logo

ప్రజా సమస్యలు పట్టని సమావేశాలెందుకు?

ప్రజా సమస్యలు పట్టని, ప్రజలకు ఉపయోగం లేని కౌన్సిల్‌ సమావేశాలు ఎందుకని ప్రశ్నిస్తూ జనగామ పురపాలిక కౌన్సిలర్లు నిరసన గళం వినిపించారు.

Published : 20 Jun 2024 04:52 IST

నిరసనల మధ్య పుర సమావేశం

అదనపు కార్మికుల నియామకం కోరుతూ పోడియం ముందు బైఠాయించిన కౌన్సిలర్లు

జనగామ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు పట్టని, ప్రజలకు ఉపయోగం లేని కౌన్సిల్‌ సమావేశాలు ఎందుకని ప్రశ్నిస్తూ జనగామ పురపాలిక కౌన్సిలర్లు నిరసన గళం వినిపించారు. పురపాలిక సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్‌ పి.జమున అధ్యక్షతన బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎజెండా అంశాలపై చర్చకు ముందు సభ్యులు పట్టణ సమస్యలపై మాట్లాడారు.

బైఠాయింపులు, వాకౌట్‌ల నడుమ..

పట్టణ విస్తరణను దృష్టిలోఉంచుకొని పారిశుద్ధ్య విభాగానికి అదనంగా 22 మంది కార్మికుల నియామకానికి రెండేళ్ల క్రితం కౌన్సిల్‌లో ప్రతిపాదించగా, నలుగురినే చేర్చుకున్నారని, మిగిలిన వారిని కూడా తీసుకోవాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ జి.మల్లేశం, భాజపా ఫ్లోర్‌లీడర్‌ హరిశ్చంద్రగుప్త డిమాండ్‌ చేశారు. పోడియం ముందు బైఠాయించి, నిరసన తెలిపారు. 17వ వార్డు సభ్యురాలు జక్కుల అనిత తన వార్డులో మధ్యంతర విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు నాలుగేళ్లుగా పోరాడుతున్నా.. నెరవేర్చడం లేదని సభ నుంచి వాకౌట్‌ చేశారు.

వెల్లువెత్తిన సమస్యలు..

ఆస్తిపన్నులు, ట్రేడ్‌లైసెన్సు పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గాదెపాక రాంచందర్‌ ఆరోపించారు. పట్టణంలో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఊడ్గుల శ్రీలత వివరించారు. ఆరో వార్డులో మంజూరైన అభివృద్ధి పనులు జరగడం లేదని వంగాల కళ్యాణి అన్నారు. 11వ వార్డులో రైల్వే చిన్న కల్వర్టు మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని నాలుగున్నరేళ్లుగా ప్రస్తావిస్తున్నా పట్టించుకోవడం లేదని పాక రమ నిరసన తెలిపారు. 13వ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని చంద్రకళ డిమాండ్‌ చేశారు. పట్టణంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, ఇతర అంశాలపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలను ఉటంకిస్తూ కౌన్సిలర్‌ ఎం.పాండు వివరణ కోరారు. 14వ వార్డులో పారిశుద్ధ్యం సక్రమంగా జరగడం లేదని పేర్ని స్వరూప అధికారులను వివరణ కోరారు. ప్రధాన రహదారుల వెంట అనుమతి లేకుండా షెడ్ల పేరిట నిర్మిస్తున్న వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 సమావేశంలో 31 ప్రస్తావనలకు గాను ఐదు అంశాలను వాయిదా వేశారని కమిషనర్‌ వెంకటేశ్వర్లు ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మేకల రాంప్రసాద్, మున్సిపల్‌ ఇంజినీర్‌ మహిపాల్, మేనేజర్‌ రాములు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని