logo

టెండర్లు తక్కువ.. నామినేషన్‌ పనులెక్కువ

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తమకు నచ్చిన గుత్తేదారులకు పనులు అప్పజెప్పేందుకు.. రూ.50 వేల చొప్పున విభజించి నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారు.

Published : 17 Jun 2024 03:42 IST

కార్పొరేషన్, న్యూస్‌టుడే

కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌కు సంబంధించిన పనులు విభజించి కేటాయించారు

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తమకు నచ్చిన గుత్తేదారులకు పనులు అప్పజెప్పేందుకు.. రూ.50 వేల చొప్పున విభజించి నామినేషన్‌ పద్ధతిలో కేటాయించారు. అయిన వాళ్లకు అభివృద్ధి పనులు ఇప్పిస్తూ.. కమీషన్లు(పర్సంటేజీలు) దండిగా అందుకుంటున్నారు. పెద్ద పనులైతే వాటాదారులుగా, చిన్న పనులైతే కమీషన్లు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన ఇంజినీర్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.


అడిగేవారు లేక..

  • ‘కుడా’లో టెండర్లు లేకుండానే రూ.కోట్ల అభివృద్ధి పనులు నామినేషన్లపై కేటాయించారు. ఎవరికి అనుమానం రాకుండా పనులు విభజించి.. పంచేశారు. నిబంధనల ప్రకారం రూ.50 వేలు దాటిన ప్రతి పనికి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఏడాది కాలంగా పరిశీలిస్తే ‘కుడా’లో టెండర్లు తక్కువ, నామినేషన్‌ పనులు ఎక్కువగా కేటాయించినట్లు స్పష్టమవుతోంది. అడిగేందుకు ‘కుడా’ పాలక మండలి లేదు. వైస్‌ ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు ఇటీవలే కమిషనర్‌ అశ్విని తానాజీకి అప్పగించారు. దీంతో ఇద్దరు, ముగ్గురు అధికారులు అంతా తామే అన్నట్లుగా వ్యవహరించారు.
  • కాంట్రాక్టు లైసెన్సు లేని గుత్తేదారులకు సైతం బినామీ పేర్లతో పనులు అప్పగిం చేస్తున్నారు.

గ్రీనరీ, పిల్లల ఆట వస్తువుల టెండర్‌ సైతం అయినవారికే కట్టబెట్టారు 


ఇవిగో ఉదాహరణలు..

  • రాంపూర్‌ నుంచి ఆరెపల్లి శివారు వరకు ఔటర్‌ రింగురోడ్డు సెంట్రల్‌ డివైడర్ల గ్రీనరీ, ల్యాండ్‌ స్కేపింగ్‌ పర్యవేక్షణ ఓ బడా గుత్తేదారుకు నామినేషన్‌పై అప్పగించేశారు. దీని విలువ రూ.35- రూ.40 లక్షల వరకు ఉంటుందని తెలిసింది.
  • వరంగల్‌ కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌(కేఎంజీ) పార్కు ఆధునికీకరణ పనుల్లో చాలా వరకు నామినేషన్‌పై కేటాయించారు. కొన్ని పనులు టెండర్లు పిలిచారు. ఓ బడా గుత్తేదారుకు బినామీ పేర్లతో పనులు ఇచ్చారని తెలిసింది.
  • ఖిలావరంగల్‌ కోట కాకతీయ పిల్లల పార్కు, గుండు చెరువు పరిసరాల్లో వివిధ అభివృద్ధి పనులు టెండర్లు పిలవకుండా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల పనులు నామినేషన్‌పై కేటాయించారు. ‘కుడా’కు చెందిన జూనియర్‌ ఇంజినీర్‌కు పెద్దఎత్తున కమీషన్లు ముడుతున్నాయని తెలిసింది.
  • ఒప్పంద పద్ధతిపై పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగి స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ) పేరుతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిసింది.

అత్యవసర పనులు ఇచ్చాం
- భీంరావు, ఈఈ, ‘కుడా’

లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో టెండర్లు పిలవలేదు. కొన్ని అత్యవసర పనులు నామినేషన్‌పై కేటాయించాం. గుత్తేదారుకు బిల్లు చెల్లించేటప్పుడు 5-8 శాతం తగ్గిస్తాం. ఇక నుంచి టెండర్లు పిలుస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని