logo

నెరవేరని ఓ పాలనాధికారి ఆశయం

జిల్లా హోదాను సంతరించుకున్న జనగామ పట్టణాన్ని సుందరీకరించాలనే ప్రజల కోరిక, నేతల ఆకాంక్ష, అధికారుల ఆశయం నెరవేరడం లేదు. మున్సిపల్‌ కొత్త చట్టాన్ని అనుసరించి, పురపాలన పర్యవేక్షక బాధ్యతలు కలెక్టర్‌కు సంక్రమించాయి.

Updated : 17 Jun 2024 05:50 IST

అసంపూర్తిగా సుందరీకరణ పనులు..  రూ.10 లక్షలు మట్టిపాలు.. 

రహదారి వంతెన కింద పచ్చదనం (గార్డెనింగ్‌) కోసం ఇలా మట్టి పోసి వదిలేశారు.. 

జనగామ, న్యూస్‌టుడే: జిల్లా హోదాను సంతరించుకున్న జనగామ పట్టణాన్ని సుందరీకరించాలనే ప్రజల కోరిక, నేతల ఆకాంక్ష, అధికారుల ఆశయం నెరవేరడం లేదు. మున్సిపల్‌ కొత్త చట్టాన్ని అనుసరించి, పురపాలన పర్యవేక్షక బాధ్యతలు కలెక్టర్‌కు సంక్రమించాయి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలున్నాయి. ఓ కలెక్టర్‌ తల్చుకుంటే పురపాలిక పరిధిలో సుమారు రూ.20 లక్షల పని కాకుండా ఉంటుందా.. జనగామలో మాత్రం జిల్లా పాలనాధికారి కోరుకున్నా ఓ అభివృద్ధి పని అర్ధాంతరంగానే నిలిచిపోయింది. 

రూ.20 లక్షల అంచనాతో: స్థానిక శివాలయం క్రాస్‌ రోడ్డు సమీపం నుంచి పాత గేటు వరకు, ఆపైన జిల్లా ఆసుపత్రి వెళ్లే దారి వరకు వంతెన కింద గార్డెనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. నిధుల కొరతతో రూ.20 లక్షల పట్టణ ప్రగతి నిధులతో ఎంత వరకు వీలైతే అంతవరకు సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. రెండేళ్ల కిందట రూ.10 లక్షలతో కొంత వరకు మొరం, మట్టి పోశారు. ఇరువైపులా సీసీ బారికేడ్‌ నిర్మించారు. పాత గేటు సమీపంలోని వంతెన మెట్ల వరకే పనులు జరిగాయి. నిధుల కొరతతో అక్కడికే పనులు నిలిపివేశారు. రూ.10 లక్షలు వెచ్చించినా లక్ష్యం నెరవేరని తీరుపై ‘ఈనాడు’లో పలు సందర్భాల్లో కథనాలు వెలువరించగా, కౌన్సిల్‌ ఈ అంశంపై చర్చించి అదనంగా రూ.10 లక్షలతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. పట్టణ ప్రగతి నిధులు నెలవారీగా విడుదల కాకపోవడంతో ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రూ.10 లక్షలు మట్టిపాలయ్యాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు.


ప్రజలేం కోరుకుంటున్నారంటే.. 

2018లో రూ.30 కోట్లు పట్టణ సుందరీకరణకు మంజూరయ్యాయి. ఇటీవల మరో రూ.25 కోట్లు, పట్టణాభివృద్ధి సుందరీకరణకు పథకం మంజూరైంది. వార్డులు, వాటాలు, కోటాల వారీగా నిధులు, పనులు పంచడం కంటే.. పట్టణం మొత్తానికి ఉపకరించే పనులకు కొంత మొత్తాన్ని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్వోబీకి మరోవైపు దారిని బాగు చేసి, అదనపు నిధులతో వంతెన కింద పచ్చదనం పెంపు పనులను వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


పట్టణ ప్రగతి నిధులు రాకపోవడంతో వంతెన సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. రెండో వైపు దారి అభివృద్ధి ప్రతిపాదన ఉంది. ఈ అంశాలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువెళ్లి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని మున్సిపల్‌ ఇంజినీర్‌ మహిపాల్‌ వివరించారు.


రహదారి వంతెన రెండో వైపు.. చెత్తకుండీగా మారిన దారి 

పాత గేటు సమీపంలో ఆర్వోబీ మెట్ల దారి వద్ద నుంచి సీపీఐ కార్యాలయం వరకు దారి ఉన్నా, అభివృద్ధి చేయకపోవడంతో రెండు వైపులా చెత్తపోస్తుండటంతో ఈ దారి డంపుయార్డును తలపిస్తోంది. మెట్ల కూడలి వద్ద విశాలమైన ఖాళీ స్థలం ఉండటంతో కిరాణ సామగ్రి వ్యర్థాలను, మాంస విక్రేతలు తమ దుకాణాల వ్యర్థాలను, ఇరుగు పొరుగు ఇళ్లవారు వివిధ రకాల వ్యర్థాలను పోస్తున్నారు. పారిశుద్ధ్య విభాగం దీన్ని నివారించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. 


తొలి పర్యటనలో 

2018 ఏప్రిల్‌ 6 న అధికారులతో సమీక్షిస్తున్న అప్పటి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

గతంలో ఇక్కడే ఆర్డీవోగా, జనగామ మున్సిపల్‌ ప్రత్యేక అధికారిగా, జిల్లా రెండో కలెక్టర్‌గా పనిచేసిన వినయ్‌కృష్ణారెడ్డి పట్టణంలో తొలి పర్యటనలో స్థానిక పాత రైల్వేగేటు నుంచి నెహ్రూపార్కు వరకు ఉన్న రహదారి వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి రోడ్డు వంతెనల కింద ఎలాంటి ఆవాసాలు, వ్యాపారాలు ఉండరాదనే నిబంధనను అమలు పర్చడంతో పాటు, సుమారు 30 ఏళ్ల కింద నిర్మించిన వంతెన కారణంగా ఎవరికీ ప్రమాదం వాటిల్లరాదని, సుందరీకరణ పనులు చేపట్టాలని ఆకాంక్షించారు. వంతెన కింద ఆక్రమణలు తొలగించి, గార్డెనింగ్‌ చేయాలని, రెండో వైపు రహదారిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. పురపాలికలో ఈ మేరకు తీర్మానం చేశారు. అప్పటి ప్రతిపాదన ఇంకా కార్య రూపం దాల్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని