logo

త్యాగం, సేవానిరతి అందిపుచ్చుకుందాం..!

మహ్మద్‌ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ఏటా ముస్లిం సోదరులు బక్రీద్‌ జరుపుకొంటారు. దీనికి ఈద్‌-ఉల్‌-జుహా/ఈద్‌-ఉల్‌-అధా’ అని కూడా పేరు.

Published : 17 Jun 2024 02:45 IST

బక్రీద్‌ సారాంశమిదే..
-డోర్నకల్, న్యూస్‌టుడే

హ్మద్‌ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ఏటా ముస్లిం సోదరులు బక్రీద్‌ జరుపుకొంటారు. దీనికి ఈద్‌-ఉల్‌-జుహా/ఈద్‌-ఉల్‌-అధా’ అని కూడా పేరు. ఇస్లామిక్‌ కాలమానిని ‘హిజ్రి’ అనుసరించి జిల్‌హజ్‌ మాసంలోని 10న ఈ పండగని నిర్వహించడం ఆనవాయితీ. రంజాన్‌ తర్వాత ముస్లింలు జరుపుకొనే పెద్ద పండగ ఇదే.  ఇందులోని త్యాగ నిరతిని మనం అందిపుచ్చుకుంటే ఎవరికివారు లోక కల్యాణానికి పెద్దపీట వేసిన వారవుతారు. సోమవారం బక్రీద్‌ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


ఏడాది పొడవునా పాటిద్దాం..

పోటీ ప్రపంచంలో రక్త సంబంధీకులే అయినప్పటికీ పలకరించుకోలేనంత దూరం.   ఈ పరిస్థితి పండగ పూట కనిపించదు. ఇంటిల్లిపాది ఒక చోట చేరి ఆప్యాయతను పంచుకుంటారు. ప్రతి పనిని కలిసి మెలిసి చేస్తారు. ప్రార్థనకు కలిసికట్టుగా వెళతారు. తిరిగొచ్చాక అంతే ప్రేమాభిమానంతో ఖుర్భానీ పాటిస్తారు. ఏ విషయంలోనూ పొరపొచ్చాలకు తావుండదు. ఇది నిత్యకృత్యం కావాలి.


సందడిగా మండిబజార్‌

మట్టెవాడ: బక్రీద్‌ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ నగరంలో ఆదివారం సాయంత్రం మండిబజార్‌ పరిసర ప్రాంతాలు జనాలతో కిటకిటలాడాయి. పండగను పురస్కరించుకొని ముస్లింలు సామగ్రి కొనుగోళ్లకు తరలివచ్చారు. నగర శివారులోని పలువురు గొర్రెల వ్యాపారులు మండిబజార్‌ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా జీవాలను విక్రయించారు. ముస్లిం కుటుంబ పెద్దలు పొట్టేళ్లను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. ఒక్కో పొట్టేలుకు దానికి రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలికింది. 


సంప్రదాయంగా సాయం..

  • రంజాన్‌ మాసంలో ధనవంతుల సంపాదనలో నిర్ణీత భాగాన్ని పేదల హక్కుగా ఫిత్రా, జకాత్‌ పేరిట దానం చేస్తారు. ఇదే సంప్రదాయం బక్రీద్‌లోనూ కనిపిస్తుంది. ఈ పండగలో ‘ఖుర్బానీ’ ప్రధాన భూమిక పోషిస్తుంది. తన కుమారుడిని ప్రవక్త ఇబ్రహీం బలి ఇవ్వడానికి సిద్ధపడిన నాటి నుంచి ప్రళయం వరకు ఖుర్బానీ కొనసాగించాలని నాడు అల్లాహ్‌ ఆదేశించినట్లు చెబుతారు. అప్పటి నుంచి ఇది కొనసాగుతోంది. అందుకే బక్రీద్‌లో ఖుర్బానీ ఆచరిస్తారు. 

పేదోళ్లకు ఆసరా:  పేదలకు చేయూత అందించడంలో మనమందరం ముందుండాలి. ఆర్థిక స్థోమత కలిగినోళ్లు, ధనవంతులు కష్టాల్లో ఉన్నోళ్లకు ఆసరాగా నిలవడానికి ముందుకు రావాలి.

  • బక్రీద్‌ సందర్భంగా ఖుర్బానీ ఇచ్చే జంతువుల మాంసంలోనూ పేదలకు కచ్చితమైన ‘వాటా’ని ఇస్లాం నిర్దేశించింది. బలి ఇచ్చాక జంతువు మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగం రక్త సంబంధీకులైన కుటుంబ సభ్యులు, రెండో భాగం బంధు మిత్రులు, మూడో భాగం పేదల కోసమని కేటాయిస్తారు.  ఇలా అందరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా లేదా సామాజిక కార్యక్రమాలకు కేటాయించాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని