logo

గురుకుల స్థలం.. రెండెకరాలు మాయం!

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యాసంస్థలకు చెందిన రెండెకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది.  దశాబ్దాల కిందట అప్పటి కలెక్టర్‌ విద్యాసంస్థల కోసం బదలాయించిన భూమిలో కొంత భాగాన్ని కొందరు

Published : 17 Jun 2024 03:26 IST

విద్యాసంస్థల భూమిలో ఇతరులకు రెవెన్యూ శాఖ పట్టాలు
ఈనాడు, వరంగల్, న్యూస్‌టుడే, హసన్‌పర్తి

వివాదం నెలకొన్న స్థలం ఇదే.. సర్వే నెంబరు 127/3లోని భూమిలో విద్యాసంస్థల అవసరాల కోసం వేసిన బోరుబావి 

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యాసంస్థలకు చెందిన రెండెకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది.  దశాబ్దాల కిందట అప్పటి కలెక్టర్‌ విద్యాసంస్థల కోసం బదలాయించిన భూమిలో కొంత భాగాన్ని కొందరు రెవెన్యూ అధికారులు మరొకరికి పట్టా చేశారు. ప్రస్తుతం ఇక్కడ పలు గురుకుల విద్యాసంస్థల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భూమిని రక్షించుకోవడానికి స్థానిక అధ్యాపకులు, ఉపాధ్యాయులు పోరాటం ప్రారంభించారు.

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట ఆలయం పక్కన కేసీ కాలనీలోని గురుకుల పాఠశాలను 1983-84 విద్యాసంవత్సరంలో స్థాపించారు. 1992లో అప్పటి వరంగల్‌ కలెక్టర్‌ బీపీ ఆచార్య దీనికి సువిశాల ప్రాంగణం ఉండాలని 20 ఎకరాల స్థలాన్ని గురుకుల సొసైటీకి బదలాయించారు. సర్వేనెంబరు 127/2 లో 18.15 ఎకరాలు, సర్వే నెంబరు 127/3 లో 2.07 ఎకరాల భూమిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1994-95 విద్యా సంవత్సరంలో బాలికల కళాశాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఆర్‌జేసీ కళాశాలగా దీన్ని వ్యవహరించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏకైక బాలికల కళాశాలగా ఇది గుర్తింపు పొందింది. ఇటీవల ఇదే ప్రాంగణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పాఠశాల, కళాశాలలు సర్వే నెంబరు 127/2 లోని 18.15 ఎకరాల్లో ఉన్నాయి. వీటి చుట్టు ప్రహరీ నిర్మించారు. మరోవైపు  విద్యాసంస్థకు చెందిన 2.07 ఎకరాల భూమి అవతలి వైపు ఉండడం, మధ్యలో నుంచి రహదారి వెళ్లడంతో దీనికి ప్రహరీ నిర్మించలేదు. విద్యాసంస్థల అవసరం మేరకు ఈ స్థలంలో రెండు బోరుబావులు వేసి నీటిని తీసుకుంటున్నారు. ఒక షెడ్డు కూడా నిర్మించారు. 


ఏం జరిగిందంటే.. 

కళాశాల, పాఠశాలల యాజమాన్యానికి తెలియకుండా కొన్నేళ్ల కిందట రెవెన్యూ శాఖ 2.07 ఎకరాల భూమిని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు అప్పగించినట్టు సమాచారం. భూముల ధరలు బాగా పెరగడంతో వారు  ప్లాట్లుగా చేసి మరికొంత మందికి విక్రయించడంతో ఇప్పుడు వారు తమకు పట్టా ఉందని విద్యాసంస్థల స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారు.


సర్వే నిర్వహించి రికార్డుల ప్రకారం పరిశీలిస్తాం
- చల్లా ప్రసాద్, తహశీల్దారు, హసన్‌పర్తి

విద్యాసంస్థల స్థల వివాదంపై త్వరలో సర్వే చేపడతాం. సర్వేనెంబర్‌ 127/3 లో రికార్డుల్లో ఉన్న దాని ప్రకారం స్థలం ఎవరికి చెందుతుందనేది పరిశీలించి కళాశాల వారికి తెలియజేస్తాం.


అధ్యాపకులు, ఉపాధ్యాయుల పోరాటం

హసన్‌పర్తి మండలం కేసీ కాలనీలో ఉన్న గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో.. 

తమ విద్యాసంస్థలకు చెందిన భూమి ఎట్టిపరిస్థితుల్లో అన్యాక్రాంతం కావొద్దని అక్కడి అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల మార్గదర్శనంలో పోరాటం సాగిస్తున్నారు. గతంలో కలెక్టర్‌ తమకు సొసైటీకి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌తో హనుమకొండ కలెక్టర్‌ తోపాటు ఆర్డీవో, తహసీల్దార్లను కలుస్తూ విద్యాసంస్థ స్థలాన్ని కాపాడాలని వినతులు సమర్పిస్తున్నారు. కలెక్టర్‌ ఈ అంశంపై దృష్టిసారించి సర్వే చేయిస్తే విద్యాసంస్థల స్థలం అన్యాక్రాంతానికి గురికాకుండా ఉంటుంది.


అన్యాక్రాంతం అవుతోంది 
- కె.అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్, తెలంగాణ గురకుల పాఠశాల, కేసీ కాలనీ, హసన్‌పర్తి

మాకు 1992లో అప్పటి కలెక్టర్‌ 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. గతంలో నిధులు లేక ప్రహరీ నిర్మించలేకపోయాం. ఇప్పుడు సర్వేనెంబర్‌ 127/3 లో 2.07 ఎకరాల్లో తమకు పట్టాలున్నాయని నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాఠశాల, కళాశాల అవసరాలకు కొన్ని దశాబ్దాల క్రితమే ఇక్కడ రెండు బోరుబావులు వేశాం. వాటి నుంచే నీరు తీసుకుంటున్నాం. రెవెన్యూ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వద్దకు వెళుతూ మా స్థలాన్ని కాపాడి అప్పగించాలని కోరుతున్నాం.


డిగ్రీ కళాశాల ఎక్కడ నిర్మించాలి? 
- ఇందుమతి, కళాశాల ప్రిన్సిపల్‌

ఇది  రాష్ట్రంలోనే ఏకైక బాలికల గురుకుల జూనియర్‌ ఎక్స్‌లెన్సీ కళాశాల. విద్యార్థినులకు జేఈఈ ర్యాంకులు కూడా వచ్చాయి. ప్రభుత్వం మొదట మాకు స్థలం ఇచ్చి అదే స్థలాన్ని వేరొకరికి ఇవ్వడం అన్యాయం. ప్రభుత్వం డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ రెండెకరాల్లో కొత్త కళాశాల కట్టాలనుకున్నాం. రెవెన్యూ శాఖ సర్వే చేసి మాకు అప్పగించాలి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని