logo

రక్షణకవచ్‌ ప్రశ్నార్థకం!

‘‘రెండు రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వెంటనే వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్‌ వ్యవస్థ’ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది.. సోమవారం ·బెంగాల్‌లో ఒకే పట్టాల మీదకు రెండు రైళ్లు రావడంతో ఘోరం జరిగింది.

Updated : 18 Jun 2024 05:59 IST

మూడేళ్లుగా పట్టాలెక్కని ప్రతిపాదన 

‘‘రెండు రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వెంటనే వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్‌ వ్యవస్థ’ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది.. సోమవారం ·బెంగాల్‌లో ఒకే పట్టాల మీదకు రెండు రైళ్లు రావడంతో ఘోరం జరిగింది. అక్కడ కవచ్‌ వ్యవస్థ ఉంటే.. ప్రమాదం జరిగేది కాదని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.’’

న్యూస్‌టుడే, కాజీపేట: కాజీపేట- సికింద్రాబాద్‌ మార్గంలో కవచ్‌ ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2022 సంవత్సరం మార్చి 4న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వికారాబాద్‌- లింగంపల్లి మధ్య ప్రయోగాత్మకంగా కవచ్‌ వ్యవస్థను పరిశీలించి విజయవంతం చేశారు. ఆ తర్వాత కాజీపేట- సికింద్రాబాద్‌ మార్గంలో కవచ్‌ను అభివృద్ధి చేస్తారని ప్రకటించారు. కానీ, ఆర్థిక భారంతో మూడేళ్లుగా కవచ్‌ జాడ కనిపించడం లేదు.

పురుడు పోసుకుంది  కాజీపేటలోనే..

లింగంపల్లి- వికారాబాద్‌ మధ్యలో ఏర్పాటు చేసిన కవచ్‌ విధానం కాజీపేటలోనే పురుడు పోసుకుంది. విద్యుత్తు లోకోషెడ్‌లోని ఇంజినీర్లు లోకోలకు కవచ్‌ పరికరం అమర్చడం.. సంబంధిత సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఇక్కడే చేశారు. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికీ కాజీపేటకే అవకాశం కల్పించారు.

కవచ్‌ పరికరం

గోల్కొండ ప్రమాదం గుర్తుకొచ్చింది.

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ 2003వ సంవత్సరం జులై 2న బ్రిడ్జి మీద నుంచి రోడ్డుపై పడటంతో 22 మంది దుర్మణం చెందారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న రైలు వరంగల్‌ రాగానే ఎర్రలైటు వెలుగుతోంది. అయినా వేగం తగ్గలేదు. స్టేషన్‌మాస్టర్‌ గమనించి లూపు లైనులోకి పంపారు. ఈ క్రమంలో డ్రైవరు గమనించి బ్రేకులు వేశారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. వరంగల్‌ అండర్‌బ్రిడ్జి నుంచి రైలు బోగీలు కిందకు పడిపోయాయి. అప్పటి నుంచే కాజీపేటలో రైలు ప్రమాదాల నివారణకు ప్రయోగాలు జరుగుతున్నాయి. కవచ్‌ను అభివృద్ధి చేశారు. గోల్కొండ ప్రమాదానికి ముందే కవచ్‌ ఉంటే ఎర్రలైటును గమనించి రైలు డ్రైవరు ప్రమేయం లేకుండా ఆగిపోయేది. ఇప్పటికైనా కవచ్‌ను అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కవచ్‌ అంటే..?

రెండు రైళ్లు ఒకే రైలు పట్టాల మీదకు వచ్చినా.. ఎర్ర లైటు వెలుగుతున్నప్పుడు.. ప్రమాదం పొంచి ఉంటే.. రైలు దానికదే ఆగేలా చేసే ఆధునిక వ్యవస్థ ఈ కవచ్‌.. రైలు ఇంజిన్‌లో కవచ్‌ పరికరం అమర్చుతారు. ప్రతి పది కి.మీకి ఒక టవర్‌ చొప్పున ఏర్పాటు చేస్తారు. జీపీఎస్‌ సిస్టంతో కవచ్‌ ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి దానికదే బ్రేకులు వేసుకుంటుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 25 శాతం మేర అమర్చారు. టవర్ల నిర్మాణం, రైల్వేస్టేషన్లను పునర్నిర్మించడం లాంటి పనులు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో రైల్వే శాఖ కొంత వెనకడుగు వేస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా లింగంపల్లి- వికారాబాద్‌ సెక్షన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత కవచ్‌ నిర్మాణ పనుల్లో వేగం తగ్గిపోయింది. ప్రస్తుతం రైల్వే మూడోలైను పనులపై మాత్రమే దృష్టి సారించింది. అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధి, మూడో లైను పనుల కారణంగా కొంత ఆలస్యం అవుతోందని, కవచ్‌ నిర్మాణానికి రైల్వే కట్టుబడి ఉందని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

2022 సంవత్సరంలో కాజీపేట విద్యుత్తు లోకోషెడ్‌లో ఒక లోకోకు కవచ్‌ పరికరం అమరికలో నిమగ్నమైన సిబ్బంది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని