logo

హత్యాయత్నానికి దారి తీసిన ప్రేమ వ్యవహారం

యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. యువకుడు, ఆయన తల్లిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేసి గాయపర్చిన సంఘటన గీసుకొండ మండలం కీర్తినగర్‌కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Published : 17 Jun 2024 03:37 IST

తల్లీ కొడుకులపై యువతి బంధువుల దాడి 

అంబులెన్సులో తీవ్ర గాయాలతో అద్వాన్‌ అలీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమీన 

కీర్తినగర్‌కాలనీ(గీసుకొండ), న్యూస్‌టుడే: యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. యువకుడు, ఆయన తల్లిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేసి గాయపర్చిన సంఘటన గీసుకొండ మండలం కీర్తినగర్‌కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. యువకుడి బంధువులు నయీమ్, అలీమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కీర్తినగర్‌కాలనీకి చెందిన అద్వాన్‌ అలీ (24), అదే కాలనీకి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి తండ్రి యూసెఫ్‌ షరీఫ్‌ నాలుగేళ్ల క్రితం కీర్తినగర్‌కాలనీ నుంచి హనుమకొండకు వచ్చి నివాసముంటున్నారు. అద్వాన్‌అలీ తండ్రి ఏజాత్‌ అలీ మూడేళ్ల క్రితం మృతి చెందగా తల్లి సమీన టైలరింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎంబీఏ చదువుతున్న అద్వాన్‌ అలీ ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై కీర్తినగర్‌కాలనీలోని తన ఇంటికి వచ్చాడు. అదే సమయంలో యువతి తండ్రి యూసెఫ్‌ షరీఫ్, ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి మారణాయుధాలతో ఆటోలో అక్కడికి వచ్చారు. కత్తితో అద్వాన్‌అలీ కడుపులో పొడిచారు. ఆయన కేకలు వేస్తూ ఇంట్లోకి పరుగు తీస్తుండగా సమీన బయటకు వచ్చారు. ఆమె చేతిపై కూడా కత్తులు, గొడ్డలితో నరికారు. తీవ్ర గాయాలైన తల్లీ కొడుకులను స్థానికులు 108 వాహనంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అద్వాన్‌అలీ మేనమామ నయీమ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


గోదావరిలో యువకుడి గల్లంతు

అఖిల్‌కుమార్‌ (పాతచిత్రం)

కాళేశ్వరం, న్యూస్‌టుడే : కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చి ఓ యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్‌లోని లేబర్‌కాలనీకి చెందిన గరికపాటి ప్రవీణ్, రజనీ దంపతుల కుమారుడు అఖిల్‌కుమార్‌(19)తో పాటు మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్నారు. అందరూ కలిసి గోదావరిలో కొద్దిసేపు స్నానాలు ఆచరించారు. ప్రవాహంలో సరదాగా గడిపి.. ఒక్కొక్కరుగా దరి చేరుకున్నారు. చివరిగా స్నానం చేస్తున్న అఖిల్‌కుమార్‌ లోతైన ప్రవాహంలో చిక్కుకొని మునిగాడు. తన కుమారుడు అప్పటి దాకా మాతోనే ఉన్నాడని, క్షణాల్లో ప్రవాహంలో మాయమయ్యాడని తల్లి రజినీ రోదించారు. బంధువులు వెంటనే 100కు డయల్‌ చేయడంతో కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవాహంలో కొద్దిసేపు వెతికారు. జాలర్లను రప్పించినా గల్లంతైన యువకుడి ఆచూకీ చిక్కలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సోమవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపడుతామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని