logo

ఉత్కంఠకు తెర..!

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ నెల 8 నుంచి ఈ ప్రక్రియకు జిల్లాలోనూ శ్రీకారం చుట్టారు.

Published : 20 Jun 2024 05:04 IST

517 మంది  ఉపాధ్యాయులకు పదోన్నతులు

కంబాలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్థన్‌తో
(మధ్యలో) పదోన్నతులతో చేరిన నలుగురు ఉపాధ్యాయులు

మానుకోట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ నెల 8 నుంచి ఈ ప్రక్రియకు జిల్లాలోనూ శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో ప్రధాన ఉద్దేశం.. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు (ఎస్జీటీ) ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెక్టుల స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులకు (ఎస్‌ఏ) పదోన్నతులు.. ఏళ్లతరబడి తమ పోస్టులను ఉన్నతీకరించాలని ఉద్యమించిన తెలుగు, హిందీ భాషా పండితులు, పీఈటీల డిమాండ్‌ కూడా నెరవేరడంతో వారికి కూడా ఎస్‌ఏలుగా పదోన్నతులు ఇవ్వడం. ఇక ఎస్జీటీలకు బదిలీలు చేపట్టడం. షెడ్యూల్‌ ప్రకారం పదోన్నతులకు అర్హులైన ఎస్జీటీలతో తొలుత తాత్కాలిక సీనియారిటీ జాబితా, ఎస్జీటీల ఖాళీల తాత్కాలిక జాబితాను 8నుంచి 9వ తేదీ వరకు ప్రదర్శించారు. 10 నుంచి 11వ తేదీ వరకు పదోన్నతుల తాత్కాలిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం..12న పదోన్నతుల తుది జాబితా ప్రకటన...13 నుంచి 16 వరకు పదోన్నతుల వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ, పదోన్నతుల ఉత్తర్వుల జారీ.. 17న ఎస్జీటీల తాత్కాలిక సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు.. ఆ తర్వాత ఎస్జీటీల బదిలీతో ఈ ప్రక్రియ ఈ నెల 22 వరకు ముగుస్తుంది.

ఆద్యంతం ఆసక్తికరం

వివిధ కారణాల నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ నిర్వహణ కొంత ఆలస్యంగా రోజురోజుకు ఆసక్తికరంగా మలుపులు తిరిగింది. షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌ ఆప్షన్ల నమోదు 13న జిల్లాలో సాయంత్రం ప్రారంభమైంది. అది కూడా అదే రోజు రాత్రి 11 గంటల వరకే నమోదు చేసుకోవాలని 12 గంటల వరకు ఎడిట్ ఆప్షన్‌ ఇచ్చారు. దాంతో ఉపాధ్యాయులు హడావుడిగా కొందరు తమ ఇళ్లలో లాప్‌టాప్‌ల్లో.. మరికొందరు నెట్సెంటర్లకు వచ్చి ప్రక్రియను పూర్తి చేశారు. ఉపాధ్యాయులు చేసిన నమోదును 14న రద్దు చేయగా మళ్లీ చేయాల్సివచ్చింది. 15న రెండోసారి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశం ఇచ్చారు. 16న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆప్షన్ల నమోదు.. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఎడిట్ అవకాశం ఇచ్చారు. సోమవారం ఉదయం వరకే పదోన్నతుల ఉత్తర్వులు వస్తాయన్నారు. కాని రాలేదు. ఇదే ఉత్కంఠ మంగళవారం కూడా కొనసాగి ఎట్టకేలకు బుధవారం ఉదయానికల్లా ఉత్తర్వులు వచ్చాయి. దీంతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి రిలీవయి పదోన్నతి పోస్టింగ్‌ వచ్చిన పాఠశాలల్లో మధ్యాహ్నం చేరారు.

ఇక ఎస్జీటీల బదిలీ ప్రక్రియ

పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో షెడ్యూల్‌ పేర్కొన్న విధంగా ఇక ఎస్జీటీల ఖాళీల ప్రదర్శన.. బదిలీ ప్రక్రియ కూడా ఈ నెల 22 వరకు ముగియాల్సి ఉంది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 

ఎంఈవో కార్యాలయంలో సందడి..

పదోన్నతులకు వెబ్‌ ఆప్షన్లు పెట్టి ఉత్తర్వుల కోసం జిల్లాలోని పలువురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ఉత్కంఠతో ఎదురుచూశారు. బుధవారం ఉదయానికల్లా జిల్లాలోని పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారి పి.రామారావు జారీ చేశారు. వీరంతా మధ్యాహ్నానికల్లా తాము పదోన్నతి పొందిన పాఠశాలల్లో చేరాల్సి ఉంది. దీంతో పదోన్నతులు పొందినవారంతా తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి రిలీవింగ్‌ ఉత్తర్వులు పొందేందుకు మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు వెళ్లారు. ఎనిమిది మండలాలకు ఇన్‌ఛార్జి ఎంఈఓగా ఒకరే వ్యవహరిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం సందడిగా మారింది. ఉపాధ్యాయులకు రిలీవింగ్‌ ఉత్తర్వులు ఇవ్వడంతో వారంతా తమకు పదోన్నతి వచ్చిన పాఠశాలల్లో విధుల్లో చేరారు.      

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని