logo

మరిన్ని పోషకాలతో మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడమే కాక, బాలబాలికల శారీరక ఎదుగుదల కోసం పోషకాహారం అందించే లక్ష్యంతో సర్కారు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది.

Published : 17 Jun 2024 03:46 IST

హైదరాబాద్‌లో వంట ఏజెన్సీ మహిళలు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

నర్సంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడమే కాక, బాలబాలికల శారీరక ఎదుగుదల కోసం పోషకాహారం అందించే లక్ష్యంతో సర్కారు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. వంటల తయారీలో మహిళలకు సరైన అవగాహన లేకపోవడం, చిన్న తప్పిదాల వల్ల విద్యార్థులకు పోషకాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు వంట కార్మికులకు ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వీరు మండలాల్లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కార్మికులకు ఒక రోజు శిక్షణ ఇస్తారు.

వంటల తయారీపై శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు.. పోషకాహార లోపంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ అధికారులు, పాకశాస్త్ర నిపుణులతో అవగాహన కల్పించారు. పోషకాలతో కూడిన ఆహార పదార్థాల తయారీపై శిక్షణ ఇచ్చారు. వంటల తయారీని ఎలా పర్యవేక్షించాలో ప్రధానోపాధ్యాయులకు సూచనలిచ్చారు. 

పరిశుభ్రత.. వడ్డన

వంట వార్పు.. వడ్డనలో పాటించాల్సిన పరిశుభ్రత, నాణ్యమైన తాజా కూరగాయల వినియోగంపై వంట ఏజెన్సీ మహిళలు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణకు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం కమ్మపెల్లి, వరంగల్‌లోని మట్టెవాడ జడ్పీఎస్‌ఎస్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.. మట్టెవాడ, నర్సంపేట జడ్పీఎస్‌ఎస్‌ ఆదర్శ ఉన్నతపాఠశాలలో వంట చేసే మహిళా కార్మికులు హాజరయ్యారు. బియ్యాన్ని బాగా పిసికి పలుమార్లు కడగడం, కూరగాయలను కోసిన తర్వాత  నీటిలో కడగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు, ఖనిజాలను నష్టపోతున్నామని, అలా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వంట చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, వంట చేసే మహిళలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలు నిత్యం స్నానం చేసి రావాలని,  తలకు టోపీలు, ఆఫ్రాన్‌లు ధరించి వంట చేయాలని, చేతివేళ్ల గోళ్లను పెంచొద్దని, వంటలో ఎంత మోతాదులో నూనె వాడాలో, అన్ని కూరలకు వేర్వేరు వంటపాత్రలు, గరిటెలు వాడాలని సూచించారు.


కొత్త విషయాలు తెలుసుకున్నాం 
- ఇమ్మడి పద్మ, వంట ఏజెన్సీ కార్మికురాలు, నర్సంపేట  

హైదరాబాద్‌లో శిక్షణ శిబిరంలో చెప్పిన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. శిక్షణలో నేర్చుకున్న అంశాల ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తాం.


విద్యార్థులకు పోషకాలు అందుతాయి..
- భిక్షపతి, ప్రధానోపాధ్యాయుడు, కమ్మపెల్లి ఉన్నత పాఠశాల, నర్సంపేట మండలం  

శిక్షణలో నిపుణులు చెప్పిన విషయాలను వంటల తయారీలో పాటిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి పాఠశాలలో తప్పకుండా అమలయ్యేలా చూస్తాను. దీని వల్ల విద్యార్థులకు పోషకాలు తప్పకుండా అందుతాయి.


బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత శిక్షణ ఇస్తాం 
- రత్నమాల, ఎంఈవో, నర్సంపేట

మధ్యాహ్న భోజన పథకంపై జిల్లాకు ఇద్దరు చొప్పున ప్రధానోపాధ్యాయులు, వంట కార్మికులకు హైదరాబాద్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో మిగిలిన వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత  ఇస్తారనుకుంటున్నాం. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని