logo

ఆక్రమించి.. చదును చేసి!

ఇక్కడ కనిపిస్తున్న భూమి గణపురం మండలం ధర్మరావుపేటలోని ఊరచెరువు శిఖం భూమి. ఇందులో సుమారు 30 ఎకరాలను కొంత మంది చదును చేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు.

Updated : 18 Jun 2024 06:01 IST

ఇక్కడ కనిపిస్తున్న భూమి గణపురం మండలం ధర్మరావుపేటలోని ఊరచెరువు శిఖం భూమి. ఇందులో సుమారు 30 ఎకరాలను కొంత మంది చదును చేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు శిఖం భూమిని పరిశీలించి అందులో ఎలాంటి పంట వేయకుండా సదరు వ్యక్తులను హెచ్చరించారు.

ఇది చెల్పూర్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 134లోని ప్రభుత్వ భూమి. దీనిని గతంలో రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీకి అప్పగించారు. అందులో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రాంగణ సమీపంలోనే 10 గుంటలకు పైగా స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను అడిగితే గతంలోనే భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించామని వారి పరిధిలోని అంశాన్ని వారే పరిష్కరించుకోవాలని చెప్పారు. గ్రామంలో ప్రభుత్వ కార్యాలయం లేదా కమ్యూనిటీ హాల్‌ ఏర్పాటుకు స్థలం అవసరం ఉంటుందని అధికారులు స్పందించి ఫెన్సింగ్‌ తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, గణపురం(భూపాలపల్లి రూరల్‌) : ప్రభుత్వ భూములను చదును చేసి ఆక్రమించడం అందులో హద్దులు పాతడం గణపురం మండలంలో పరిపాటిగా మారింది. చెరువు శిఖం, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న గణపురం మండలంలో కేటీపీపీ జెన్‌కో, సింగరేణి బొగ్గు గనులు ఉండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఖాళీ స్థలాలు కనిపిస్తే పాగా వేసేందుకు ప్రణాళికలు చేస్తూ ప్రభుత్వ భూమిని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తెలిసినవి కొన్నే... తెలియనివి..

కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు కొన్ని మాత్రమే అధికారుల దృష్టికి వస్తున్నాయని, వారి దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకొంటున్నారని ప్రజలు చెబుతున్నారు. బయటకు తెలియని భూములు చాలా కబ్జా చేస్తున్నారని వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారని తెలిపారు. ఆక్రమణలు కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూములు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. 

హద్దులు ఏర్పాటు చేయాలి..

మండలంలోని స్థలాలకు మంచి డిమాండ్‌ ఉండటంతో కబ్జా చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేసి బోర్డులను పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలా చేస్తే భూముల కబ్జాను అధికారులు అడ్డుకున్నవారవుతారు. 

కబ్జా చేస్తే చర్యలు తప్పవు 

- మురళీధర్‌రావు, తహసీల్దార్, గణపురం

మండలంలోని ప్రభుత్వ భూములు ఎక్కడా కబ్జాలో లేవు. కొన్ని రోజుల క్రితం రెండు మూడు చోట్ల ఆక్రమణలు జరిగితే వెంటనే చర్యలు తీసుకొని హద్దులను తొలగించాం. ప్రభుత్వ, చెరువు శిఖం భూములను కబ్జా చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు