logo

గడువు పొడిగించినా.. పనులు పూర్తయ్యేనా.?

మహబూబాబాద్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమై రెండేళ్లుపూర్తయి మూడో విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలకు సమయం సమీపిస్తున్నా ఈ భవన నిర్మాణాలు మాత్రం ముందుకు కదలడం లేదు.

Published : 18 Jun 2024 03:32 IST

మహబూబాబాద్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనం

మహబూబాబాద్, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమై రెండేళ్లుపూర్తయి మూడో విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలకు సమయం సమీపిస్తున్నా ఈ భవన నిర్మాణాలు మాత్రం ముందుకు కదలడం లేదు. ముందుగా నిర్దేశించిన గడువును మరొకసారి పొడిగించినా పనులు ఆ సమయంలోగా కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వం ఆఘమేఘాల మీద పనులు మొదలు పెట్టినా వివిధ కారణాలతో ప్రధాన భవన నిర్మాణాలు ప్రారంభించలేదు. మొదటి దశలో సుమారు రూ. 47 కోట్లతో నర్సింగ్‌ కళాశాల కోసం నిర్మించిన భవనంలోనే 2022 నవంబర్‌లో మొదటి సంవత్సరం 150 మంది విద్యార్థులతో వైద్య విద్యను ప్రారంభించారు. ఆ భవనంలోనే రెండేళ్లుగా బోధన కొనసాగిస్తున్నారు. వసతి గృహాల సౌకర్యం లేక పట్టణంలోని ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకున్నారు. రోజూ బస్సుల్లో విద్యార్థులు కళాశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో విద్యార్థినీ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందితే ఈ సమస్య మరింత పెరగనుంది.

నత్తనడక కంటే నెమ్మదిగా..

ప్రస్తుతం వైద్య విద్యాబోధన సాగిస్తున్న నర్సింగ్‌ కళాశాలకు ఎదురుగానే వైద్యకళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సుమారు రూ. 163 కోట్లతో చేపట్టనున్న వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల నిర్మాణాలకు  2021లో నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. రాళ్లు, గుట్టలు, చెట్ల పొదలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంది. తర్వాత పనులు ప్రారంభించినా నత్తకంటే నెమ్మదిగా నడుస్తున్నాయి.

  • 2022 అక్టోబర్‌లో ఈ భవన నిర్మాణాలు ప్రారంభించి ఒప్పంద ప్రకారం 2023 నవంబర్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ఆర్థిక చెల్లింపుల కారణాలతో గడువులోగా పనులు పూర్తి కాలేదు. దీంతో అధికారులు 2024 సెప్టెంబర్‌ వరకు మరోసారి గడువు పొడిగించారు. ఇప్పటి వరకు యాభై శాతం కూడా పూర్తి కాలేదు. 
  • ఆరు బ్లాక్‌ల్లో కళాశాల పనులు ప్రారంభించారు. ఒక్క బ్లాక్‌లో జి ప్లస్‌-4 అంతస్తులతో కళాశాల భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవన సముదాయంలో స్లాబ్‌ మాత్రమే వేశారు. గోడల నిర్మాణం ప్రారంభించలేదు. 
  • జి ప్లస్‌-6 అంతస్తులో బాలికల వసతి భవనం, జి ప్లస్‌-4లో బాలుర వసతి భవనం, పీజీ విద్యార్థినులకు సంబంధించి జి ప్లస్‌- 5, పీజీ బాలుర విద్యార్థులకు జి ప్లస్‌-3 అంతస్థులతో భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్లాస్టరింగ్‌ చేశారు. అంతర్గత పనులు ఎలక్ట్రికల్‌ పనులు చేయాల్సి ఉంది. 
  • వంటగది, భోజనశాల నిర్మాణ పనులు కూడా పూర్తి కాలేదు. ప్రహరీ, కళాశాల ఆవరణలో ఫ్లోరింగ్‌ పనులు నిర్వహించాల్సి ఉంది. 
  • సుమారు రూ. 116 కోట్ల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు సుమారు రూ. 55 కోట్ల నిధులతో పనులు చేబట్టారు. వీటిలో సుమారు రూ. 20 కోట్లు మాత్రమే గుత్తేదారులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తుండడంతో పనులు చేయలేక పోతున్నామని సంబంధిత నిర్మాణ బాధ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వేగంగా చేయిస్తాం

- తానేశ్వర్, ఈఈ, రహదారులు, భవనాల శాఖ

వైద్య కళాశాల పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. చేసిన పనుల వరకు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి నివేదికలను పంపించాం. నిధులు విడుదల చేస్తే వెంటనే చెల్లిస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని