logo

పడకేసిన ‘పలె’్ల పాలన..!

గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల విడుదల, కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడం, పంచాయతీల ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తూ పల్లె పాలన పడకేసింది.

Published : 17 Jun 2024 03:32 IST

నర్సింహులపేట (మరిపెడ), న్యూస్‌టుడే: గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల విడుదల, కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడం, పంచాయతీల ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తూ పల్లె పాలన పడకేసింది. కనీసం వీధి దీపాలు, బోరు ల మరమ్మతు, ట్రాక్టర్‌కు డీజిల్‌ కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది. ఉదయం ఏడు గంటలకే పారిశుద్ధ్య ట్రాక్టర్‌ డ్రైవరుతో పాటు సెల్ఫీ దిగి యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు 8 గంటలలోపే డీఎస్‌ఆర్‌ హాజరు ఇచ్చి పది గంటల లోపు డీఎస్‌ఆర్‌ పూర్తి చేయాలనే నిబంధనలతో కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నారు.

జిల్లాలో 461 పంచాయతీలుండగా ప్రభుత్వం  గ్రామానికో కార్యదర్శిని నియమించింది. 82 మంది సీనియర్, 250 మంది గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులు, 9 మంది పొరుగుసేవల సిబ్బంది, మిగతావారు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులున్నారు. ఫిబ్రవరి 1నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. ప్రత్యేకాధికారులకు నిధులు, విధులపై స్పష్టత లేకపోవడంతో కార్యదర్శులకే పనిభారమవుతోంది. పెద్ద గ్రామాల పరిస్థితి కొంత నయంగా ఉన్నా వెయ్యిలోపు జనాభా ఉన్న పంచాయతీల పరిస్థితి ఇబ్బందిగా మారింది. 

నిధులు విడుదల కాక కష్టాలు 

పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు ముఖ్యమైనవి. 2022 ఆగస్టు నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు రావడం లేదు. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుంది. ప్రత్యేక పాలన ప్రారంభమైనప్పటి నుంచి అవి కూడా రావడం లేదు. పంచాయతీ నిర్వహణకు నాలుగు నెలల కాలంలో కార్యదర్శులు అప్పులు చేసినట్లు సమాచారం

గ్రామాల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీల్లో పూడికతీత, విద్యుత్తు దీపాల ఏర్పాటు, తాగునీటి పైపులైను   లీకేజీలు ఇలా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


పనిభారం తగ్గించాలి 
- మద్ది వినోద్‌కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండలాధ్యక్షుడు, నర్సింహులపేట 

నిబంధనలు, పనిభారంతో ఇబ్బంది పడుతున్నాం. ట్రాక్టర్లు, ఇతర రవాణా వాహనాల నిర్వహణ ఖర్చుకు సంబంధించిన బిల్లులు చెల్లించే బాధ్యతను కార్యదర్శులపై మోపడం వల్ల అదనపు భారం పడుతోంది.


అందుబాటులో ఉన్న నిధులతో పనులు చేయించాలి
- హరిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి

అందుబాటులో ఉన్న నిధులతో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పనులు చేయించాలి. ముందుగా గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలి. ప్రభుత్వం మార్చి వరకు నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశానుసారం విధులు నిర్వర్తించాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని