logo

ఔషధ మొక్కల గుట్ట.. మల్లూరు

 కొలువైన హేమాచలుడు.. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, చింతామణి సరస్సు.. ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకునే మల్లూరు గుట్ట.. అరుదైన వందలాది ఔషధ మొక్కలకూ నిలయమే.

Updated : 20 Jun 2024 05:36 IST

కొలువైన హేమాచలుడు.. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, చింతామణి సరస్సు.. ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకునే మల్లూరు గుట్ట.. అరుదైన వందలాది ఔషధ మొక్కలకూ నిలయమే. సుమారు 500లకు పైగా రకాలు..  మూలికా, ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తుంటారు. చాలా అరుదుగా దొరికే మొక్కలను కాపాడుకునేలా హెర్బల్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇప్పటికైనా వీటి రక్షణకు పాటుపడాల్సిన అవసరముంది.

అనేక రకాలు..

నేలతాటి, నేలగుమ్మడి, సరస్వతి, పిల్లడుగు తీగ, కాకిజంగా, ఈశ్వరి, దేవపత్రం, అడవి ఉసిరి, అడవి తులసి, కొండ పసుపు, అతుకుడు తీగ, మారేడు, చెంగల్వగడ్డ, పూర్యభక్త, శతావరి, తెల్లగురిజ, నేల ఉసిరి, నరమామిడి, రత్న పురుష, పొడపత్రి, సర్పగంధ, కొరివి చెట్టు, చాకలి తీగ, ఉడుం గడ్డలు, అడవి పొనుగు, అడవి మునగ, తునిబంధ, సుగంధపాల, అడవి ఉల్లిగడ్డ, బొద్దితీగ, వెల్లేరు గడ్డ, కలుగోడు, కారంగి, విష్ణుకాంత, దూడమద్ది, పూమారేడు, పులుగోడు చెట్టు, నరమాను, గామిడిచెట్టు, నులిచెట్టు, కలింద తీగ, తలంటితీగ, పాలబిందె, నింపాది చెట్టు, లొటారి తీగ, పాలమీగడ తీగ, బలనేల తీగ, బాలసూరి, పెద్దేగి, ఫలగంజి, తైసీ చెట్టు, నీలదొండ, మునిరేట, ఎలుకచెవ్వు, నల్ల చెన్నగడ్డ, మునిరేట, అడవి జనప, ఏనుగ పరిక, నేలవేమి, రాగిహంస, కాకిదొండ, కృష్ణకుమారి, అంత్రపాసి, కోరింద చెట్టు, బొజ్జచెట్టు, మదన బుడత, మొర్లిచెట్లు, ముదర బెండతో పాటు అనేక రకాల ఔషధ మొక్కలున్నాయి.

24 ఏళ్ల నాడే గుర్తింపు..

మల్లూరు గుట్టపై 500కు పైగా ఔషధ మొక్కలున్నట్లు 24 ఏళ్ల కిందటే వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఎన్‌డీఏ (యునైటెడ్‌ నేషన్‌ డెవలప్‌మెంటు ప్రోగ్రాం), ఎంవోఈఎఫ్‌ (మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌) సంయుక్తంగా చేపట్టిన ర్యాపిడ్‌ అసెస్‌మెంట్‌ సర్వేలో సుమారు 200 హెక్టార్లలో  ఇవి విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 2000 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని ఔషధ మొక్కల పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించారు.

అటకెక్కిన హెర్బల్‌ పార్కు ప్రతిపాదన

ఈ ప్రాంతంలో హెర్బల్‌ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అభివృద్ధి పనులు గానీ, వీటి సంరక్షణపై దృష్టి సారించలేదు. గుట్టపై ఇన్ని మొక్కలు ఉన్నా.. వాటిపై దృష్టి పెట్టకపోవడంతో కనుమరుగైపోతున్నాయి. అపార ఔషధ సంపదను భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అంతరించిపోతున్న అరుదైన జాతి మొక్కలను కాపాడుకునే వీలుంటుంది.  

పరిరక్షణ చర్యలు చేపట్టాలి..

గుట్టపై ఉన్న మొక్కలు అంతరించిపోతున్నాయి. వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాలి. హెర్బల్‌ పార్కును ఏర్పాటు చేసి, వృక్షశాస్త్ర అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దాలి. అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మూలికా వైద్యానికి చక్కగా పని చేస్తాయి..

గుట్టపై వందలాది ఔషధ మొక్కలున్నాయి. మూలికా వైద్యానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మా పూర్వీకుల నుంచి  వాటి ఉపయోగాలను తెలుసుకున్నాను. అడిగిన వారికి అన్ని వివరాలను చెబుతున్నాను.

 కైంకర్యం రాఘవచార్యులు, మల్లూరు ఆలయ ప్రధాన అర్చకులు

ప్రత్యేక చర్యలు చేపట్టాలి

ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు, ఇతర వ్యర్థాలతో గుట్టపై పర్యావరణం దెబ్బతింటోంది.  పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. అరుదైన మొక్కలను కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం సైతం ముందుకొచ్చి తగిన ప్రోత్సాహం అందించాలి.

 సుతారి సతీశ్, వృక్షశాస్త్రవేత్త

ప్రత్యేక చర్యలు తీసుకుంటాం..

ఔషధ మొక్కల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ముందుగా స్థానికులు, వృక్షశాస్త్రవేత్తలు, బాటనీ ప్రొఫెసర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. వారితో ఇక్కడ ఎన్ని రకాలవి ఉన్నాయి.. వాటి వివరాలను తీసుకుంటాం. ప్రభుత్వ సహకారంతో అవసరమైన రక్షణ చర్యలు చేపడతాం.

 రాహుల్‌ కిషన్‌ జాదవ్, డీఎఫ్‌ఓ ములుగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని