logo

అంగన్‌వాడీ.. గాడిన పడేలా!

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు లబ్ధిదారులకు సక్రమంగా చేరడం లేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికే అందించేలా ప్రభుత్వం అంగన్‌వాడీల ఆధ్వర్యంలో నేషనల్‌ న్యూట్రీషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్‌) అనే ప్రత్యేక యాప్‌ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

Published : 18 Jun 2024 04:01 IST

ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్, సూపర్‌వైజర్‌

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు లబ్ధిదారులకు సక్రమంగా చేరడం లేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికే అందించేలా ప్రభుత్వం అంగన్‌వాడీల ఆధ్వర్యంలో నేషనల్‌ న్యూట్రీషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్‌) అనే ప్రత్యేక యాప్‌ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. దీని ద్వారా లబ్ధిదారుల సరైన సంఖ్య తెలియడంతో పాటు చిన్నారుల ఆరోగ్య వివరాలు నమోదయ్యే అవకాశం ఉంది.

-న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు లబ్ధిదారులకు సక్రమంగా చేరడం లేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికే అందించేలా ప్రభుత్వం అంగన్‌వాడీల ఆధ్వర్యంలో నేషనల్‌ న్యూట్రీషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్‌) అనే ప్రత్యేక యాప్‌ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. దీని ద్వారా లబ్ధిదారుల సరైన సంఖ్య తెలియడంతో పాటు చిన్నారుల ఆరోగ్య వివరాలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంతో అవసరం.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తప్పనిసరి.. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై సరైన అవగాహన లేకపోవడంతో అనేక రుగ్మతలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిండ్లు అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కదారి పట్టకుండా, అర్హులకు అందేలా తాజాగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

చిన్నారుల ఆరోగ్యంపైనా..

ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో సుమారు 14 రకాల రిజిస్టర్లను నమోదు చేసేవారు. నూతనంగా వచ్చిన యాప్‌ ద్వారా రిజిస్టర్లు నిర్వహించే అవసరం లేకుండా అన్ని వివరాలను అందులో నమోదు చేస్తే రాష్ట్రస్థాయి అధికారుల వరకు కేంద్రం పనితీరు, తదితర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌ ద్వారా ప్రతి నెలా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు తదితర ఆరోగ్య వివరాలను నమోదు చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అదనపు పౌష్టికాహారం అందించడం, అవసరమైన చికిత్స అందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. పిల్లల ఫొటోలను ప్రతి నెలా తీసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండటంతో పిల్లలను కచ్చితంగా కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రంలో హాజరుశాతం కూడా పెరగనుందని అధికారులు తెలుపుతున్నారు.

ఇంటింటికి తిరిగి వివరాల సేకరణ

  • నేషనల్‌ న్యూట్రీషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్‌) సర్వేను ఇంటింటికి తిరుగుతూ నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ ఆయా, టీచర్, సూపర్‌వైజర్‌ల ఆధ్వర్యంలో సర్వే కార్యక్రమం జరుగుతుండగా సీడీపీవోలు, డీడబ్ల్యూవో సర్వే సక్రమంగా నిర్వహించేలా క్షేత్ర పర్యటనలు చేస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. 
  • ఇంటింటి సర్వే ప్రతి సంవత్సరం నిర్వహించనున్నారు. ఒక ఇంటిలో ఉండే కుటుంబ సభ్యుడి ఆధార్‌తో సహా అందరి వివరాలను నమోదు చేస్తారు. దీంతో ఆ ఇంటిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎంతమంది ఉన్నారనే విషయం కచ్చితంగా తెలియనుంది.
  • గతంలో లబ్ధిదారుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడంతో ఒక అంగన్‌వాడీ కేంద్రంలో నమోదైన లబ్ధిదారులు వేరొక గ్రామం వెళ్తే.. అక్కడి కేంద్రంలోనూ నమోదై ఉండేవారు. అయితే పోషకాహారం మాత్రం లబ్ధిదారులు ఒకే కేంద్రం వద్ద తీసుకున్నా మరొక కేంద్రంలో వారి పేరిట పోషకాహారం పక్కదారి పట్టిన సందర్భాలు ఉన్నాయి.
  • సర్వేలో కుటుంబ సభ్యుల ఆధార్‌తో సహా అన్ని వివరాలను నమోదు చేయడం ద్వారా ఒకే కేంద్రంలో లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది. మరొక కేంద్రంలో వారి వివరాలను నమోదు చేస్తే ఆన్‌లైన్‌లో వేరే కేంద్రంలో నమోదు చేసినట్లు చూపించనుంది. 
  • ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పౌష్టికాహారం కూడా ఈ సర్వేపైన ఆధారపడనుంది. లబ్ధిదారుల వివరాలు కచ్చితంగా తెలియడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పౌష్టికాహారం లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వస్తుంది. దీంతో ఎలాంటి అక్రమాలు లేకుండా  అసలైన లబ్ధిదారులకే అందనుంది. 

ఎక్కడి నుంచైనా పరిశీలన చేయవచ్చు..

- నాగేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి, భూపాలపల్లి 

సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మారుమూల గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించే అవకాశం ఉంటుంది. పిల్లల్లో కలిగే అనారోగ్య సమస్యలు త్వరగా తెలుసుకుని వారికి అవసరమయ్యే పౌష్టికాహారం అందించవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన లబ్ధిదారులకు అనుగుణంగా అవసరమైన పౌష్టికాహారం ప్రభుత్వం నుంచి అందించే అవకాశం ఉంటుంది. సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తవుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు