logo

కదలని చెత్త.. తీరని చింత

బల్దియాలో చెత్త చింత తీరడం లేదు. ఇంటింటా సేకరించిన చెత్త, ప్రధాన, అంతర్గత రహదారుల్లో పోగవుతున్న వ్యర్థాలను డంప్‌ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. రాంపూర్‌ డంపింగ్‌యార్డు వ్యర్థాలతో నిండిపోయింది.

Updated : 18 Jun 2024 06:05 IST

రాంపూర్‌ డంపింగ్‌ యార్డులో నిలిచిన వాహనాలు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: బల్దియాలో చెత్త చింత తీరడం లేదు. ఇంటింటా సేకరించిన చెత్త, ప్రధాన, అంతర్గత రహదారుల్లో పోగవుతున్న వ్యర్థాలను డంప్‌ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. రాంపూర్‌ డంపింగ్‌యార్డు వ్యర్థాలతో నిండిపోయింది. రోజూ అక్కడికి చెత్త వేయడానికి వెళ్తున్న వాహనాలు దిగబడుతున్నాయి. ఈ వర్షాకాలంలో సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సోమవారం నగర పర్యటనలో చెత్త కుప్పలను చూసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఆధునిక చెత్త రవాణా కేంద్రాలు అందుబాటులోకి రావడం లేదు. రోజురోజుకు చెత్త డంపింగ్‌ గ్రేటర్‌ వరంగల్‌ ప్రజారోగ్య విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌ పేరుకే స్మార్ట్‌సిటీ.. ఘన వ్యర్థాల నిర్వహణ(సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌), నిబంధనల అమలులో వెనుకబడుతోంది. చెత్త శుద్ధీకరణ సరిగా లేకపోవడంతో గత మూడు, నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో వరంగల్‌ నగరానికి మార్కులు తగ్గాయి.

గుట్టల్లా వ్యర్థాలు

  • రాంపూర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త వేసేందుకు స్థలం లేకపోవడంతో వాహనాల డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు బయోమైనింగ్‌ విధానం ద్వారా చెత్తను శుద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకు సుమారు 4లక్షల పైచిలుకు వ్యర్థాలు పోగైనట్లు అంచనా. 
  • నగరంలోని 66 డివిజన్లలో రోజూ 280-300 టన్నుల చెత్త పోగవుతోంది. రాంపూర్‌ డంపింగ్‌యార్డుకు 350 వాహనాలు వస్తాయి. ప్రధాన, అంతర్గత రోడ్లలో గుట్టల్లా చెత్త పేరుకుపోయింది.

హిటాచీలకు మరమ్మతులు

రాంపూర్‌ డంపింగ్‌యార్డు నిండిపోవడానికి హిటాచీ వాహనాలే కారణమని తెలిసింది. వాహనాల్లో తీసుకువచ్చిన వేసిన చెత్తను పక్కకు నెట్టేందుకు మూడు హిటాచీలు పనిచేసేవి. మరమ్మతుల పేరుతో మూడునెలలుగా హిటాచీలను మూలన పడేశారు. జేసీబీ, డోజర్లు వినియోగిస్తున్న వ్యర్థాలు కదలడం లేదని తెలిసింది. హిటాచీల మరమ్మతులకు రూ.3- 4 లక్షలు ఖర్చవుతాయి. ఈ విషయంలో ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

త్వరలో అందుబాటులోకి వాహనాలు

- సంజయ్, ఇన్‌ఛార్జి ఈఈ, వాహనాల విభాగం

మూడు హిటాచీలు మరమ్మతులకు గురయ్యాయి. బాగు చేయడానికి నిధులు విడుదల చేశారు. మూడు, నాలుగు రోజుల్లో వాటిని అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని