logo

అధికారులకు చెప్పినా.. ఆగని మట్టి తరలింపు

వర్ధన్నపేట శివారులోని అక్కకుంట, ఉప్పరపల్లి గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో ఆదివారం రాత్రి నుంచి ఇటుకల బట్టి వ్యాపారులు వందల సంఖ్యలో టిప్పర్లలో మట్టి తరలించారు.

Published : 18 Jun 2024 04:06 IST

సెలవు రోజుల్లో  జోరుగా అక్రమ రవాణా


ఉప్పరపల్లి ఎల్లమ్మ చెరువులో తవ్వకాలు

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: వర్ధన్నపేట శివారులోని అక్కకుంట, ఉప్పరపల్లి గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో ఆదివారం రాత్రి నుంచి ఇటుకల బట్టి వ్యాపారులు వందల సంఖ్యలో టిప్పర్లలో మట్టి తరలించారు. ఈ విషయాన్ని రైతులు, గ్రామస్థులు ఆదివారమే ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సోమవారం అటువైపు ఒక్కరూ రాలేదు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు అక్రమార్కులు యథేచ్ఛగా వాహనాల్లో మట్టి తరలించారు.

ఉప్పరపల్లి ఎల్లమ్మ చెరువు, అక్కకుంట నుంచి మట్టి తరలించడానికి దళారులు గ్రామంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు రోజుకు రూ.1.50 లక్షలు, అక్కకుంటలో మట్టి తరలింపునకు రూ.6 లక్షల వరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా కొంత డబ్బు సైతం గ్రామంలోని పెద్ద మనుషులకు దళారులు అందజేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఆది, సోమవారాలు సెలవులు ఉండడంతో అధికారులు అంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇదే అదనుగా దళారులు మట్టి తరలింపునకు పాల్పడినట్లు గ్రామస్థులు, రైతులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సమీపంలోని భూముల్లో నుంచి టిప్పర్లు వెళ్తుండటంతో తమ పంటలు పాడవుతున్నాయని పలువురు రైతులు టిప్పర్లను అడ్డుకున్నారు. తమ భూములను పాడు చేయొద్దని రైతులు వేడుకున్నా.. తప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తామని బెదిరింపులకు దిగినట్లు స్థానికులు వాపోయారు. మట్టి మాఫియా నుంచి భూములను రక్షించాలని అధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నుంచి సోమవారం వరకు మట్టిని తరలిస్తున్నా.. ఒక్క అధికారి కూడా రాకపోవడంపై గ్రామస్థులు, రైతులు మండిపడుతున్నారు.

స్పందించి అడ్డుకోవాలి..

-జన్ను నర్సయ్య

అక్రమంగా మట్టి తరిస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సరైన పత్రాలు లేకుండా అక్రమార్కులు రెండు రోజులుగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వెంటనే అధికారులు స్పందించి మట్టి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని