logo

బడి బస్సులపై నిఘా!

జిల్లా ఆర్టీఏ అధికారులు, సిబ్బంది మొత్తం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తీసుకువెళ్లే ప్రైవేట్‌ బస్సులపై నిఘా పెట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రైవేట్‌ బస్సులను ఆర్టీఏ అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేయడం ప్రారంభించారు.

Published : 18 Jun 2024 03:49 IST

బస్సులను తనిఖీ చేస్తున్న ఎంవీఐలు కిశోర్‌కుమార్, రమేశ్‌ రాథోడ్, సిబ్బంది  

న్యూస్‌టుడే, హసన్‌పర్తి : జిల్లా ఆర్టీఏ అధికారులు, సిబ్బంది మొత్తం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తీసుకువెళ్లే ప్రైవేట్‌ బస్సులపై నిఘా పెట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రైవేట్‌ బస్సులను ఆర్టీఏ అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేయడం ప్రారంభించారు. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే బస్సులు అన్ని విధాలా బాగుండాలి.. ప్రధానంగా అవి రోడ్లపైకి రావడానికి యోగ్యత ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అవి లేకుండా నడుపుతున్న వాటిని విధిగా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో పెట్టాల్సిందేనని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో  హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయ అధికారులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టి మరమ్మతులో ఉన్న వాటిని రోడ్లపైకి తీసుకొస్తే వాటిని కార్యాలయానికి తరలించే పనిలో ఉన్నారు. జిల్లాలో 1047 పాఠశాలలు, కళాశాలల బస్సులు ఉండగా వాటిలో యోగ్యత పత్రం 798కే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 149 బస్సులకు ఆర్టీఏ అధికారులు గతంలోనే నోటీసులను అందజేశారు. మరో 100 బస్సులు చిన్న మరమ్మతులు చేపట్టాల్సినవి ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వాటికి నోటీసులను జారీ చేశారు. నోటీసులు అందుకున్న బస్సులు తప్పనిసరిగా మరమ్మతులు చేశాక మరోసారి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొచ్చి నడిపేందుకు అనువుగా ఉన్నట్లు యోగత్య పత్రం పొందాలి. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టారు. 

చర్యలు తప్పవు

-డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ 

పాఠశాలలు, కళాశాలల బస్సులకు ఫిట్‌నెస్‌ ఉంటేనే రోడ్లపై అనుమతిస్తున్నాం. లేకుంటే వెంటనే వాటిని పట్టుకుని నోటీసులు అందిస్తున్నాం. కాలం చెల్లిన పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల ఆర్‌సీలను యాజమాన్యాలు తక్షణమే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికారులకు అందజేయాలి.  మరమ్మతుల కోసం ఇచ్చిన గడువులోగా చేయించి మళ్లీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలి. దాదాపు 95 శాతం బస్సులు ఫిట్‌నెస్‌తోనే కొనసాగుతున్నాయి. మిగిలిన వాటిని పరిశీలించాకే  రోడ్లపైకి అనుమతిస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని