logo

సూడో నక్సలైట్ల ముఠా అరెస్ట్‌

అక్రమ ఆయుధాలు కలిగి బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. గుడిపల్లి మండలం పరిధిలోని ఘణపురం గ్రామంలో అక్రమ ఆయుధాలు కేసులో పట్టుబడిన సూడో నక్సలైట్ల ముఠాను ఆదివారం..

Published : 17 Jun 2024 03:11 IST

వివరాలు వెల్లడిస్తున్న నల్గొండ ఎస్పీ చందనా దీప్తి

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: అక్రమ ఆయుధాలు కలిగి బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. గుడిపల్లి మండలం పరిధిలోని ఘణపురం గ్రామంలో అక్రమ ఆయుధాలు కేసులో పట్టుబడిన సూడో నక్సలైట్ల ముఠాను ఆదివారం అరెస్టు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గత నెల 28న ఘణపురం గ్రామ శివారులోని పెద్దమ్మగుడిలో మూడు తుపాకులు కనిపించడంతో స్థానికుల ఫిర్యాదుతో పంచనామా చేసి కేసు నమోదు చేశామన్నారు. విచారణలో అదే గ్రామానికి చెందిన తోటకూరి శేఖర్‌ తుపాకులను దాచినట్లు అనుమానంతో అతడి కోసం గాలిస్తుండగా ఆదివారం అంగడిపేటలో పట్టుబడ్డాడు. ఇతడిపై హాలియా పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ జైల్లో రమేశ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి విడుదలైన తర్వాత త్వరగా ఆర్థికంగా ఎదగాలని రమేశ్‌కు తెలిసిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, శ్రీనివాసులుతో కలిసి సూడో నక్సలైట్లుగా మారిపోయారని చెప్పారు. తుపాకులను ధరించి ధనవంతులు, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారులకు తుపాకులు చూపించి డబ్బులు వసూళ్లకు పాల్పడేవారని చెప్పారు. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో విశాఖపట్నం సమీపంలో ఆయుధాలను కొనుగోలు చేసి వాటిని పెద్దమ్మగుడిలో భద్రపర్చినట్లు వివరించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామని.. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని  ఎస్పీ వివరించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని