logo

అరకొరగా పశువైద్య సేవలు

గ్రామీణ వ్యవస్థలో పాడి పశువులు, గొర్రెలు, మేకలే అనేక కుటుంబాలకు జీవనాధారం. వాటిపైనే ఎన్నో ఏళ్లుగా ఆధారపడి జీవిస్తున్నారు.

Published : 16 Jun 2024 05:30 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెంలో అధ్వానంగా పశు వైద్యాసుపత్రి.. 

పాలకుర్తి, న్యూస్‌టుడే: గ్రామీణ వ్యవస్థలో పాడి పశువులు, గొర్రెలు, మేకలే అనేక కుటుంబాలకు జీవనాధారం. వాటిపైనే ఎన్నో ఏళ్లుగా ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఆ జీవాలకు ఏదైైనా జబ్బు మాత్రం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో సేవలు సకాలంలో అందడం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం పశువైద్యశాలలను బలోపేతం చేస్తున్నామని చెపుతున్నా, క్షేత్ర స్థాయిలో వైద్యులు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో జీవాలు ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశముంది. సత్వర చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుంది. జిల్లాలో పశువైద్యం అందుతున్న సేవల తీరుపై కథనం..

మండలాల్లో దుస్థితి ఇలా..

  • తరిగొప్పుల మండల కేంద్రంలో భవనం బాగానే ఉన్నప్పటికీ వెటర్నరీ అధికారి డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతానికి వెళ్లడంతో జీవాలు వైద్యానికి నోచుకోవడం లేదు.
  • పాలకుర్తి మండలంలో చెన్నూరు, పాలకుర్తిలో రెండు వైద్యశాలలు ఉన్నాయి. పాలకుర్తి భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం ఈ భవనానికే రంగులు వేశారు. వైద్యులు, సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. చెన్నూరులో భవనం బాగానే ఉన్నా.. సేవలు మాత్రం అరకొరగానే ఉన్నాయి.
  • కొడకండ్ల మండల పరిధిలో నాలుగు పశువైద్యశాలలు ఉండగా, ఏడునూతలలో ఒక వైద్యుడు, రామవరంలో రెండు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • బచ్చన్నపేట, పడమటికేశవాపూర్‌ పశువైద్యశాలకు ఒక్కటే వైద్యులు కావడంతో ఇబ్బందిగా మారింది. అలాగే సిబ్బంది కొరత కూడా ఉంది. వైద్య శిబిరాలకు సకాలంలో న్యాయం చేయలేకపోతున్నారు.
  • స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలోని వైద్యశాల శిథిలావస్థలో ఉంది. వర్షాకాలంలో మందులు, ఇతరాత్ర సామగ్రి వర్షాలకు తడుస్తున్నాయని, తమ ప్రాణాలకు సైతం ముప్పుగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. చాలా వరకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో సేవల కొరత ఏర్పడుతుందంటున్నారు.
  • జఫర్‌గఢ్‌ మండలంలోని ఉప్పుగల్లు, తిమ్మంపేట, జఫర్‌గఢ్‌లో పశువైద్యశాలు ఉండగా, సరిపడా మందులు అందుబాటులో ఉండటం లేదు. ఆయా వైద్యశాలల పరిధిలోని వైద్యులు, సిబ్బంది సేవలకు గ్రామాలకు వెళ్తే కేంద్రంలో చికిత్సలు నిలిచిపోయి, నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

గంటల పాటు నిరీక్షణ, ఆపై చికిత్స

కొద్ది రోజుల కింద జిల్లాలోని ఓ మండల కేంద్రంలో వైద్యశాలకు రైతు తన మేకను చికిత్స నిమిత్తం ఉదయం 9 గంటలకే తీసుకొచ్చారు. కానీ 11 అయినా సిబ్బంది కానీ వైద్యులు కానీ కేంద్రానికి రాలేదు. చివరకు 11:15 గంటలకు సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. పల్లెల్లో సేవలందక, ఆసుపత్రులకు తీసుకొస్తే ఇక్కడ నిరీక్షించాల్సి వస్తోందని ఆ రైతు వాపోయారు.

సకాలంలో చికిత్స అందించాలని కోరారు.

  • స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెంలో కొన్నేళ్ల కింద నిర్మించిన పశువైద్యశాలను ఇప్పటివరకు ప్రారంభించలేదు. రూ.లక్షలు వెచ్చించి, భవనాన్ని నిర్మించినా నిరుపయోగంగానే మారింది. దీంతో జీవాలకు చికిత్స అందించడం ఇబ్బందిగా మారుతోంది. గ్రామస్థులు ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిక అందించా..

- మనోహర్, జిల్లా పశువైద్యాధికారి, జనగామ

జిల్లాలోని వైద్యులు, సిబ్బంది ఖాళీలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఉద్యోగుల కొరత వల్ల సరైన సేవలు అందించలేకపోతున్నాం. అలాగే గ్రామాల్లో అందడం సవాల్‌గా మారింది. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి, ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని