logo

‘ప్రత్యేక’ పనులు పూర్తయ్యేదెప్పుడో?..

జిల్లా కేంద్రంలో నిధులు లేనప్పుడు అభివృద్ధి పనులకు మోక్షం కలగలేదు. ఇప్పుడు వివిధ పథకాల్లో నిధులు, పనులు మంజూరైనా అడుగు పడకపోవడంతో కనీస సౌకర్యాలు కరవై..

Published : 16 Jun 2024 05:25 IST

మూడోవార్డులో పనులు చేపట్టాల్సిన బాలాజీనగర్లో ఓ కూడలి దుస్థితి.. 

పనుల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ పూర్తయింది.. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, కౌన్సిల్‌కు, అధికారులకు  ప్రారంభ విషయమై వివరాల నివేదిక సమర్పిస్తామని మున్సిపల్‌ ఇంజినీర్‌ మహిపాల్‌ వివరించారు.

జనగామ, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో నిధులు లేనప్పుడు అభివృద్ధి పనులకు మోక్షం కలగలేదు. ఇప్పుడు వివిధ పథకాల్లో నిధులు, పనులు మంజూరైనా అడుగు పడకపోవడంతో కనీస సౌకర్యాలు కరవై.. పట్టణ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. నెలవారీ రావాల్సిన పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. గతంలో చేసిన పనుల కోసం గుత్తేదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సాధారణ నిధులు కార్యాలయ, పౌర సేవల నిర్వహణకే చాలని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన పిదప ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. 

నియోజకవర్గానికి రూ.10 కోట్లు..

నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్డీఎఫ్‌)ను నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. వీటిలో రూ.2 కోట్లు విద్యాలయాలకు, రూ.కోటి నీటి సరఫరా అభివృద్ధికి, రూ.50 లక్షలు జిల్లా సచివాలయం ఇతర కార్యాలయాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6.5 కోట్ల నిధుల్లో రూ.3.90 కోట్లు జనగామ నియోజకవర్గ మండలాలు, పట్టణానికి కేటాయించారు. ఇందులో రూ.2.45 కోట్లు జనగామ, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట  మండలాలకు, జనగామ పట్టణానికి రూ.1.45 కోట్లు కేటాయించారు. పనుల ప్రతిపాదన, మంత్రి నుంచి ఆమోదం తీసుకురావడంలో డీసీసీ అధ్యక్షుడు, జనగామ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తన వంతు కృషి చేశారు. ఎంపీ ఎన్నికల కోడ్‌కు ముందే గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రహదారులు, కాల్వలు, కమ్యూనిటీ భవనాలు తదితర వాటిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇంకా ప్రారంభం కాలేదు. స్థానిక భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నా ప్రభుత్వం పార్టీ ఇన్‌ఛార్జిలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కొమ్మూరే పనుల కొనసాగింపునకు పాటుపడాల్సి ఉంది. 

 నామినేషన్‌ విధానంలో అప్పగింత.. 

పురపాలిక పరిధిలో రూ.1.45 కోట్లతో 24 పనులను ప్రతిపాదించారు. ఇందులో ఎస్సీ వార్డుల్లో ఆరు, ఎస్టీ వార్డులో 3, జనరల్‌ వార్డుల్లో 15 పనులున్నాయి. రూ.5 లక్షల విలువైన పనులుగా విభజించి నామినేషన్‌ విధానంలో గుత్తేదారులకు అప్పగించనున్నారు. ఒకటి, రెండు, మూడో వార్డులో సీసీ రహదారులు కాల్వల పనులను ప్రతిపాదించారు. పదేళ్లుగా నిరాదరణకు గురైన నాల్గో వార్డు ఇందిరమ్మ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రహదారులను ప్రతిపాదించడంతో స్థానికులు హర్షం ప్రకటించారు. 13వ వార్డులో అసంపూర్తిగా ఉన్న అంబేడ్కర్‌ కమ్యూనిటీ భవనం మిగులు పనులకు రూ.30 లక్షలు కేటాయించారు. వేడుకల మందిరంగా మార్చేందుకు రూ.1.30 కోట్లతో అదనపు పనులు ప్రతిపాదించడంతో ప్రస్తుతానికి దానిని వాయిదా వేశారు. రూ.15 లక్షలను బతుకమ్మ కుంటలో పిల్లల ఆట వస్తువులు, పార్కు, ఓపెన్‌జిమ్‌ పనులకు కేటాయించారు. ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని