logo

శ్రీగంధం.. ఆదాయ మార్గం

పచ్చదనం పెంచేందుకు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు ఖాళీ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా పెంచుతున్నారు.

Published : 17 Jun 2024 03:04 IST

అటవీ శాఖ నర్సరీలో పెరుగుతున్న మొక్కలు

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి : పచ్చదనం పెంచేందుకు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు ఖాళీ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా పెంచుతున్నారు. ప్రజలకు సైతం పంపిణీ చేసి ఇళ్లల్లో పెంచేలా సహకరిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ సారి నూతనంగా శ్రీగంధం మొక్కల పెంపకానికి అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. మార్కెట్‌ మంచి డిమాండ్‌ ఉన్న శ్రీగంధం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. 2 లక్షల మొక్కలను పెంచనున్నారు. మొదటి దశలో మహదేవపూర్‌ డివిజన్‌లో అటవీ శాఖ నర్సరీలో 60 వేల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల విత్తనాలను తీసుకొచ్చి ప్రత్యేక వాతావరణంలో వాటిని జాగ్రత్తగా పెంచుతూ పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక షెడ్ల కింద వీటిని పెంచుతున్నారు. 

ఆసక్తిగల వారికి..

శ్రీగంధం మొక్కలను సిద్ధం చేసి ఆసక్తిగల రైతులకు పంపిణీ చేసేందుకు, అటవీ ప్రాంతాల్లో ప్లాంటేషన్‌ చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొక్కలు నాటేందుకు వీలుగా పెరిగే వరకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఖాళీ స్థలాలు ఉండి.. పెంచేందుకు ఆసక్తి ఉన్న రైతులకు, పొలం గట్లపై నాటుకునే వారికి పంపిణీ చేయనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పంటగా వీటిని భావించవచ్చు. 15 ఏళ్ల తర్వాత మంచి ఆదాయం సమకూరుతుంది.

ప్రయోజనాలెన్నో..

శ్రీగంధం చేతికి రావడానికి కొంత ఎక్కువ సమయం పట్టినా తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా పంటలతో పోలిస్తే నీటి వినియోగం కూడా తక్కువే.. 2 నుంచి 3 వారాలకు ఒకసారి నీటి తడులు ఇస్తే సరిపోతుంది. బిందు పద్ధతిలోనూ నీటిని అందించవచ్చు. ఎరువుల ఖర్చు కూడా తక్కువే.. 15 ఏళ్ల తర్వాతే దిగుబడి వస్తుంది.. ఒక్కో చెట్టు నుంచి 20-25 కిలోల వరకు శ్రీగంధం దిగుబడి వస్తుంది. బయట మార్కెట్‌లో కిలో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. 20 ఏళ్ల వరకు ఆగితే మరింత దిగుబడి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. శ్రీగంధంలో అంతర పంటలు వేసుకుంటే ఏటా వాటి ద్వారానూ ఆదాయం సమకూరుతుంది. ఇలా అనేక ప్రయోజనాలున్నాయి. 


మొక్కలను పెంచుతున్నాం..
-వసంత, డీఎఫ్‌ఓ, భూపాలపల్లి

విత్తనాలను తెప్పించి శ్రీగంధం మొక్కలను నర్సరీలో పెంచుతున్నాం. నాటే దశకు రాగానే ఆసక్తి గల రైతులకు పంపిణీ చేస్తాం.. రైతులు ఖాళీ స్థలాల్లో పెంచుకుంటే మంచి ఆదాయం సమకూరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని