logo

పర్యావరణ పరిరక్షణకు ఎకోక్లబ్‌

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి 24 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది.

Published : 18 Jun 2024 03:43 IST

శనివారం జరిగిన కార్యక్రమంలో దేవరుప్పుల ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటుతూ..

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి 24 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ఎకోక్లబ్‌’లను బలోపేతం చేస్తూ వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఆదేశించింది. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పాఠశాల స్థాయి నుంచే బీజం పడాలని వారం పాటు రోజుకో రకమైన జీవన విధానాన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము సహా అధికారులు తెలిపిన మేరకు..

మొదటి రోజు (జూన్‌ 15న): గత శనివారం.. ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవర్చుకోవడం.. విద్యార్థులను సమూహాలుగా ఏర్పాటు చేసి, సమీప వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో మాట్లాడి సేద్యం, పాడి పరిశ్రమ, గొర్రెల, మేకల పెంపకం వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

రెండవ (18న): మంగళవారం నుంచి.. సుస్థిర ఆహారపు అలవాట్ల గురించి వివరించి, పాఠశాలల్లో పెరటి తోటల(కిచెన్‌ గార్డెన్స్‌) పెంపకం, పండిన కూరగాయలను మధ్యాహ్న భోజనం వంటకు వినియోగించడం, రసాయన మందులు ఎరువుల వాడకాన్ని నిలువరిస్తూ.. పాఠశాలలోని తడి, పొడి చెత్త, ఆవరణలో రాలిన ఆకులతో కంపోస్టు ఎరువుల తయారీని వివరిస్తారు.

మూడవ, (19న): రోజు వారీ జీవితంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకం పెరగడంతో, వస్తువులు నిరుపయోగంగా మారినప్పుడు, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, ఒక దగ్గర నిక్షిప్తం చేసి మళ్లీ పునరుత్పత్తికి మళ్లించడం చేయాలి. విద్యార్థి తన తరగతి గది సహా ఇంట్లో కూడా ఈ-వేస్ట్‌ను కనీసానికి తగ్గించాలని సూచిస్తారు.

నాలుగవ (20న): వృథాను నిలువరించాలి. తరగతి గదిలో అనవసర చెత్తను చిందర వందరగా వేస్తుంటారు. ఇందుకోసం ప్రతి గదిలో రెండు చెత్త బుట్టలు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను విడిగా వేయాలి. పాఠశాలలో కూడా రెండేసి బుట్టల విధానం పాటించాలి. మధ్యాహ్న భోజన మిగులు పదార్థాలను వేర్వేరుగా వేయడం అలవాటు చేయాలి.

అయిదవ (21న): ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం పాఠశాలలో తరగతులు నిర్వహించేంత వరకు కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి. పాఠశాలలో లేదా ఇంట్లో ఫ్యాన్లు, బల్బులు అనవరసంగా వేయకూడదని సూచిస్తారు. చిన్నా చితక పనులకు వాహనాలు వినియోగించకుండా సైకిల్‌ లేదా కాలినడకన వెళ్లడం అలవర్చుకుంటే ఇంధనాన్ని పొదుపు చేసినట్లే అని వివరిస్తారు.

ఆరో (22న): జలసిరి పరిరక్షించుకోవాలి. ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలకు తలొగ్గి ప్రతి పాఠశాలల్లో  ఇళ్లలో మంచినీటి వసతి కల్పిస్తుంది. అవసరాల మేరకే వాడుకోవాలని, ఆనక కుళాయిలను ఆన్, ఆఫ్‌ చేయాలని వివరిస్తారు. వృథా నీటిని పెరటి తోటలకు, ఇంకుడు గుంతలోకి వెళ్లేలా చూడాలని అవగాహన కల్పిస్తారు.

ఏడవ (24): సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలువరించాలి. ప్లాస్టిక్‌ ఎంత ప్రాణాంతకమైందో వివరించి సమాజంలో వాడకాన్ని తగ్గించేలా తెలుపుతారు. కూరగాయల దుకాణాలకు మార్కెట్‌కు వెళ్లినా, నార సంచులను తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని