logo

పద్దుకు ఆమోదం లభించేనా..?

వరుస ఎన్నికల కోడ్‌తో గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా వార్షిక పద్దు(బడ్జెటు) ఇంత వరకు ఆమోదించలేదు. రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలి ప్రత్యేక అనుమతితో మూడు నెలల అత్యవసర చెల్లింపులు చేశారు.

Published : 20 Jun 2024 05:16 IST

నేడు బల్దియా ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం

మేయర్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్న భారాస కార్పొరేటర్లు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: వరుస ఎన్నికల కోడ్‌తో గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా వార్షిక పద్దు(బడ్జెటు) ఇంత వరకు ఆమోదించలేదు. రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలి ప్రత్యేక అనుమతితో మూడు నెలల అత్యవసర చెల్లింపులు చేశారు. గ్రేటర్‌ వరంగల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరం పద్దును సుమారు రూ.646 కోట్లతో కమిషనర్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరగనుంది.

వార్షిక పద్దు ఆమోదానికి రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్‌లో చేరిన మేయర్‌ సుధారాణి లక్ష్యంగా భారాస కార్పొరేటర్లు బడ్జెట్‌ సమావేశాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. భాజపా కార్పొరేటర్లు సైతం నిరసన తెలిపే అవకాశాలున్నాయి. కౌన్సిల్‌ సమావేశంలో రగడ జరిగే అవకాశాలున్నాయని తెలియడంతో గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సమావేశం

  • అవిశ్వాసం, బడ్జెట్‌ సమావేశాన్ని అడ్డుకుంటామని భారాస ప్రకటించడంతో అధికార కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులు రంగంలోకి దిగారు. బడ్జెట్‌ ఆమోదించాల్సిందేనని కార్పొరేటర్లకు సూచించారు.
  •  బుధవారం ఉదయం వరంగల్‌ పశ్చిమ కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సమావేశం హనుమకొండలో జరిగింది. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మేయర్‌ సుధారాణి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా తోట వెంకన్నను ప్రకటించారు. గురువారం ఫ్లోర్‌ లీడర్‌గా ఛాంబర్‌ ప్రారంభించాలని తీర్మానించారు.
  •  భారాసకు చెందిన ఉప మేయర్‌ రిజ్వానా షమీమ్‌పై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

పార్టీ ఫిరాయింపు కింద చర్యలు తీసుకోవాలని..

  •  భారాస నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మేయర్‌ సుధారాణి అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించొద్దని, ఆమెపై పార్టీ ఫిరాయింపు కింద తగిన చర్యలు తీసుకోవాలని భారాస కార్పొరేటర్లు బుధవారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడేను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం జరగాలని, లేకపోతే సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
  •  మేయర్‌పై అవిశ్వాసం, బడ్జెట్‌ ఆమోదం తదితర అంశాలపై చర్చించేందుకు బుధవారం హనుమకొండలో భారాస కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ప్రజల తరఫున పోరాడాలని మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, నరేందర్, ధర్మారెడ్డి కార్పొరేటర్లకు సూచించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని