logo

ఠాణాలు లేవు.. సిబ్బంది రారు!

జనగామ మున్సిపల్‌ పట్టణంగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉంటూ 8 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. జనగామలో దాదాపు 40 శాఖలతో జిల్లా సచివాలయం ఏర్పాటైంది. దీనికి తోడు ఈ ప్రాంతం రోజు రోజుకు విస్తరిస్తోంది.

Published : 17 Jun 2024 03:01 IST

పోలీసు శాఖను వెంటాడుతున్న సమస్యలు
జనగామ టౌన్, న్యూస్‌టుడే

జనగామలో వెస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయం

జనగామ మున్సిపల్‌ పట్టణంగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉంటూ 8 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. జనగామలో దాదాపు 40 శాఖలతో జిల్లా సచివాలయం ఏర్పాటైంది. దీనికి తోడు ఈ ప్రాంతం రోజు రోజుకు విస్తరిస్తోంది. జిల్లా కార్యాలయాల్లో పనుల కోసం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో జనగామలో ట్రాఫిక్‌ రద్ధీ పెరిగింది. జిల్లాగా మారినా పోలీసు శాఖాపరంగా మాత్రం జనగామ వెనుకబడిపోయింది. జనగామకు ప్రత్యేక ఎస్పీ స్థాయి కల్పించకపోవడంతో పాటు జనగామను వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో కలిపారు. దీంతో ఎలాంటి పురోగతి లేదనే విమర్శలు వస్తున్నాయి.

మహిళా కేసులే అధికం..

జిల్లాలో మహిళలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. అలాగే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. ఒకరిద్దరు పోలీసులను నియమించినా ట్రాఫిక్‌ నియంత్రణ ఇబ్బందిగా మారింది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణం, మండలంలో శాంతి భద్రతలకు ఒకే ఠాణా ఉండటంతో సమస్యగా మారింది. జనగామకు ప్రత్యేక రూరల్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల ఏర్పాటు కలగానే మిగిలింది.

బందోబస్తుకు ఇబ్బందులు.. పెరుగుతున్న చోరీలు

జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో చోరీల సంఖ్య పెరిగిపోతోంది. జనగామలో ఇటీవల తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఉన్న సిబ్బంది పని చేస్తున్నా పోలీసుల కొరతతో చోరీలు పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో రూరల్, పట్టణ స్టేషన్లు వేర్వేరుగా ఉంటే సిబ్బంది కొరత ఉండదని, దీంతో బందోబస్తు పెరిగి చోరీలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. అలాగే జిల్లా కేంద్రంలో ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ మంజూరైనట్లు ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. 

మౌలిక వసతులకు ఇబ్బంది..

జనగామలో వెస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయం ఏసీపీ కార్యాలయ ఆవరణలో నిర్మించినా కూడా నిధుల లేమితో అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం సిద్ధిపేట రోడ్డు వైపు ఉన్న పాత డీఎస్పీ కార్యాలయంలో డీసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. డీసీపీ కార్యాలయానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తే పూర్తవుతుంది. డీసీపీ కార్యాలయం పూర్తయితే అక్కడికి డీసీపీ కార్యాలయం మార్చి పోలీసు క్వార్టర్ల సముదాయంలో ఉన్న ఏసీపీ కార్యాలయం ప్రస్తుత డీసీపీ కార్యాలయంలోకి మార్చాలి. అలాగే పట్టణ పోలీసు స్టేషన్‌ కూడా ఇరుకుగా ఉంది. పట్టణ ఠాణాను హనుమకొండ రోడ్డు వైపు ఉన్న పోలీసు క్వార్టర్ల ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 


ట్రాఫిక్‌ ఠాణా మంజూరైనా సిబ్బంది  కేటాయింపు జరగలేదు
- పి.సీతారాం, వెస్ట్‌జోన్‌ డీసీపీ

జనగామకు ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ మంజూరైనా ఇప్పటి వరకు ప్రభుత్వం సిబ్బందిని కేటాయించలేదు. రూరల్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ఇంకా ప్రతిపాదనలు పంపలేదు. మహిళా పోలీసు స్టేషన్‌ అవసరం ఉంది. మహిళా సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏర్పాటు కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఉన్న సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా మెరుగైన సేవలు అందిస్తున్నాం. 

జిల్లా పోలీసు శాఖ వివరాలు

వెస్ట్‌జోన్‌ డీసీపీ : 1
ఏసీపీలు : 2
పోలీసు సర్కిళ్లు : 5
మండల పోలీసు స్టేషన్లు : 12 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని