logo

అమ్మ చెప్పింది.. అత్తమ్మ ప్రోత్సహించింది

తన విజయంలో తల్లి, అత్తయ్య ముఖ్యపాత్ర పోషించారని వరంగల్‌ పాలనాధికారిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన డా.సత్య శారదాదేవి అన్నారు. బాగా చదువుకోవాలని అమ్మ విజయలక్ష్మి చెప్పేది..

Published : 17 Jun 2024 02:51 IST

నా జీవితంలో ఇద్దరు విజయలక్ష్ములు 
వరంగల్‌ పాలనాధికారి డా.సత్య శారదాదేవి

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే:  తన విజయంలో తల్లి, అత్తయ్య ముఖ్యపాత్ర పోషించారని వరంగల్‌ పాలనాధికారిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన డా.సత్య శారదాదేవి అన్నారు. బాగా చదువుకోవాలని అమ్మ విజయలక్ష్మి చెప్పేది.. వివాహం అనంతరం మా అత్తయ్య విజయలక్ష్మి ఎంతో ప్రోత్సహించారు. వారిద్దరి తోడ్పాటు వల్లే గ్రూపు-1 పరీక్షలు రాసి ప్రభుత్వ సర్వీసులోకి వచ్చానని చెప్పారు.. వివరాలు ఆమె మాటల్లోనే.. 

విద్యాభ్యాసం.. 

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నేను యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్లాంట్‌ మాలిక్యులర్‌ జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాను.  సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)లో కొంతకాలం పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పనిచేశాను. ఆ సమయంలో ట్రాన్స్‌జెనెటిక్‌ మొక్కల ఉత్పత్తిపై పరిశోధనల కోసం జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సందర్శించినప్పుడు.. జిల్లాస్థాయిలో ఉద్యోగ విధులు ఏవిధంగా ఉంటాయో అవగాహన కలిగింది. 

  • చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న వరంగల్‌ జిల్లా విశేషాల గురించి పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నాను.  ఇక్కడ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ముందుగా అధ్యయనం చేసిన తర్వాత.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప విషయం.. అలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌గా వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పనిచేస్తాను.. 

ధరణి సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కారం..

అయిదేళ్లపాటు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ)లో ప్రత్యేక అధికారిగా విధులు నిర్వర్తించాను. ధరణి భూ సంబంధిత సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది.  వరంగల్‌ జిల్లాలో ఎలాంటి రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాల్సి ఉంది. రెవెన్యూ వ్యవస్థలో సీసీఎల్‌ఏనే అత్యున్నత విభాగం.  రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సీసీఎల్‌ఏ విధాన రూపకంగా తీసుకున్న నిర్ణయాలు జిల్లాస్థాయిలో ఏవిధంగా అమలవుతున్నాయో చూడాల్సిన అవసరముంది. ఆదివారం కొంతమంది జిల్లా అధికారులతో చర్చించిన తర్వాత.. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి సమస్య.. నకిలీ విత్తనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరమున్నట్లు తెలిసింది.

ఆధ్యాత్మిక పుస్తకాలంటే ఇష్టం..

వైజ్ఞానికపరమైన విషయాలను తార్కిక సంబంధిత అంశాలతో ముడిపెట్టే మతపరమైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదివేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. ఒక యోగి ఆత్మకథ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస తదితర ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాతన, చారిత్రక అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాను. క్రీడలు, ఇతర వ్యాపకాల్లో ఎక్కువగా ప్రావీణ్యం లేదు. 


లక్ష్య సాధనలో ప్రయాణాన్ని ఆస్వాదించాలి

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా చాలా కష్టపడితే తప్ప విజయం సాధించడం అసాధ్యం. నేటితరం యువత నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు  నిరంతరం కృషి చేయాలి. పక్కవారు పోల్చుకొని నిరుత్సాహ పడొద్దు.  లక్ష్య సాధనలో ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించినప్పుడే విజయం చేరువవుతుంది. ప్రణాళికతో సన్నద్ధమైతే అనుకున్నది సాధించవచ్చు.


మా అత్తయ్యే.. గేమ్‌ ఛేంజర్‌..

కుటుంబ సభ్యులతో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డా.సత్య శారదాదేవి

నా జీవితంలో గేమ్‌ ఛేంజర్‌గా మా అత్తయ్య విజయలక్ష్మి ముందు వరుసలో ఉంటారు. మా నాన్న శేషగిరి కార్మికశాఖలో విధులు నిర్వర్తించి ఉద్యోగవిరమణ పొందారు. అమ్మ విజయలక్ష్మి ఎల్‌ఐసీలో పనిచేస్తారు.. మామయ్య భూలోక ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అత్తయ్య ఇంటి వద్దే ఉంటూ మా అందరి బాగోగులు చూసుకుంటుంటారు. భర్త వరప్రసాద్‌ హైదరాబాద్‌ సిటీ కళాశాలలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మాకు ఓ కూతురు ఉంది. నేను పరిశోధనల్లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పుడు.. ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలు రాయాలని మా అత్తయ్యే సూచించారు. నా వెన్నుతట్టి ప్రోత్సహించడంతోనే ప్రభుత్వ సర్వీసుల్లోకి వచ్చాను. నా జీవితంలో గేమ్‌ ఛేంజర్‌ మా అత్తయ్యే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని