logo

మినీ ట్యాంక్‌బండ్‌పై కొరవడిన చిత్తశుద్ధి!

జనగామ పట్టణంలో ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు ఎలాంటి పార్కులు లేవు. మున్సిపల్‌ పట్టణంగా, డివిజన్‌ కేంద్రంగా ఉంటూ ఎనిమిదేళ్ల క్రితం జిల్లా కేంద్రంగానూ ఆవిర్భవించినా, ప్రజలకు ఆహ్లాదం కోసం పార్కులు మాత్రం కరవయ్యాయి.

Published : 20 Jun 2024 04:51 IST

బతుకమ్మకుంట ముఖద్వారం

జనగామ టౌన్, న్యూస్‌టుడే: జనగామ పట్టణంలో ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు ఎలాంటి పార్కులు లేవు. మున్సిపల్‌ పట్టణంగా, డివిజన్‌ కేంద్రంగా ఉంటూ ఎనిమిదేళ్ల క్రితం జిల్లా కేంద్రంగానూ ఆవిర్భవించినా, ప్రజలకు ఆహ్లాదం కోసం పార్కులు మాత్రం కరవయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాగా మారకముందే 2014లో అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియోజకవర్గానికి మణిహారంగా ఉండేలా సూర్యాపేట రోడ్డు వైపు రెండో వార్డు పరిధిలో పది ఎకరాల సువిశాలంగా ఉన్న పాత ధర్మోనికుంటను బతుకమ్మకుంటగా పేరు మార్చి మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టారు. దీనిని ప్రజలు వాకింగ్‌ ట్రాక్‌గా, ఆహ్లాదానికి పార్కుగా వినియోగించుకుంటున్నారు. అయితే ప్రణాళిక బద్ధంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, కొన్నేళ్లుగా ఈ మినీ బండ్‌ అభివృద్ధిని పట్టించుకునే వారు కరవయ్యారు.

ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందడుగు..

పాత ధర్మోనికుంటను అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రజలు, వివిధ వ్యాపార వర్గాల సహకారంతో రూ.40లక్షల వరకు పోగు చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వం నుంచి మరో రూ.కోటిన్నర వరకు బతుకమ్మకుంటకు నిధులు వెచ్చించి నీటి కోసం బోరుతో పాటు వాకింగ్‌ ట్రాక్‌  తదితర నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులోనే వీఐపీలు వచ్చే సమయంలో హెలీప్యాడ్‌ కూడా నిర్మించారు. పది ఎకరాల్లో పదేళ్లుగా జనగామ పట్టణానికి మణిహారంగా కుంట నిలుస్తోంది. వేడుకల నుంచి మొదలుకొని వాకింగ్‌ ట్రాక్‌ వరకు నిర్మాణంతో సువిశాల పనులు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు వేలాదిగా వస్తుంటారు.

సమస్యలు నెలవై.. ఆహ్లాదం కరవై..

బతుకమ్మకుంట చెరువులాగా ఉండటంతో బోటింగ్‌ ఏర్పాటు చేయాలని, అలాగే చిన్న పిల్లలకు ఆట వస్తువులు తీసుకురావాలని, జిమ్‌ పరికరాలు అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. ఇప్పటికే జనగామ పట్టణ ప్రజలే కాకుండా జిల్లాలోని పలు మండలాల ప్రజలు ఆహ్లాదానికి ఇక్కడికి వస్తుంటారు. అయితే ప్రతిపాదిత బోటింగ్‌ ఏర్పాటు చేయడం, మరింత సుందరీకరణ పనులు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సిద్దిపేట కోమటిచెరువు స్థాయిలో అభివృద్ధి చేయడానికి తొలుత ప్రారంభించినా, అంతంత మాత్రమే జరుగుతున్నాయి. రాత్రిపూట సరిగ్గా విద్యుత్‌ దీపాలు వెలగకపోవడం, మైదానంలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ చొరవ తీసుకొని బండ్‌ అభివృద్ధికి పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.2 కోట్లు మంజూరు..

జిల్లా కేంద్రంలోని మినీట్యాంకు బండ్‌ నిర్మాణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి గాను మున్సిపల్‌ నిధుల నుంచి రూ.2కోట్లను ఇప్పటికే కేటాయించాం. టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇంతకు ముందు ఎన్నికల కోడ్‌తో పనులు నిలిచాయి. త్వరలో మొదలుకానున్నాయి. ఇంకా మిగిలిన వాటిపై అందరి అభిప్రాయాల మేరకు చేపడతాం.

 పోకల జమున, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని