logo

సకల వసతులు.. మెరుగైన బోధన

సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రాంకుమార్‌ తెలిపారు.

Published : 17 Jun 2024 03:08 IST

డీఈవో రాంకుమార్‌

న్యూస్‌టుడే, భూపాలపల్లి: సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రాంకుమార్‌ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. బడుల ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశాం. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల స్థితిగతులు, పది ఫలితాల సాధనకు తీసుకోనున్న చర్యలు, తదితర అంశాలపై డీఈవో రాంకుమార్‌తో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. 

జిల్లాలో చాలా పాఠశాలల్లో మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటిలోగా వసతులు కల్పించనున్నారు..?

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటయ్యాక పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించారు. మొత్తం 412 పాఠశాలల్లో కనీస అవసరాలను గుర్తించాం. వీటి కోసం రూ.3.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ప్రతి పాఠశాలలో తాగునీటి వసతి, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి పనులు దాదాపు 65 శాతం పూర్తయ్యాయి.. ఈ నెలాఖరులోగా పూర్తవుతాయి. 

కొత్త విద్యా సంవత్సరంలో సర్కారు బడుల బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు..?

బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కలిగే ప్రయోజనాలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా విద్యాభోదన ఉంటుందని అవగాహన కల్పిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఫలితాలు సాధిస్తున్నాం. విద్యాశాఖ ఇచ్చిన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి, అక్కడి స్థితిగతులు, ప్రణాళికలపై చర్చిస్తున్నాం.

జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను ఎలా అధిగమించనున్నారు?

జిల్లాలో మొత్తం 358 ఖాళీలున్నాయి. ప్రస్తుతం పదోన్నతుల్లో కొన్నింటికి పరిష్కారం దక్కవచ్చు. మిగతా వాటిని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం.

గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లాకు 16వ స్థానం వచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి మీ వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటి?

ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి చర్యలు తీసుకుంటాం. సకాలంలో సిలబస్‌ పూర్తిచేసి, ప్రత్యేక తరగతులు నిర్వహించడమే కాకుండా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మెరుగైన విద్యా భోదన అందించడానికి ప్రత్యేక దృష్టి పెడుతాం.

ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ ఎలా సాగుతోంది?

జిల్లాలో మొత్తం 20,710 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరికి 80 శాతం పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే వాటిని సంబంధిత మండల విద్యావనరుల కేంద్రాలకు తరలించాం. పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలినవి ఈ నెలాఖరులోగా అందుతాయి. ప్రతి విద్యార్థికి ఒక జత ఏకరూప దుస్తులు అందిస్తున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని