిపే వ్యక్తి వివరాలను కూడా తీసుకుంటాం. అనుమతులు తీసుకునే సమయంలో ఒకరు ఆ తర్వాత మరొకరు బస్సులను నడించకూడదు. అధిక వేగంతో వెళ్లకుండా పరిమిత వేగంతో నడపాలి.

ప్రశ్న: సామర్థ్య పరీక్షలు నిర్వహించని బస్సులపై ఏలాంటి చర్యలు తీసుకుంటారు
జవాబు:సామర్థ్య పరీక్ష చేపట్టి అనుమతులు ఉన్న బస్సులను మాత్రమే నడిపించాలి. ఫిట్‌నెస్‌ చేయించకుండా నడిపిస్తూ దొరికితే రూ.5 వేల జరిమానా, ప్రథమ చికిత్స కిట్‌ లేకున్నా, సీట్లు, టైర్లు, ఫుట్‌బోర్డు సరిగా లేకున్నా ఇలా ఒక్కో దానికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తాం.

ప్రశ్న: పాఠశాల బస్సులను శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారా. 
పాఠశాల బస్సుల్లో విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి. అలా కాకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తాం. ఎన్ని జిల్లాలు దాటి వస్తాయో అన్ని జిల్లాల పరిధిలోని జరిమానాలు విధిస్తాం. ఇటీవలే మూడు కేసులను నమోదు చేశాం.  ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వాహనాలను తనిఖీ చేస్తాం.

ప్రశ్న:అధిక లోడ్, మితిమీరిన వేగంతో ఇసుక లారీలు వెళుతున్నాయి. వాటిపై నిఘా పెట్టారా.
జవాబు: ఇసుక లారీలపై నిత్యం నిఘా పెట్టి పరిమితికి మించి లోడ్‌తో వెళుతున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పట్టుబడితే భారీ జరిమానా విధించి కేసు నమోదు చేస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని