logo

పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌ సాధించా

ప్రాథమిక విద్య నుంచి తనను గురువు శేషాద్రి చదువు పట్ల బాగా ప్రోత్సహించారు. బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగవచ్చని సూచించారు.

Published : 20 Jun 2024 05:08 IST

జిల్లా కలెక్టర్‌ టీఎస్‌. దివాకర

ములుగు, న్యూస్‌టుడే: ప్రాథమిక విద్య నుంచి తనను గురువు శేషాద్రి చదువు పట్ల బాగా ప్రోత్సహించారు. బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగవచ్చని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనే వారని ములుగు జిల్లా పాలనాధికారి టీఎస్‌. దివాకర అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం ‘న్యూస్‌టుడే’ తో మాట్లాడారు. అమ్మనాన్నలు పెద్దగా చదువుకోలేదని, అలాంటి పరిస్థితుల్లో తమ గురువు ఇచ్చిన సలహాల మేరకు పట్టుదలతో చదివినట్లు తెలిపారు. పలు విషయాలు ఆయన మాటల్లోనే...

విద్యాభ్యాసం..

మాది కర్ణాటక రాష్ట్రం తుంకూర్‌ జిల్లా. అమ్మానాన్నలు శివకుమార్‌-ప్రేమ. నాన్న చిరువ్యాపారం చేసేవారు. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన కర్ణాటకలో నీటిపారుదల శాఖలో ఏఈగా పని చేస్తున్నారు. నేను అక్కడే 2010లో బీఈ కôప్యూటర్స్, ఈ కామర్స్, అర్కిటెక్ట్‌ చదివాను. అనంతరం 5 ఏళ్లు ఉద్యోగం చేశా. మొదటి ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపిక కాలేదు. ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా సొంతగా సన్నద్ధమై రెండో ప్రయత్నంలో 600 ర్యాంక్‌ సాధించా. బీఈ పూర్తి చేసి ఐదేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఆ ఉద్యోగాన్ని శాశ్వతంగా వదిలేశా.

పది మందికి సహాయం చేయాలనే...

పది మందికి సహాయపడి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఐదేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత సివిల్స్‌పై దృష్టి సారించా. ఉద్యోగాన్ని వదిలేసి రెండో ప్రయత్నంలో 2017లో సివిల్స్‌ సాధించా. ర్యాంకు ఆధారంగా ఒడిసా కేడర్‌లో ఎంపికయ్యాను. పెళ్లి అయిన తర్వాత తెలంగాణకు వచ్చా. నా భార్య హనుమకొండలో డీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌ పై ఆసక్తి పెరగడానికి ప్రధానంగా ఇలాగే ఉంటే నేను మాత్రమే బాగు పడతా సివిల్స్‌ సాధిస్తే పది మందికి బాగు చేయవచ్చని ఆలోచించా. అమ్మనాన్న నన్ను బాగా ప్రోత్సహించారు. దాంతో పాటు సమాజంలో ఉన్న సమస్యలు కూడా నన్ను ప్రభావితం చేశాయి. నేను ఏదో ఒకటి చేయాలనే పట్టుదల బాగా పని చేసింది. నేను చేసే ఉద్యోగాన్ని వదిలేసిన అమ్మానాన్న ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. నా ఇష్టానికే వదిలేశారు. సివిల్స్‌ కోసం ప్రయత్నం చేస్తుంటే మా సోదరుడు కూడా బాగా ప్రోత్సహించారు.

రోజుకు 10 గంటలు..

సివిల్స్‌కు ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. రోజుకు పది గంటలు సమయం కేటాయించి ఇంటి దగ్గర చదివా. సాధ్యమైనంత వరకు నాణ్యమైన మెటీరియల్‌ను సొంతంగానే సమకూర్చుకున్నా. ఎన్ని గంటలు చదివాననేది కాకుండా కొత్త అంశాలు తెలుసుకుంటూ చదివా.

సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు..

సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారు ప్రధానంగా బేసిక్స్‌ తప్పనిసరిగా పాటించాలి. ప్రమాణాలు కలిగిన పుస్తకాలను చదవాలి. ఒకసారి చదివి వదిలేయడం కాకుండా నిరంతరం అధ్యయనం చేయాలి. వాటికి తోడు వార్తాపత్రికలను చదవాలి. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. మన చదువు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి. ఈ ప్రమాణాలు పాటించి సివిల్స్‌కు సిద్ధం కావాలి. చదివింది బాగా గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే సివిల్స్‌ సాధించడం సాధ్యమవుతుంది.

  క్రీడలంటే ఇష్టం..

చిన్నప్పటి నుంచి నాకు క్రీడాలంటే చాలా ఇష్టం. ప్రధానంగా క్రికెట్, ఖోఖో ఆడడం అలవాటు. ఈ మధ్య టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకున్నా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు