logo

సొంతింటి కల నెరవేరేనా..?

ఇల్లులేని అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండు పడక గదుల గృహాల నిర్మాణాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

Published : 17 Jun 2024 03:29 IST

మహబూబాబాద్, న్యూస్‌టుడే: ఇల్లులేని అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండు పడక గదుల గృహాల నిర్మాణాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండు పడకగదుల ఊసెత్తకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అడ్డంకిగా మారనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో గత ప్రభుత్వం 2016 నుంచి వివిధ దశల్లో 5,567 ఇళ్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి రూ. 288.88 కోట్లు మంజూరు చేసి 110.68 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా పనులు పూర్తి కాలేదు. నిర్మించినవాటికి బిల్లులు రాలేదని కొందరు గుత్తేదారులు మిగిలిన పనులు చేయకుండా వదిలివేశారు. పలు ప్రాంతాల్లో ఆ ఇళ్లు బేస్‌మెంట్, పైకప్పు దశకు చేరుకున్నాయి. కొన్ని ఇళ్లకు ఫిల్లర్లు వేసి వదిలేశారు.


ఇంజినీర్లతో పనుల పర్యవేక్షణ
- ఎం.డేవిడ్, జిల్లా అదనపు కలెక్టర్‌ 

జిల్లాలో గతంలో మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ గ్రామాల్లో మంజూరైన ఇళ్లు పలు దశల్లో నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖలకు చెందిన ఇంజినీరింగ్‌ అధికారులు ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటి పురోగతి వివరాలను అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు.


ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాం
- దుడ్డెల రామ్మూర్తి, మల్యాల

మా గ్రామంలోని ఎస్సీలకు మొదటి విడతలో ఒకే చోట రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం చేస్తామని అప్పటి ప్రజాప్రతినిధులు చెప్పారు. స్థలం అందుబాటులో లేదని రెండో విడతలో ఎవరి స్థలంలో వారు ఇళ్లు నిర్మాణం చేసుకునేందుకు 30 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేశారు. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రెండు పడకల ఇళ్లు మంజూరయ్యాయని మాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారో లేదో అంటూ ఆందోళన చెందుతున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని