logo

విద్యుత్తు సమస్యలపై.. ప్రజా‘వాణి’ విన్నారు!

క్షేత్రస్థాయిలో నివాస, వ్యవసాయ, పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్తుపరంగా ఎదురవుతున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ.. వినియోగదారులకు చేరువయ్యేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్‌) ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన విద్యుత్తు ప్రజావాణికి తొలివారమే ఆశించిన స్పందన లభించింది.

Published : 18 Jun 2024 03:46 IST

జనగామ ఎస్‌ఈ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్‌ఏవో జయరాజు

ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, బాలసముద్రం: క్షేత్రస్థాయిలో నివాస, వ్యవసాయ, పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్తుపరంగా ఎదురవుతున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ.. వినియోగదారులకు చేరువయ్యేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్‌) ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన విద్యుత్తు ప్రజావాణికి తొలివారమే ఆశించిన స్పందన లభించింది. సోమవారం ఉమ్మడి జిల్లాలోని సర్కిల్, డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్‌ కార్యాలయాల్లో అర్జీలను స్వీకరించారు. వచ్చిన వాటిని టీజీఎన్పీడీసీఎల్‌ పోర్టల్, కన్జూమర్‌ రిసెప్షన్‌ డెస్క్‌కు అనుసంధానించారు. అర్జీదారుడి దరఖాస్తును స్వీకరించినట్లు రసీదును ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటితో రోజుల తరబడి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సంస్థ సీఎండీ వరుణ్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విద్యుత్తు ప్రజావాణి ఎంతో ఉపకారిగా ఉందని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐదు సర్కిల్స్‌.. 120 సెక్షన్లు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి(ములుగు కలుపుకుని)లో సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 11 డివిజన్లు, 35 సబ్‌ డివిజన్లు, 120 సెక్షన్లు ఉన్నాయి. సెక్షను, సబ్‌డివిజన్, డివిజన్, సర్కిల్‌ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏఈ, ఏడీ, డీఈ స్థాయి అధికారులు, జిల్లాస్థాయి(సర్కిల్‌) కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్‌ఈలు అర్జీలను తీసుకున్నారు.

169 అర్జీలు

ఉమ్మడి జిల్లాలోని ఐదు సర్కిల్‌ కార్యాలయాలు, డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్‌ పరిధిలో మొత్తం 169 దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్‌ జిల్లా నుంచి అధికంగా.. జనగామ జిల్లా నుంచి తక్కువగా వచ్చాయి. భూపాలపల్లి సర్కిల్‌ పరిధిలో వచ్చిన వాటిలో భూపాలపల్లి డివిజన్‌ పరిధిలో ఒకటి మాత్రమే వచ్చింది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాటిలో జీరో బిల్లుకు సంబంధించినవీ ఉన్నాయి.. వాటి పరిష్కారం సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుకు ముడిపడి ఉండడంతో అవి తమ పరిధి కాదంటూ పక్కన పెట్టారు. స్వీకరించిన అర్జీలను సాధ్యాసాధ్యాలను బట్టి 15 రోజుల్లో పరిష్కారం చూపుతామని ఆ శాఖ అధికారులు తెలిపారు.

10 రకాల సమస్యలపై 

ఐదు సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో విద్యుత్తు ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో దాదాపు 10 నుంచి 15 రకాల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా బిల్లుల్లో తప్పుడు రీడింగ్, లో వోల్టేజ్, లూజ్‌ లైన్లు, తెగిపడిన తీగలను సరిచేయడం, నూతన సర్వీస్, లైన్ల ఏర్పాటు, వినియోగదారుల వివరాల సవరణలు, విద్యుత్తు నియంత్రికల్లోని రాగి తీగ చోరీ, ఇళ్లపై నుంచి వెళ్తున్న ప్రమాదకర లైన్లను మార్చడం, ఓవర్‌లోడ్‌ సమస్య, పాడైన, ఇనుప స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి సమస్యలు వచ్చినట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. 

తక్షణమే స్పందించారు..

మహబూబాబాద్‌ పట్టణంలోని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజావాణికి మండలంలోని వేంనూరుకు చెందిన నలమాస రాఘవులు మే నెలకు సంబంధించి 171 యూనిట్లు వాడకం జరిగితే 370 యూనిట్లు వాడినట్లు రీడింగ్‌ తీసి తప్పుడు బిల్లు ఇచ్చారంటూ ఈఆర్వో ఎం.రమేశ్‌కు అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అధికారి, ఏడీఈ ప్రశాంత్‌తో కలిసి అర్జీదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించారు. రీడింగ్‌ చూసి.. తప్పుడు బిల్లు ఇచ్చారని, సరిచేసి ఇస్తామంటూ చెప్పారు. ఈ విషయమై రాఘవులు మాట్లాడుతూ.. మూడు రోజుల కిందట తప్పుడు బిల్లు వచ్చిందని కార్యాలయానికి వెళ్తే పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగానే.. అధికారులు వచ్చి పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ విధానం బాగుందని పేర్కొన్నారు.

మీటరు మార్చాలని..

మహబూబాబాద్‌ డీఈ విజయ్‌కి దరఖాస్తు అందిస్తున్న ఈ అర్జీదారుడు పట్టణానికి చెందిన దొంతు నరేష్‌.. మజీద్‌ కాంప్లెక్స్‌లో ఉన్న షాపులో విద్యుత్తు మీటర్‌ను ఎన్జీజీవోస్‌ కాలనీలో ఉన్న తన ఇంటి వద్దకు మార్చాలంటూ విన్నవించుకున్నారు. స్పందించిన డీఈ వెంటనే ఏఈతో మాట్లాడి పరిష్కరించాలంటూ సూచించారు. 

సర్కిల్‌ వారీగా వచ్చిన అర్జీలు  

హనుమకొండ 41
వరంగల్‌ 26
మహబూబాబాద్‌ 61
జనగామ 17
భూపాలపల్లి,ములుగు 24 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని