logo

కొత్త పాలనాధికారిగా సత్య శారదాదేవి

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జిల్లా కలెక్టర్ల బదిలీల్లో వరంగల్‌ జిల్లా పాలనాధికారిగా రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సత్యశారదాదేవి నియమితులయ్యారు.

Published : 16 Jun 2024 05:42 IST

కలెక్టర్‌ పి.ప్రావీణ్య హనుమకొండకు బదిలీ..

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జిల్లా కలెక్టర్ల బదిలీల్లో వరంగల్‌ జిల్లా పాలనాధికారిగా రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సత్యశారదాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మార్చి 13న వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన పి.ప్రావీణ్యను హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.
 ఏడాదికి పైగా కలెక్టర్‌గా పనిచేసిన ప్రావీణ్య జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను ముందుండి నడిపించారు. సర్కారు నిర్దేశించిన గడువులోగా.. ప్రభుత్వ పాఠశాలలకు సమైక్య మహిళా సంఘాలతో ఏకరూప దుస్తులను కుట్టించారు. వాటిని సకాలంలో బడులకు అందజేసి రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో ఉంచారు. శిథిలావస్థలో ఉన్న ఇంజినీరింగ్‌శాఖ భవనాన్ని.. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంగా అభివృద్ధి చేసి, కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని ప్రకృతి శోభాయమానంగా తీర్చిదిద్దారు. పోటీపరీక్షల నేపథ్యంలో నిరుద్యోగ యువత సౌలభ్యం కోసం ప్రత్యేక నిధులు రూ.22.19 లక్షలు సమకూర్చి జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేశారు. గతేడాది నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాన్ని మించి మొక్కలు నాటి జిల్లాను హరితపథంలో నడిపారు. జిల్లా పరిధిలోని వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు గతేడాది నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలను జిల్లా ఎన్నికల అధికారిగా.. ఈ ఏడాది మే నెలలో జరిగిన వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికలను రిటర్నింగ్‌ అధికారిగా వివిధ జిల్లాల, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ.. రెండు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు.

  • 2021 సెప్టెంబరు 3న జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి.. సుమారు 18 నెలల పాటు వరంగల్‌ నగరంలో అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు ఆమె తీసుకున్నారు. 

మూడో మహిళ..

2015 క్యాడర్‌(గ్రూప్‌1)కు చెందిన ఎం.సత్యశారదా దేవి కలెక్టర్‌గా నియామకం ఇదే తొలిసారి. జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్‌ జిల్లా తొలి కలెక్టర్‌గా ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ పనిచేశారు. ఆయన తర్వాత జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.హరిత జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2021 సెప్టెంబరు ఒకటో తేదీన ఆమె బదిలీ కావడంతో ఆ స్థానంలో బి.గోపీ, ఆయన తర్వాత పి.ప్రావీణ్య జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రావీణ్య బదిలీతో వరంగల్‌ జిల్లా మూడో మహిళా కలెక్టర్‌గా ఎం.సత్య శారదాదేవి బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • భాగ్యనగరానికి చెందిన డా.సత్యశారదా దేవి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్లాంట్‌ మాలిక్యులర్‌ జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో కొంతకాలం పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పనిచేశారు. 2008లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఆలిండియా 34వ ర్యాంకు, 2009లో జరిగిన గ్రూప్‌-1 పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు, మహిళా విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు. అనంతరం చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రత్యేక అధికారిగా ధీర్ఘకాలం పనిచేసి, పబ్లిక్‌ సర్వీసెస్‌లో విశేష కృషి చేసినందుకు మీసేవా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ, సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ.. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని