logo

మందుపాతరల దండకారణ్యం..!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ అభయారణ్యం అట్టుడుకుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వరుసగా వెలుగుచూస్తున్న మందుపాతరల ఘటనలతో గండకారణ్యంగా మారింది.

Updated : 17 Jun 2024 05:51 IST

కర్రిగుట్టల అభయారణ్యం

వెంకటాపురం, న్యూస్‌టుడే: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ అభయారణ్యం అట్టుడుకుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వరుసగా వెలుగుచూస్తున్న మందుపాతరల ఘటనలతో గండకారణ్యంగా మారింది. భద్రత బలగాలే లక్ష్యంగా మావోలు ఏర్పాటు చేసిన ప్రెషర్‌ బాంబులు పేలుతుండటంతో కలవరానికి దారి తీస్తోంది. మందుపాతరల పేలుళ్లు, నిర్వీర్యం, బూబిట్రాప్‌ల గుర్తింపుతో అడవిలో అలజడి వాతావరణం మరింత వేడెక్కింది.

కర్రిగుట్ట స్థావరంగా ‘మావో’ల కదలికలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం అబూజ్‌మడ్‌ దండకారణ్యం మావోలకు ఆయువుపట్టు. అక్కడ నక్సల్స్‌ను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు వ్యూహాత్మక చర్యలకు పదునుపెట్టారు. ఇటీవల కాలంలో ‘ఆపరేషన్‌ కగార్‌’తో నిఘాను తీవ్రం చేశారు. దీంతో తెలంగాణకు చెందిన మావోయిస్టు దళాలు ఇరు రాష్ట్రాలతో నిక్షిప్తమై ఉన్న కీకారణ్య ప్రాంతమైన కర్రిగుట్ట కేంద్రంగా కదలికలు సాగిస్తున్నారు. భౌగోళికంగా ఈ ప్రాంతం ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్‌ సర్కిల్‌కు 25 కి.మీ దూరంలో ఉండటం, ఆవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఊసూరు, ఎలిమిడి పోలీస్‌ ఠాణాల పరిధి విస్తరించి ఉండటంతో నక్సల్స్‌ స్థావరంగా మార్చుకున్నారు. ఇక్కడి ఛత్తీస్‌గఢ్‌ బలగాలు చేరుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటం, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌కు వెళితే క్షణాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండటంతోనే మావోలు దృష్టి సారించినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి.

వరుస ఘటనలతో ఉలికిపాటు

  • వెంకటాపురం మండలం వీఆర్‌కేపురానికి చెందిన సుమారు 150 మంది సరిహద్దు దండకారణ్యంలోని బెడెం మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ఈ నెల 13న కాలినడకన వెళ్తుండగా, జెల్లా సమీపంలోని ఓ గుట్ట వద్ద మావోలు అమర్చిన మందుపాతర పేలడంతో డర్రా సునీత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో ఆలయానికి వెళ్లకుండానే భక్తులు వెనుదిరిగారు.
  • ఈ నెల 9న వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీప అటవీ ప్రాంతంలో నాలుగు ఐఈడీలను బీడీఎస్‌ బృందాలు నిర్వీర్యం చేశాయి. అదే ప్రాంతంలో మరో మూడు మందుపాతరలు పేలడంతో రెండు వన్యప్రాణులు, ఓ పెంపుడు కుక్క మృతి చెందిన ఆనవాళ్లను గుర్తించారు. 
  • వెంకటాపురం మండలంలోని చెలిమల సమీపంలో కర్రిగుట్టపై పోలీసులే లక్ష్యంగా మావోలు అమర్చిన మందుపాతరలను ఈనెల 5న పోలీసులు గుర్తించారు. 
  • ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతానికి వంట చెరుకు కోసం వెళ్లిన జగన్నాథ]పురానికి చెందిన ఇల్లందుల ఏసు ప్రెషర్‌బాంబు పేలి చనిపోయాడు. ఇదే మండలం అరుణాచపురం సమీప అడవిలో మే 30న ఓ పెంపుడు కుక్క మందుపాతరకు బలైంది. 

మందుపాతరలు, బూబిట్రాప్స్‌తో ప్రాణాలకు ముప్పు 

జెల్లా సమీప కర్రిగుట్టపై మావోలు ఏర్పాటు చేసిన బూబిట్రాప్‌

భద్రతా బలగాల నుంచి సాయుధులను కాపాడుకునేందుకు మావోలు పంథా మార్చారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ప్రత్యేక పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు, బూబిట్రాప్స్‌ను అమర్చుతున్నారు. వేగులు, సాంకేతికత దన్నుగా నిఘావర్గాలు మావోల వ్యూహాలకు చెక్‌ పెడుతుండగా సామాన్యులు ముప్పులో చిక్కుకోవాల్సి వస్తోంది. అటవీ ఉత్పత్తులు, వంట చెరుకు, పశువులు, వన్యప్రాణులు సంచరించే మార్గాల్లో ప్రెషర్‌బాంబులు, బూబిట్రాప్స్‌ ఏర్పాటుతో ప్రాణగండంగా మారింది. 


కదనరంగంలో పోలీసులదే పైచేయి

వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీసులు నిర్వీర్యం చేసిన మందుపాతర 

రాష్ట్ర సరిహద్దులోని కర్రిగుట్టల కీకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా మార్చేందుకు మావోలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు దెబ్బతీస్తున్నారు. 2022 జనవరిలో ఇదే ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా, ముగ్గురు కీలక మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశారు. మావోల కట్టడిలో భాగంగా వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ డిప్యూటీ దళకమాండర్, మరో ఇద్దరు దళసభ్యులు, ముగ్గురు మిలీషియా సభ్యులను నిర్భందించిన పోలీసులు వ్యూహాంలో సఫలికృతమయ్యారు. ఉనికికి ముప్పుగా మారడంతోనే మావోల విధ్వంస రచనలకు పన్నాగం పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.


అమాయకులు బలవుతున్నారు.. 
- శబరీశ్, ఎస్పీ, ములుగు

అడవుల్లో ఐఈడీలు పెట్టి అమాయకుల ప్రాణాలను మావోయిస్టులు బలితీసుకుంటున్నారు. సరిహద్దుల్లోని జరుగుతున్న నష్టాలకు బాధ్యత వహించాలి. పోలీసుల అనుమతి లేకుండా ఎవరూ అడవుల్లోకి వెళ్లొద్దు. మావోల దుశ్చర్యలపై ప్రజాసంఘాలు స్పందించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని