logo

నాన్న విజయం

వారంతా విభిన్న రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు.. కానీ, ఆ గెలుపు వెనకాల అలుపెరగని కృషి చేసింది మాత్రం వారి కన్న తండ్రులే.. పసితనం నుంచి అన్ని దశల్లో అండగా ఉన్నారు..

Published : 16 Jun 2024 05:52 IST

నేడు అంతర్జాతీయ నాన్నల దినోత్సం

  • ఓ.. నాన్నా! నేను ఉన్నత స్థాయికి వచ్చానని వేనోళ్ల నన్ను పొగుడుతున్నారు.. కానీ, నా ప్రయాణంలో ప్రతి అడుగులో నువ్వు వెన్నంటి ఉండి నడిపించావని ఎవరికీ తెలియదు.. అందుకే ఓసారి గట్టిగా అరిచి చెప్పాలనుంది.. నా ఈ విజయం నైతికంగా నీకే దక్కుతుందని.. 
  • నాకు ప్రశంసలు వచ్చిన ప్రతిసారీ అంతా చప్పట్లు కొడుతుంటే నా కన్నా ఎక్కువగా నువ్వే పొంగిపోయావు.. ఆనందభాష్పాలతో మురిసిపోయావు.. కానీ, ఆ విజయాలు నా కోసం నువ్వు చిందించిన చెమట చుక్కలకు ప్రతిఫలాలన్నది మాత్రం ఈ లోకానికి తెలియదు. 
  • ఏమిచ్చి తీర్చుకోను నాన్నా నీ రుణం..? నేను సాధించిన ప్రతి విజయం నువ్వు ప్రతిసారీ చేసిన ఓ త్యాగఫలితమే అని ప్రపంచానికి అర్థమయ్యేలా ఎలా చెప్పేది? ఒక్కమాట మాత్రం చెప్పగలను.. నా విజయానికి రూపమిస్తే మాత్రం అది కచ్చితంగా నువ్వేనని..! దేవుడిని ఒక్కటే కోరుకుంటా.. ఎన్ని జన్మలైనా మళ్లీ నీకే బిడ్డగా పుట్టాలని!

వారంతా విభిన్న రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు.. కానీ, ఆ గెలుపు వెనకాల అలుపెరగని కృషి చేసింది మాత్రం వారి కన్న తండ్రులే.. పసితనం నుంచి అన్ని దశల్లో అండగా ఉన్నారు.. పిల్లలను ప్రేమగా సాకుతూనే వారు ఉన్నత శిఖరాలు అందుకునేందుకు అహర్నిశలు శ్రమించారు.. క్రీడలు, కళలు, ఉన్నత ఉద్యోగం.. ఇలా భిన్న రంగాల్లో అద్భుతాలు సాధిస్తున్న ఉమ్మడి వరంగల్‌కు చెందిన విజేతల వెనకాల వారి తండ్రులు ఎలా కృషి చేశారో చెబుతూ ‘అంతర్జాతీయ నాన్నల దినోత్సవం’ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం. 

ఈనాడు, వరంగల్‌ 

కుమార్తె కోసం.. వైకల్యం లెక్కచేయక 

హనుమకొండకు చెందిన కూచిపూడి కళాకారిణి పెండ్యాల లక్ష్మిప్రియ.. ఈ రంగంలో ఉన్నత శిఖరాలు అందుకుందంటే.. ఆమె తండ్రి రాకేశ్‌ కృషి ఎనలేనిది..  ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఈ అమ్మాయి నృత్యగురువు బొంపెల్లి సుధీర్‌రావు వద్ద ఎనిమిదేళ్లపాటు శిక్షణ పొందారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌’ను రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. రాకేశ్‌ చెన్నైలో 2001 ప్రాంతంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి తీవ్రంగా దెబ్బతింది. 15 రోజుల పాటు కోమాలోనే ఉన్నారు. కోలుకున్నాక పట్టువదలకుండా ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. మంచిర్యాలకు చెందిన సాయిలతను వివాహం చేసుకున్నారు. లక్ష్మిప్రియ, క్రిష్‌ సంతానం.. వైకల్యం ఏమాత్రం లెక్కచేయని రాకేశ్‌ కుమార్తెపై పూర్తి శ్రద్ధ పెట్టారు. బాలపురస్కార్‌కు దరఖాస్తు చేసే క్రమంలో రాకేశ్‌ అవిశ్రాంతంగా శ్రమించి చివరకు కూతురు జాతీయ స్థాయిలో మెరిసేలా కృషి చేశారు.

తండ్రి బాటలో ఐఎఫ్‌ఎస్‌ 

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి : తండ్రిది అటవీ శాఖలో చిరుద్యోగం.. కానీ, తనయుడు మాత్రం అదే శాఖలో ఐఎఫ్‌ఎస్‌ సాధించారు. ఆ స్థానానికి వెళ్లేందుకు మార్గదర్శనం చేసింది మాత్రం నాన్నే.. భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన పోరిక సూరిదాస్‌ 1989లో అటవీ శాఖలో రిజర్వ్‌ వాచర్‌గా చేరారు. 2002లో ఎఫ్‌బీవోగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో ఎఫ్‌బీవోగా పని చేస్తున్నారు. పై అధికారుల దర్జాను చూసి పిల్లలను ఆ స్థాయిలో చూడాలని కోరుకునేవారు.. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా టీవీ చూడటం కూడా మానేశారు. కుమారుడు లవకుమార్‌ను బీటెక్, కూతురు లావణ్యను బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివించారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి చదివి ఐఎఫ్‌ఎస్‌ 130వ ర్యాంకు సాధించాడు. లవకుమార్‌ ఆరుసార్లు యూపీఎస్సీ పరీక్షలు రాశారు. విఫలమైన ప్రతిసారీ తండ్రి వెన్నంటే ఉండి ప్రోత్సహించారు. 

కుమారుడి స్మృతిలో..

రంగశాయిపేట : అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు.. బీటెక్‌ చదివే సమయంలో అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. కన్నీరుమున్నీరైన ఆ తండ్రి కుమారుడిని నేటికి మరవకుండా 12 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ స్మరించుకుంటున్నారు. రంగశాయిపేటకు చెందిన కొల్లూరి యోగానంద్‌ కుమారుడు కొల్లూరి రిషీనంద్‌(20) 2012లో ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్తూ ఉర్సుగుట్ట ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి తండ్రి రిషీనంద్‌ మెమోరియల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి ప్రజా సేవ చేస్తున్నారు. మహంకాళీ ఆలయ కూడలిలో నాలుగు వైపులా రోడ్డుపై వేగ నియంత్రికలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద రూ.9.94 లక్షలతో బొడ్రాయి నిర్మించారు. మేరవాడలోని భవానీశంకర ఆలయంలో రూ.3 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రిషీనంద్‌ జయంతి, వర్ధంతి సందర్భంగా అన్నదానాలు, వృద్ధులు, అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. 

భూమి అమ్మి.. వెన్నుదన్నుగా..

 పర్వతగిరి : దివ్యాంగురాలైన బిడ్డ.. తరచూ ఫిట్్స వచ్చేవి.. కటిక పేదరికం.. అయినా ఆ తండ్రి ఏమాత్రం వెనకాడక ప్రోత్సహించారు. ఉన్న భూమిని అమ్మేశారు. ఆయన శ్రమకు ఫలితం దక్కి కూతురు అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన జీవంజీ దీప్తి అథ్లెటిక్స్‌లో అద్భుతాలు సాధిస్తున్నారు. గత నెలలో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ప్రపంచ రికార్డు తిరగరాసింది. ఈ ఏడాది పారిస్‌లో జరిగే పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. దీప్తికి మానసిక వైకల్యం ఉండడంతో తండ్రి యాదగిరి తల్లడిల్లారు. కల్లెడలోని ఆర్డీఎఫ్‌ పాఠశాలలో చేర్పించగా వ్యాయామ ఉపాధ్యాయుడు దీప్తిలో మంచి అథ్లెట్‌ ఉన్నట్లు గుర్తించారు. అలా జిల్లా స్థాయిలో సత్తా చాటాక రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది కావడంతో యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశారు. సర్వస్వం కోల్పోవడంతో కల్లెడకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు ఆర్థికంగా ఆదుకున్నారు. తన కూతురు ఉన్నత శిఖరాలు అందుకోవడం కన్నా తనకేదీ ఎక్కువ కాదని యాదగిరి అన్నారు.

విద్యానిధి ఏర్పాటు చేసి..

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు  బహుమతి అందజేత(పాత చిత్రం) 

దేవరుప్పుల(జనగామ జిల్లా) : దేవరుప్పులకు చెందిన మర్రి మాధవరెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు అరవింద్‌రెడ్డి(25) 15 ఏళ్ల క్రితం అమెరికాలో అకాల మరణం చెందారు. కుమారుడి స్మృతిలో ‘మర్రి ఆరవింద్‌ రెడ్డి స్మారక విద్యానిధి’ని అప్పట్లోనే ఏర్పాటు చేసి రూ.లక్ష డిపాజిట్‌ చేశారు. దానిపై వచ్చే వడ్డీ సుమారు రూ.11వేలతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పదో తరగతి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థికి రూ.7 వేలు, దేవరుప్పుల ఉన్నత పాఠశాల నుంచి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి రూ.4 వేల నగదు, జ్ఞాపిక, అందించి సన్మానం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని