logo

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు పరిష్కారమెప్పుడో?

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌(ఎల్‌ఆర్‌ఎస్‌)కు ఎదురు చూస్తున్న వారికి జనవరి నెలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు.

Published : 20 Jun 2024 04:57 IST

అనుమతి లేని వెంచరు 

భూపాలపల్లి, న్యూస్‌టుడే: లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌(ఎల్‌ఆర్‌ఎస్‌)కు ఎదురు చూస్తున్న వారికి జనవరి నెలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చూస్తామని ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి. వరుస ఎన్నికలతో అధికారుల పని ఒత్తిడి కారణంగా దస్త్రాలు కదలని పరిస్థితి. ఎన్నికల కోడ్‌ ముగిసి, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై దృష్టి పెడతారని అందరూ ఆశిస్తుండగా.. పరిశీలన మాత్రం ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు.

3,470 దరఖాస్తులు

అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లలో కొన్ని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలంటే వెంటనే రూ.1000 చెల్లించాలంటూ 2020లో అప్పటి ప్రభుత్వం చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మూడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం గడువు విధించగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఊహించిన వాటికంటే ఎక్కువే వచ్చాయి. మొత్తం 3470 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పురపాలక సంఘానికి రూ.3 కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది. వీటన్నింటినీ ప్రస్తుతం పరిశీలించాలంటే, పట్టణ ప్రణాళిక విభాగంలో సిబ్బంది కొరత లేకుండా ఉండాలి.  మొదటి నుంచి భూపాలపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పూర్తి స్థాయిలో లేని కారణంగా ఇప్పటికే నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ అంచనాల ప్రకారం 14 శాతం అదనపు పన్నులతో అనుమతులు పొంది నిర్మాణాలు చేసుకున్నవి కూడా లేకపోలేదు. ఇంటి నిర్మాణాలను టీపాస్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా అడిగే పరిస్థితి ఉండగా.. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన గాలికొదిలేశారు.

దరఖాస్తుదారుల ఎదురుచూపులు..

భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతం శరవేగంగా ఎంతో అభివృద్ధి చెందుతుండటంతో ఐదేళ్ల క్రితమే స్థిరాస్తి వ్యాపారులు అధికంగా వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్ల విక్రయాలను చేపట్టారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతోపాటు మంజూరునగర్‌ ప్రాంతంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నిర్మించడం,  వంద పడకల ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల రావడంతో మున్సిపాలిటీ పరిధిలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఐదేళ్ల క్రితమే పంట పొలాలను సైతం వదలకుండా రియల్టర్లు కొందరు అనుమతులు లేని వెంచర్లు ఏర్పాటు చేస్తూ, అమ్మకాలు కొనసాగించారు. లే అవుట్‌ అనుమతి లేని వెంచర్లలో నివేశ స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఇంటి నిర్మాణ అనుమతులు లభించకున్నా కొంతమంది అక్రమంగానే నిర్మాణం చేపడుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో లెక్కకు మించి ఉన్న దరఖాస్తుల్ని పరిశీలించడం సాధ్యాసాధ్యాలను అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై భూపాలపల్లి పట్టణ ప్రణాళిక అధికారి సునీల్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ‘టీపీబీవోలు ఇద్దరు, టీపీఎస్‌ ఒకరు మొత్తం మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను ప్రభుత్వం కూడా తొందరలో నియమించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు కూడా సాధ్యమైనంత తొందరలోనే పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటామ’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు