logo

సికిల్‌సెల్‌ ఎనిమియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి

సికిల్‌సెల్‌ ఎనిమియా వ్యాధి రాకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ  అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

Published : 20 Jun 2024 05:10 IST

 కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు, న్యూస్‌టుడే: సికిల్‌సెల్‌ ఎనిమియా వ్యాధి రాకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ  అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ప్రపంచ సికిల్‌సెల్‌ ఎనిమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టీఎస్‌.దివాకర, అదనపు కలెక్టర్‌ పి.శ్రీజలతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు రోగ నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రికి వచ్చిన రోగిని ఇతర జిల్లాల ఆసుపత్రులకు సిఫారసు చేయకూడదన్నారు. ప్రతి ఒకరికి వైద్యం అందించాలని కోరారు. ఆసుపత్రిలో వైద్యులు లేరనే విమర్శలు రాకూడదని, సమయ పాలన పాటించాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అంకితభావంతో సేవలు అందిస్తే గిరిజనులు వైద్య అధికారులు, సిబ్బందిని గుండెలో పెట్టుకుంటారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ టీఎస్‌. దివాకర మాట్లాడుతూ.. యుక్త వయసు అమ్మాయిలలో ఎక్కువగా సికిల్‌సెల్‌ వ్యాధి వస్తోందని అన్నారు. జిల్లాలో 2300 మందికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి ఈ వ్యాధి వచ్చినట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.అప్పయ్య, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జగదీశ్వర్, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మోహన్‌లాల్, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ పి.రవీందర్, డెమో తిరుపతయ్య, మానిటరింగ్‌ సూపర్‌ వైజర్‌లు దుర్గారావు, సంపత్, భాస్కర్, సంపత్‌రావు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే ములుగు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

వెంకటాపూర్‌: ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, వైద్యం, విద్య, సంక్షేమ పథకాలను  అర్హులకు అందజేస్తూ ములుగు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం వెంకటాపూర్‌ మండల కేంద్రంలో రూ.49.53 లక్షల నాబార్డు నిధులతో సురక్షిత మంచినీటిని పైపులైను నిర్మాణం కోసం పనులకు జిల్లా కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ శ్రీజలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. పైపులైను లీకేజీలను అరికట్టి సురక్షిత తాగునీటిని అందించడానికి నిధులు మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మల్లేష్, డీఈ అజహర్‌ సయ్యద్, ఎంపీపీ బుర్ర రజిత, ఎంపీటీసీ సభ్యులు శ్రీలత, అనిత, తహసీల్దార్‌ సదానందం, ఏఈ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించాలి

ములుగు రూరల్, న్యూస్‌టుడే: పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదని, వారికి ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మండలంలోని ఇంచర్లలోని ఎంఆర్‌ గార్డెన్‌లో మంత్రి సీˆతక్క చొరవతో 52 కంపెనీలతో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్‌ శ్రీజలతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని, గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడానికి ములుగులో త్వరలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ని తెలిపారు.  జిల్లా కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ... వచ్చిన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని, యువత కష్టపడితేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. మెగా జాబ్‌ మేళాలో ఉద్యోగం సాధించిన యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 700 మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో శ్రీనివాస్‌ కుమార్, డీఎస్పీ రవిందర్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని