logo

అవినీతికి చిరునామా.. ఆర్టీవో కార్యాలయం!

మహబూబాబాద్‌ రవాణాశాఖ (ఆర్టీవో) కార్యాలయంలోని ఉద్యోగుల పనితీరు వివాదాస్పదంగా మారింది.

Published : 20 Jun 2024 05:01 IST

వరుస ఘటనలతో తేటతెల్లం
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, నెహ్రూసెంటర్‌

మహబూబాబాద్‌ రవాణాశాఖ (ఆర్టీవో) కార్యాలయంలోని ఉద్యోగుల పనితీరు వివాదాస్పదంగా మారింది. ఏసీబీ దాడి ఘటన మరవక ముందే అందులోని పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఉద్యోగి సురేష్‌ కార్యాలయంలోనే మద్యం తాగి విధులు నిర్వహిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కార్యాలయం పేరు చెబితేనే ప్రజలు వామ్మో అంటున్నారు. అవినీతికి అడ్డాగా మారిన ఈ కార్యాలయంలో మే 28న ఏసీబీ దాడులు నిర్వహించారు. రవాణాశాఖ అధికారి డ్రైవరు వద్ద అక్రమంగా నిల్వ ఉన్న డబ్బులు పట్టుకున్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో చేతులు కలిపిన ఏజెంట్లు పనుల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేశారంటూ వారి వద్ద ఉన్న కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. ఏసీబీ దాడులతో కూడా మార్పు రాలేదు. పనుల కోసం వస్తున్న వారికి జవాబుదారీతనంగా ఉండాల్సిన ఉద్యోగి కార్యాలయంలోనే మద్యం తాగడం ఏమిటని విస్తుపోతున్నారు.

నేరుగా వస్తే కష్టాలే

నర్సింహులపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నూతనంగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ఈ నెల 5న కార్యాలయానికి షోరూం నిర్వాహకులు ఇచ్చిన అన్ని రకాల డాక్యుమెంట్లతో వచ్చారు. ఏజెంట్‌తో సంబంధం లేకుండా నేరుగా అధికారి వద్దకు వెళ్లి కాగితాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన అధికారి ఏజెంట్‌ ఎవరూ అని అడిగితే.. నేరుగా వచ్చినట్లు చెప్పారు. దాంతో అధికారి ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ లేదని పంపించడంతో బాధితుడు వెంటనే తనకు తెలిసిన మరో ఉద్యోగితో ఫోను చేయించడంతో రిజిస్ట్రేషన్‌ పని చేసి పెట్టారు. ఏజెంట్లదే హవా కొనసాగుతుందనడానికి నిదర్శనమే ఈ ఉదాహరణ.. ఇలా నేరుగా పనుల కోసం వచ్చిన వారంతా అధికారుల వ్యవహరశైలితో అవస్థలు పడి చివరకు ఏజెంట్లను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకున్న బాధితులు చాలా మంది ఉన్నారు.

అమాయకులే ఆసరాగా

కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్, రెన్యువల్‌్, వాహన రిజిస్ట్రేషన్‌ తదితర పనులపై కోసం వచ్చే ప్రజలకు అధికారులు నేరుగా ఏ పని చేయరు. అక్కడ ఏ పని చేయాలన్నా చేయాల్సింది ఏజెంట్లే. పని కోసం కార్యాలయం ఆవరణలో అడుగుపెడితే చాలు అక్కడి పరిసరాల్లో ఎటు చూసినా కనిపించేది ఏజెంట్లే. వచ్చిన వారిలో అమాయకులను ఆసరాగా చేసుకుని బేరసారాలు కొనసాగిస్తారు. ఇలా ఏజెంట్లు జిల్లాలో సుమారు 40 మంది వరకు ఉన్నారు. పనిని బట్టి ధరను నిర్ణయిస్తారు. లైసెన్స్‌కు ఇప్పించినందుకు తమ ఫీజుగా రూ.1500 తీసుకుంటున్నారు. వాహనాలకు నెంబర్‌ ప్లేట్‌ పేరిట రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అవినీతి అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ పనుల కోసం వస్తున్న ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని